లైఫ్ సెన్సైస్ ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్: కేటీఆర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సెన్సైస్ రంగంలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.
వెయ్యికి పైగా అంతర్జాతీయ ఆవిష్కర్తలకు సేవలు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రక్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల మెరుగుదలకు కృషి చేస్తోందన్నారు. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయి లైఫ్ సెన్సైస్ లిమిటెడ్ పరిశోధన సంస్థ విస్తరణలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన పరిశోధన, సాంకేతిక కేంద్రానికి మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. కొత్తగా ఏర్పాటైన పరిశోధన, సాంకేతిక కేంద్రం కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా జీవ ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషించాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జీనోమ్ వ్యాలీలో 83 వేల చదరపు అడుగుల్లో తాము కొత్తగా ఏర్పాటు చేసిన పరిశోధన, సాంకేతిక కేంద్రం హైదరాబాద్ లైఫ్‌సెన్సైస్ రంగానికి ఉన్న శక్తిని తెలియజేస్తోందని సాయి లైఫ్ సెన్సైస్ సీఈఓ కృష్ణ కనుమూరి వెల్లడించారు. ప్రపంచంలోనే పది అగ్రశ్రేణి ఫార్మా ఆవిష్కరణ సంస్థల్లో ఒకటిగా పేరొందిన సాయి లైఫ్ సెన్సైస్ ఇటీవల అమెరికా, యూకేలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2025 నాటికి 25 రకాలైన ప్రాణాధార ఔషధాలను తయారు చేసే దిశగా ఈ సంస్థ ప్రయత్నాలు సాగిస్తోంది. కాగా లైఫ్ సెన్సైస్ రంగంలో పేరొందిన జీనో పోలిస్ సంస్థకు కూడా కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సెన్సైస్ ఫార్మా సీఈఓ శర్తి నాగప్పన్ పాల్గొన్నారు.
Published date : 17 Aug 2020 12:57PM