2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 20.5 కోట్ల మంది నిరుద్యోగులవుతారు (ILO)
Sakshi Education
ఐక్యరాజ్యసమితి: కరోనా మహమ్మారి రాస్తున్న కన్నీటి గాథలెన్నో.. రాకాసి వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఇక కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి, పేదరికంలోకి జారుకున్నారు. కరోనా కారణంగా వచ్చే ఏడాది.. అంటే 2022లో ప్రపంచవ్యాప్తంగా 20.5 కోట్ల మందికి పైగా జనం నిరుద్యోగులుగా మారుతారని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ‘వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్, సోషల్ ఔట్‌లుక్: ట్రెండ్స్ 2021’ నివేదికను విడుదల చేసింది. 2022లో అదనంగా 10.8 కోట్ల మంది ప్రజలు పేదలు, కటిక పేదలు అనే కేటగిరీలో చేరుతారని వెల్లడించింది. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోతే పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని హెచ్చరించింది. కోవిడ్–19 వల్ల కార్మికవర్గం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని ఐఎల్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. 2023 వరకూ కొత్తగా కొన్ని ఉద్యోగాలను సృష్టించగలిగినా, కోల్పోయిన ఉద్యోగాల నష్టాన్ని అవి భర్తి చేయలేవని తెలియజేసింది. ఐఎల్‌వో నివేదిక ప్రకారం.. 2020లో ప్రపంచంలో మొత్తం పని గంటల్లో 8.8 శాతం పని గంటలను కరోనా వల్ల కార్మికులు కోల్పోయారు. ఇది 25.50 కోట్ల మంది ఫుల్‌టైమ్ కార్మికులు ఒక సంవత్సరంలో చేసే పని గంటలకు సమానం.
Published date : 03 Jun 2021 02:30PM