Skip to main content

కొత్తగా 14 గిరిజన రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు.. ఇప్పటివరకు ఒక్కటికూడా లేదు

సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా 14 గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు గిరిజన గురుకుల సొసైటీ ప్రతిపాదనలను రూపొందించింది.
డిగ్రీలో గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా ఇప్పటి వరకు రెసిడెన్షియల్ కాలేజీల్లేవు. ప్రస్తుతం ఉన్న గిరిజన జూనియర్ కాలేజీల్లో విద్య పూర్తిచేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇబ్బందిపడుతున్నారు. డిగ్రీలో గురుకులాలు ప్రారంభమైతే ఉన్నత విద్య కూడా గిరిజనులు పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మహిళలకు, పురుషులకు, విజయనగరం జిల్లా పి.కోనవలసలో పురుషులకు, భద్రగిరిలో మహిళలకు, విశాఖ జిల్లా అరకులో పురుషులకు, విశాఖలో మహిళలకు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో పురుషులకు ఒకటి, మహిళలకు ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా కె.రామచంద్రాపురంలో పురుషులకు, కృష్ణా జిల్లా విజయవాడలో మహిళలకు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టేడులో పురుషులకు, కొండవాలూరులో మహిళలకు, అనంతపురంలో పురుషులకు, తిరుపతిలో మహిళలకు డిగ్రీ గురుకుల కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.

3 నుంచి 4 జూనియర్ కాలేజీలు
మొత్తం ఏడు కాలేజీలు మహిళలకు, ఏడు కాలేజీలు పురుషులకు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో డిగ్రీ కాలేజీ పరిధిలో మూడు నుంచి నాలుగు గిరిజన గురుకుల జూనియర్ కాలేజీలుండేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో 190 గిరిజన గురుకుల విద్యాలయాలున్నాయి. వాటిలో హైస్కూళ్లు, జూనియర్ కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 39 జూనియర్ కాలేజీలుండగా కొత్తగా మరో 8 బాలికల జూనియర్ కాలేజీల ఏర్పాటుకు గురుకుల సొసైటీ ప్రతిపాదనలను తయారుచేసింది.
Published date : 14 Dec 2020 03:43PM

Photo Stories