Skip to main content

కోవిడ్ ఎఫెక్ట్: వివిధ రంగాల్లో మహిళలకు గణనీయంగా తగ్గిన అవకాశాలు..

సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తలెత్తిన దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి.
వివిధ రంగాల్లో ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, ఇలా అన్నిస్థాయిల వ్యక్తులు, కుటుంబాలు ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ తరగతి వర్గాలకు భవిష్యత్‌పై ఆందోళనలు ఒత్తిళ్లకు గురిచేస్తున్నాయి. విభిన్న రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (ఫార్మల్ సెక్టార్‌లోని 2.1 కోట్ల శాలరీడ్ జాబ్స్‌తో సహా) భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో మహిళలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా పడటంతో ‘ఆమె’పై వివక్ష మరింత పెరుగుతోంది. ఇప్పటికే పురుషులతో పోల్చితే దాదాపుగా అన్ని రంగాల్లోని ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో చాలా తక్కువ ప్రాతినిధ్యమున్న మహిళల శాతం మరింత తగ్గిపోతోంది. గత డిసెంబర్‌లో 9.15 శాతమున్న వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఫర్ ఉమెన్ (డబ్ల్యూపీఆర్) ఈ ఏడాది ఆగస్టు కల్లా 5.8 శాతానికి తగ్గిపోయినట్టు బెంగళూరు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయిమెంట్’ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాజా పరిశోధనలో వెల్లడైంది. స్వయం ఉపాధి, తదితర రంగాల్లోని వారు ఉద్యోగం, ఉపాధి ద్వారా సంపాదించే ఆదాయంతో, లాక్‌డౌన్ విధించాక, అన్‌లాక్ మొదలయ్యాక ఉపాధి, ఉద్యోగం ద్వారా పొందే ఆదాయాన్ని పోల్చినప్పుడు ఆయా అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్వయం ఉపాధి, క్యాజువల్ వర్కర్లు, దైనందిన వేతనం/నెల జీతమొచ్చే వర్కర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు.

గణనీయంగా తగ్గిన మహిళా ప్రాతినిధ్యం..
గత డిసెంబర్‌లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళల వివరాలు, సమాచారం సేకరించి మళ్లీ వారు లాక్‌డౌన్ విధించాక ఏప్రిల్, ఆగస్టు నెలల్లో ఏం చేస్తున్నారన్న విషయాన్ని పరిశీలించారు. డిసెంబర్‌తో పోల్చితే ఏప్రిల్‌లో 32 శాతం మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు కొనసాగగా, ఆగస్టు వచ్చేటప్పటికీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మళ్లీ తమ పాత ఉద్యోగాల్లో చేరినట్టు ఈ అధ్యయనంలో తేలింది. ప్రధానంగా విద్యా, రిటైల్, డొమెస్టిక్ వర్క్ వంటి రంగాల్లో మహిళలు ఎక్కువ ప్రభావితమయ్యారు. కోల్‌కతాలో ఇళ్లల్లో పనిచేసేవారు 40 నుంచి 50 శాతం మంది మహిళలు తమ పనులు కోల్పోయినట్టు పశ్చిమ్ బంగా పరిచారిక సమితి వెల్లడించింది.

మహిళా శక్తిని పెంచేందుకు చర్యలు అవసరం: యాక్షన్ ఎయిడ్ ఇండియా
రాబోయే నెలల్లో పరిస్థితులు మరింత దిగజారి ఆర్థిక, లింగపరమైన అసమానతలు పెరగనున్న నేపథ్యంలో మహిళా శక్తిని వర్క్‌ఫోర్స్‌లోకి, పనుల్లోకి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత గట్టిగా కృషి చేయాల్సిన అవసరముందని యాక్షన్ ఎయిడ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ ఛాచ్ర పేర్కొన్నారు. బీడీలు చుట్టే వారు మొదలుకుని, ఇళ్లల్లో పనిచేసే వారు, వ్యవసాయ కార్మికులు ఇలా వివిధ రంగాలకు చెందిన మహిళా వర్కర్లను రిజిష్టర్ చేసి లింగపరమైన అసమానతలు దూరం చేయడంతో పాటు గ్రామీణ, ఇతర స్థాయిల్లో పిల్లల సంక్షేమ, సహాయ కార్యక్రమాలను పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ (ఐసీడీఎస్)ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

గృహహింస పెరుగుతోంది..
‘ఇంట్లో, బయటా మహిళలపై ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఆర్థికపరమైన అంశాలు, ఇతర సమస్యలపై దంపతుల మధ్య కీచులాటలు ఎక్కువయ్యాయి. దీంతో మహిళలపై గృహహింస పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు అంతా ఇళ్లల్లోనే అన్ని సమయాల్లో ఉండటంతో గృహిణులపై పనిభారం రెండింతలు పెరిగింది. దీనికి తోడు వారిపై భవిష్యత్‌పై భయాలు, ఆందోళనలు పెరిగి మానసిక ఒత్తిళ్లకు ఎక్కువగా గురవుతున్నారు. భర్త, భార్య సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది.. 7, 8 నెలలుగా కొనసాగుతున్న పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగితే భవిష్యత్‌లో కంఫర్టబుల్‌గా ఉంటారు. భర్తలు కూడా పురుషాధిక్య ధోరణిని విడనాడి భార్యలు కుటుంబం కోసం చేస్తున్న శ్రమ, త్యాగాలను గుర్తించి గౌరవిస్తే కుటుంబ బంధాలు బలపడతాయి. ఈ ఏడాది జీవించడమే ముఖ్యమని, ఆరోగ్యంగా ఎలాంటి ఆందోళనలు, ఒత్తిళ్లకు గురికాకుండా జీవించేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న ఉద్యోగమో లేక ఏదో ఒక ఉపాధి అవకాశం కోసమే చూడకుండా మహిళలు ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలి. తక్కువ ఖర్చుతో చేయగలిగే చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటి అవకాశాలు పెంచుకునే దిశలో కృషి చేయాలి’
- ‘సాక్షి’తో సైకాలజిస్ట్ సి.వీరేందర్
Published date : 16 Nov 2020 05:15PM

Photo Stories