డిజిటల్, ఆన్‌లైన్ బోధనకు అవసరమైన చర్యలు చేపట్టాలి: ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) జాతీయ స్థాయి ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) స్పష్టం చేసింది.
ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో వీలైనచోట్ల ఆన్‌లైన్ బోధనకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది. డిజిటల్, ఆన్‌లైన్ బోధన కోసం ప్రగ్యాత పేరుతో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించింది. అందుకు అనుగుణంగా టీచర్లను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ‘నిష్ఠ’రెండో దశలో భాగంగా మిగిలిన టీచర్లకు (గతేడాది శిక్షణ పొందిన వారు మినహా) ప్రాథమిక, ఉన్నత స్థాయిలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిర్వహించే ఆన్‌లైన్ శిక్షణలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని వెల్లడించింది. శిక్షణకు హాజరయ్యే టీచర్లు డేటా ప్లాన్, కంటెంట్, మాడ్యూల్స్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు పెన్‌డ్రైవ్‌లు, ఇతర ప్రింటింగ్ డేటా సమకూర్చుకునేందుకు ఒక్కో టీచర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించాలని సూచించింది. మూక్స్, దీక్ష ప్లాట్‌పారాలను కేంద్రం అందుబాటులో ఉంచిందని, ఎన్‌సీఈఆర్‌టీ కూడా యూట్యూబ్ ద్వారా వెబినార్స్ నిర్వహిస్తోందని వాటి ద్వారా అవసరమైన శిక్షణ పొంద వచ్చని వెల్లడించింది. విద్యార్థుల ఈ-లెర్నింగ్‌కు సంబంధించి టీచర్లు తమ అనుభభవాలు, ఆలోచనలు, ఉత్తమ అంశాలు పాలు పంచుకునేలా ఒక ప్లాట్‌ఫారాన్ని అందుబాటులోకి తేవాలని పేర్కొంది. అలాగే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) కూడా తమకు అందుబాటులో ఉన్న డిజిటల్, ఈ-లర్నింగ్ విధానాలను ఆచరణలోకి తెచ్చుకోవాలని పేర్కొంది.
Published date : 10 Aug 2020 02:32PM