లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ లెక్చరర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘డిగ్రీ కాలేజీల్లో అర్ధరాత్రి బదిలీలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.
దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యా సంవత్సరం మధ్యలో, ప్రభుత్వ ఆమోదం లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బదిలీల వ్యవహారంపై మంగళవారం ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. మరోవైపు ఈ బదిలీల వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా స్పందించారు. బదిలీలు పొందిన లెక్చరర్లను రిలీవ్ చేయవద్దని సోమవారం ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటికే బదిలీ పొందిన లెక్చరర్లంతా కొత్త స్థానాల్లో చేరిపోయారు. దీంతో బదిలీ స్థానాల్లో చేరిన తర్వాత నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని మరికొంతమంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాల్లోకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
Published date : 22 Dec 2020 06:31PM