జూలై 1 నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల పునః ప్రారంభం..
లాక్‌డౌన్ సమయంలో విధించిన అన్ని రకాల ఆంక్షలను ఉప సంహరిస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌కు ముందున్నట్టుగా రోజువారీ వ్యవహారాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పునః ప్రారంభించుకోవచ్చని తెలిపింది. శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ రాత్రి 8.30 గంటల వరకు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందంటూ, కరోనా నియంత్రణలోకి వచ్చిందంటూ వైద్యారోగ్య శాఖ అందించిన నివేదికలను పరిశీలించింది. పొరుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన అంశంపై పరిశీలన జరిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా వేగంగా నియంత్రణలోకి వచ్చిందన్న అంశాలను నిర్ధారించుకుని.. లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది.
వెంటనే ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం మే 12 నుంచి లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఉదయం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపు ఇవ్వగా.. తర్వాత ఒంటి గంట వరకు, సాయంత్రం ఐదు గంటల వరకు పెంచారు. తాజాగా పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తూ, దానికి ముందు కొనసాగిన అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. జూలై 1 నుంచే విద్యా సంస్థలు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు, ఆన్‌లైన్ క్లాసుల కొనసాగింపు తదితర అంశాలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని విద్యా శాఖను మంత్రివర్గం ఆదేశించింది. విద్యార్థులకు భౌతిక తరగతులు (ఫిజికల్ క్లాసెస్) ప్రారంభించాలని సూచించింది. లాక్‌డౌన్ ఎత్తివేతతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగినా.. అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులపై మాత్రం స్పష్టత రాలేదు.