Skip to main content

జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్:ఆన్‌లైన్‌లోనే విద్యార్ధుల రిపోర్టింగ్

సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) సీట్లు పొందిన విద్యార్థులు నేరుగా రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు.
కరోనా నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లోనే విద్యార్థులు రిపోర్టు చేసేలా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) చర్యలు చేపట్టింది. వచ్చే నెల 6న ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అవుతుందని, నవంబర్ 9న ముగుస్తుందని పేర్కొంది. నవంబర్ 9 వరకు కూడా పరిస్థితి అదుపులోకి రాకపోతే విద్యార్థుల డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా ఆన్ లైన్ లోనే చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జారీ చేసిన షెడ్యూల్‌లో ఈ విషయాన్ని పొందుపరిచింది. ఈ నెల 27న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను వచ్చే నెల 5న ఐఐటీ ఢిల్లీ ప్రకటించనుంది. ఆ తరువాతి రోజు నుంచే (6వ తేదీ) ఐఐటీ, ఎన్ ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేలా జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఏడు విడతల్లో పూర్తి చేయనుంది. మొదట ఆరు విడతల కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ జారీ చేసింది. చివరలో మిగిలిన సీట్లకు మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ఐఐఐటీలు, 30 జీఎఫ్‌టీఐలు కలిపి మొత్తంగా 111 జాతీయ విద్యాసంస్థల్లోని సీట్లను భర్తీ చేయనుంది. మొదట విడత సీట్ల కేటాయింపు కంటే ముందు.. రెండుసార్లు నమూనా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. దీంతో అప్పటికే ఆప్షన్లు నమోదు చేసుకున్నవారు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవచ్చు. దాన్ని అనుసరించి అభ్యర్థులు తమ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
Must Check: JEE Mians 2019 Opening and Closing Ranks

జోసాకౌన్సెలింగ్ షెడ్యూల్ ఇది..

అక్టోబర్ 5:

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు

అక్టోబర్ 6 నుంచి:

జోసా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్

అక్టోబర్ 16:

మొదటి విడత సీట్ల కేటాయింపు

అక్టోబర్ 21:

రెండో విడత సీట్ల కేటాయింపు

అక్టోబర్ 26:

మూడో విడత సీట్ల కేటాయింపు

అక్టోబర్ 30:

4వ విడత సీట్ల కేటాయింపు

నవంబర్ 3:

5వ విడత సీట్ల కేటాయింపు

నవంబర్ 7:

6వ విడత సీట్ల కేటాయింపు

Published date : 14 Sep 2020 02:22PM

Photo Stories