ఏప్రిల్ 15 నుంచి డిగ్రీ పరీక్షలు: ఉన్నత విద్యామండలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు ఏప్రిల్ 15 నుంచి థియరీ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సులకు ఓకే తరహాలో అకడమిక్ పరీక్షలు నిర్వహించే అంశంపై గతవారం యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు తుమ్మల పాపిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో బోధన తరగతులు, సెలవులు, పరీక్షలు తదితర అంశాలపై కామన్ కేలండర్ రూపొందించారు. డిగ్రీ యూజీ కోర్సుల్లో రీ-అడ్మిషన్ ప్రక్రియ గత డిసెంబర్ 7తో ముగియగా.. ఆ రోజు నుంచే తరగతులు ప్రారంభం అయ్యాయి. మొదటి అంతర్గత అసెస్‌మెంట్ పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి 27వ తేదీ వరకు, రెండో అంతర్గత అసెస్‌మెంట్ పరీక్షలు మార్చి 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. బోధన తరగతులకు ఏప్రిల్ 3 చివరి రోజు కాగా.. ఏప్రిల్ 6 నుంచి 14వ తేదీ వరకు సన్నాహక సెలవులు ఉండనున్నాయి. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో తొలి సెమిస్టర్‌లో 90 రోజుల పాటు పనిదినాలు సాగనున్నాయి.
Published date : 29 Jan 2021 03:39PM