జూలై 1లోగా తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్
తాజాగా ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేస్తూ..జూలై 1 నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు అడ్మిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోని అధికారులు.. ఇప్పుడు సెట్‌ల నిర్వహణపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలో 940 పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో ఐదో తరగతికి సంబంధించి దాదాపు 68 వేల మందికి ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా గురుకుల సొసైటీల పరిధిలో 500 జూనియర్ కాలేజీలు, 115 డిగ్రీ కాలేజీల్లో కూడా అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంది. వీటితో పాటు పాఠశాల విద్యాశాఖ పరిధిలో 194 ఆదర్శ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో కూడా ఐదో తరగతి అడ్మిషన్లకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఈ అడ్మిషన్లన్నీ సెట్ (సాధారణ ప్రవేశ పరీక్ష)ల ద్వారానే నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పరీక్షలన్నీ ఏప్రిల్ చివరి వారం నుంచి మే రెండో వారంలోగా నిర్వహించి మే నెలాఖరు నాటికి అడ్మిషన్లు పూర్తి చేస్తారు. కానీ కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ఈ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ఎత్తివేయడంతో వీటి నిర్వహణపై అధికారుల్లో హడావుడి మొదలైంది.
చదవండి: ఈ రెండేళ్లలో 6,03,756 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం జగన్
జూలై 1లోగా ఖరారు చేసేలా..
జూలై 1 లోపు సెట్‌ల తేదీలు ఖరారు చేసేలా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. గురుకు లాల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి. దీనిపై సోమ, మంగళ వారాల్లో సొసైటీ అధికారులు భేటీ కానున్నట్లు సమాచారం. భేటీ అనంతరం పరీక్ష నిర్వహణపై తేదీ ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వ అనుమతితో పరీక్షను నిర్వహించనున్నారు. మరోవైపు అర్హత పరీక్షకు ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే లాటరీ పద్ధతిని కూడా మరో ప్రత్యామ్నాయంగా అధికారులు ఎంపిక చేసుకున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.