Skip to main content

1–9 తరగతుల పరీక్షల రద్దుపై ఉత్తర్వులివ్వండి..!

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న మిగతా తరగతుల పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇప్పటివరకు ఉత్తర్వులు జారీ కాకపోవడంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పరీక్షలు నిర్వహిస్తామంటున్నాయని, ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని షరతు విధిస్తున్నాయని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో నుంచి మార్చి 23 వరకు 9, 10 తరగతులకు నిర్వహించిన ప్రత్యక్ష బోధన మార్గదర్శకాల్లోనే విద్యాశాఖ ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు నాన్‌ డిటెన్షన్‌ విధానం అమల్లో ఉందని స్పష్టం చేసింది. పరీక్షలు రాయాలని, ప్రత్యక్ష బోధనకు హాజరు కావాలని విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తేవొద్దని స్పష్టం చేసింది. అయినా యాజమాన్యాలు పరీక్షలు ఉంటాయంటూ తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌లను పంపిస్తున్నాయి. మరోవైపు తొమ్మిదో తరగతి పరీక్షల రద్దుపైనా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Published date : 17 Apr 2021 03:22PM

Photo Stories