ఆ ఘటన ఏనాటికీ మరచిపోలేను..: వైఎస్ జగన్
Sakshi Education
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్ అనే వ్యక్తి తన ఇంటి ముందు కొడుకు ఫొటో పెట్టి, ఫ్లెక్సీ కట్టాడు.
ఆయన నా దగ్గరకు వస్తే, ఈ ఫ్లెక్సీ ఎందుకు కట్టారు.. ఏమిటి.. అని అడిగాను. అప్పుడు ఆయన బాధ పడుతూ చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మరచిపోలేను. ‘నా కొడుకు బాగా చదివాడు. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్ చదువుతానంటే కాలేజీలో చేర్పించాను. కానీ అక్కడ ఫీజులు చూస్తే, బోర్డింగ్, మెస్ చార్జీలు దాదాపు లక్ష రూపాయలు కట్టాలి. కానీ ప్రభుత్వం మాత్రం రూ.30 వేలు లేక రూ.35 వేలు మాత్రమే ఇస్తోంది. మరి మిగిలిన ఫీజు ఎలా కడతారని పిల్లవాడు అడిగితే, ఏదో ఒక విధంగా కడతానని చెప్పాను. కాలేజీలో చేరిన పిల్లవాడు మొదటి ఏడాది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. మళ్లీ రెండో సంవత్సరం చాలీచాలని ఫీజులు మాత్రమే ప్రభుత్వం ఇస్తా ఉంది. మిగిలిన ఫీజు పరిస్థితి ఏమిటి అని చెప్పి మళ్లీ అడిగాడు. ఏదో ఒకటి చేస్తాను. నువ్వైతే బాగా చదువు అని చెప్పి పంపించాను. తర్వాత ఆ పిల్లవాడు కాలేజీకి వెళ్లాడు. ఫీజు కోసం నేను పడుతున్న పాట్లు చూసి, అప్పుల పాలవ్వడం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆ తండ్రి నాతో చెప్పి బాధపడ్డాడు.
Published date : 29 Apr 2020 04:08PM