జూనియర్ కాలేజీల్లో 4,055 లెక్చరర్ ఖాళీలు: ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే భర్తీ..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 4,055 ఖాళీలు ఉన్నాయని, వాటిల్లో కాంట్రాక్టు లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నా వాటిని ఖాళీలుగానే చూస్తామని ఇంటర్మీయట్ బోర్డు పేర్కొంది.
ఒకవేళ ప్రభుత్వం ఆదేశిస్తే వాటిని భర్తీ చేస్తామని వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద భూక్యా బిక్సునాయక్ అడిగిన సమాచారాన్ని ఇంటర్ బోర్డు ఈ మేరకు అందజేసింది. ప్రస్తుతం ఆయా పోస్టుల్లో 3,652 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, మిగతా పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారని వెల్లడించింది. 2014 నుంచి కాంట్రాక్టు అధ్యాపకులను నియమించడం లేదని, ప్రస్తుతం ఉన్న వారంతా గతంలో నియమించిన వారేనని తెలిపింది. కాంట్రాక్టు అధ్యాపకులు తమ సబ్జెక్టుల్లో జిల్లా యావరేజ్ ఫలితాలను సాధించిన వారినే సంబంధిత ప్రిన్సిపల్ రెన్యువల్ చేస్తారని పేర్కొంది. ఇక కాంట్రాక్టు ఫ్యాకల్టీగా నియమితులైన వ్యక్తికి నెలకు రూ. 37,100, గెస్ట్ లెక్చరర్లకు తరగతికి రూ.300 చెల్లించడం సమాన పనికి సమాన వేతనమన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం కాదని తెలిపింది. వారికి కేటాయించిన సమయంలోనే గెస్ట్ లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తారని స్పష్టం చేసింది.
Published date : 23 Dec 2020 04:27PM