Skip to main content

ఇక మాధ్యమిక స్థాయిలోనే పాఠ్యాంశంగా వ్యవసాయం: పధానిమోదీ

న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
ఇందుకు అనుగుణంగా జాతీయ విద్యా విధానం 2020లో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భవనాలను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించిన ప్రధాని అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి, వంట నూనె దిగుమతులు తగ్గించి ఫుడ్ ప్రాసెసింగ్‌ను పెంచడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ‘‘వ్యవసాయ రంగానికి సంబంధించిన విజ్ఞానం ప్రతీ విద్యార్థికి ఉండాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామాల్లో మాధ్యమిక స్థాయిలో వ్యవసాయాన్ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెడతాం’’అని ప్రధాని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల దేశంలో వ్యవసాయ రంగంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యపడుతుందని వ్యవసాయం, దాని మార్కెటింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటివి చిన్నప్పట్నుంచి ప్రతీ ఒక్కరూ నేర్చుకుంటే వ్యవసాయదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

వ్యవసాయం, పరిశోధనల అనుసంధానం
వచ్చే ఆరేళ్లలో వ్యవసాయాన్ని, పరిశోధనల్ని అనుసంధానం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. గ్రామాల స్థాయిలో చిన్న, సన్నకారు రైతులకి కూడా వ్యవసాయ రంగం పరిశోధనలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ఈ అంశంలో యూనివర్సిటీ విద్యార్థులు విసృ్తత పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మాధ్యమిక విద్య స్థాయిలోనే వ్యవసాయాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడితే ఆచరణలో ఎవరైనా బాగా రాణించడానికి ఉపయోగపడుతుందన్నారు.

సాగులో సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విసృ్తతంగా వినియోగిస్తున్నామని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. 30 ఏళ్ల తర్వాత భారత్‌పై దాడి చేసిన మిడతల దండుని తరిమి కొట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామన్నారు. వివిధ నగరాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి, డ్రోన్లు తదితర ఆధునిక పరిజ్ఞానం సాయంతో మిడతలపై మందులు పిచికారీ చేయడంతో పంటలకు నష్టం జరగలేదన్నారు.
Published date : 31 Aug 2020 05:18PM

Photo Stories