27% మందికి ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లు లేవు!!
Sakshi Education
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు దేశంలోని కనీసం 27 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో లేవని ఎన్‌సీఈఆర్‌టీ సర్వేలో తేలింది. అంతేకాకుండా... విద్యుత్తు సరఫరాలో అంతరాయం, కరెంటు సౌకర్యం లేకపోవడం కూడా ఆన్‌లైన్ క్లాసులకు విఘాతమేనని 28 శాతం విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు... సుమారు 34 వేల మందితో జరిపిన ఈ సర్వేలో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి ఆధునిక పరికరాల వాడకంపై చాలామందిలో అవగాహన లేనట్లు స్పష్టమైంది. ఆన్‌లైన్ బోధన పద్ధతులపై టీచర్లకు అవగాహన లేమి కూడా బోధనకు ప్రతిబంధకంగా మారవచ్చునని సర్వేలో తెలిసింది. ‘‘దాదాపు 36 శాతం మంది విద్యార్థులు పాఠ్య, ఇతర పుస్తకాలను ఉపయోగిస్తున్నారు. ఉపాధ్యాయులు ల్యాప్‌టాప్‌ల వాడకాన్ని పెద్దగా ఇష్టపడటం లేదు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో టెలివిజన్, రేడియో వంటి వాటి ద్వారా విద్యాబోధన చేసే ఆలోచన ఎవరూ చేయడం లేదు’ అని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. గణితం, సైన్స్ బోధన ఆన్‌లైన్‌లో కష్టసాధ్యమని వెల్లడైంది.
Published date : 21 Aug 2020 02:19PM