Skip to main content

8వ తరగతి వరకు బడులు బంద్‌.. కరోనా కేసులు పెరుగుతుండటంతో..!

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కొనసాగింపుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ కూడా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ లెక్కన 8వ తరగతి వరకు ప్రత్యక్ష బోధనను నిలిపివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రభుత్వం ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించింది. 6, 7, 8 తరగతులకు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇచి్చంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రం ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రైవేటు యాజమాన్యాలు 6, 7, 8, 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన చేపడుతున్నాయి. ఇదే అదనుగా 85 శాతానికిపైగా విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసుకున్నాయి. మరోవైపు ప్రత్యక్ష బోధన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకడంతో ప్రభుత్వం ఆలోచనల్లో పడింది. ఈ వారంలోనే కరోనా పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులు, టీచర్ల సంఖ్య వందలకు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మరోసారి వేగంగా విజృంభిస్తోంది. బుధవారం అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్‌ స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. తర్వాత అసెంబ్లీలోనూ దీనిపై మాట్లాడారు. కేసుల నమోదు పెరుగుతున్నట్టు తన దృష్టికి వచి్చందని.. ఈ నేపథ్యంలో స్కూళ్లు కొనసాగించడంపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

ఏయే తరగతులకు ఉండాలి..
ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు టీవీ/ ఆన్‌లైన్‌ పాఠాలే కొనసాగుతున్నాయి. ప్రత్యక్ష బోధన లేదు. 6, 7, 8, 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. అయితే 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన నిలిపేస్తే విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఇబ్బందిగా మారుతాయన్న అభిప్రాయం అధికారుల్లో ఉంది. పైగా పదో తరగతి పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. విద్యార్థులు పరీక్ష ఫీజులు కూడా చెల్లించారు. ఈ నేపథ్యంలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన కొనసాగించాలన్న వాదన ఉంది. అయితే వారికి ప్రత్యక్ష బోధన కొనసాగించాలా, ఆన్‌లైన్‌తోనే సరిపెట్టాలా? అన్న అంశంపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక 6, 7, 8 తరగతులకు మాత్రం ప్రత్యక్ష బోధన అవసరం లేదన్న భావనకు ఉన్నతాధికారులు వచి్చనట్టు తెలిసింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌/డిజిటల్‌ బోధన కొనసాగించేలా.. వారందరిని పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వీలైతే 9వ తరగతి విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండానే పదో తరగతికి పంపించే అవకాశాలనూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు లేకుండానే కనీస మార్కులతో పాస్‌ చేయాలని కొన్ని రోజుల కింద ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉన్నతాధికారులు మాత్రం అది సరికాదంటూ ప్రతిపాదనను వ్యతిరేకించినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్‌ త్వరలోనే ఈ అంశాలన్నింటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మైనార్టీ గురుకులాల్లోనూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ కాలేజీలు...
Published date : 18 Mar 2021 04:05PM

Photo Stories