Skip to main content

డిగ్రీ కాలేజీల ఫీజుల ఖరారుపై తీర్పు వాయిదా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన జీవో 1ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టులో వాదనలు ముగిశాయి.
వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా వేశారు. అంతకు ముందు కాలేజీల తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసిందని, కాలేజీలను మూడు రకాలుగా వర్గీకరించారని, ఈ వర్గీకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. ఉన్నతవిద్యా కమిషన్ తరఫు న్యాయవాది సుదేశ్‌ ఆనంద్‌ వాదనలు వినిపిస్తూ, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఫీజులు పెంచామన్నారు. ఆయా కాలేజీలు వారి వారి నిర్వహణకు సంబంధించిన వివరాలను సమర్పించలేదని తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Published date : 27 Mar 2021 02:53PM

Photo Stories