Skip to main content

అన్‌లాక్-5: నవంబర్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభం లేనట్టే!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేనట్లే. ఆరంభం మరింత ఆలస్యమయ్యేట్టు ఉంది.
అన్‌లాక్ నిబంధనల పొడిగింపుతో స్కూళ్ల పునః ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. అన్‌లాక్-5 నిబంధనలను నవంబర్ నెలాఖరు వరకు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి గతంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని అధికారులు యోచించారు. పది రోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో.. దసరా తర్వాత మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. అయితే కేంద్రం జారీ చేసిన అన్‌లాక్-5 నిబంధనల్లో పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని, అయితే కేంద్రం పేర్కొన్న నిబంధనలను పక్కాగా అమలు చేయాలని పేర్కొంది. క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసిన తర్వాత విద్యాసంస్థల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని, ఆన్‌లైన్/దూరవిద్యా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలని, హాజరును తప్పనిసరి చేయకూడదని స్పష్టం చేసింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో అవే నిబంధనలను మరో నెల రోజులపాటు పొడిగించడంతో నవంబర్ మొదటివారంలో పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇంజనీరింగ్ వంటి సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల తరగతులను డిసెంబర్ 1 లోగా ప్రారంభించుకోవచ్చని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొన్న సంగతి తెలిసిందే. డిగ్రీ తరగతుల ప్రారంభంపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Published date : 28 Oct 2020 03:22PM

Photo Stories