Skip to main content

ప్రత్యామ్నాయాల్లో ప్రత్యేకం.. ప్యాకేజింగ్

‘ప్రస్తుత తరుణంలో విద్యార్థులు ప్రత్యామ్నాయ అవకాశాలపైనా దృష్టిసారించడం ఎంతో అవసరం. పోటీ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి అవకాశాలు లిప్తపాటులో చేజారుతాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయాలపై ముందుగానే సంసిద్ధత ఉంటే.. కెరీర్‌కు ఎలాంటి అడ్డంకి లేకుండా ముందుకు సాగొచ్చు. అలాంటి ప్రత్యామ్నాయాల్లో ప్రత్యేకంగా నిలుస్తున్న రంగం.. ప్యాకేజింగ్’ అంటున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డైరెక్టర్‌ ప్రొఫెసర్ ఎన్.సి.సాహా. ప్యాకేజింగ్ రంగంలో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు కమిటీల్లో సభ్యులుగా వ్యవహరించి ప్రస్తుతం ఐఐపీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ ఎన్.సి.సాహాతో గెస్ట్ కాలమ్..
నిపుణుల అవసరం
ప్రస్తుతం ప్యాకేజింగ్ రంగంలో నిపుణుల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. చిన్న పిల్లలు తినే బిస్కెట్ ప్యాకెట్ల నుంచి భారీ ఎత్తున ఉండే పవర్ ప్రొడక్షన్ ఇన్‌స్ట్రుమెంట్స్ వరకూ.. అన్నిటిలోనూ ప్యాకేజింగ్ కీలకంగా మారింది. వస్తువు నాణ్యత తగ్గకుండా చూడటంతోపాటు ఎలాంటి డ్యామేజ్ లేకుండా వినియోగదారులకు అందించడంలో కీలకం.. ప్యాకింగ్. అందుకే ప్రత్యేక కోర్సులు అభ్యసించిన నిపుణులకు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ నెలకొంది. వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లో దశాబ్దాల నుంచి ఈ ప్యాకేజింగ్ రంగంపై అవగాహన ఉన్నప్పటికీ మన దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది.

ఊతమిస్తున్న ఆన్‌లైన్ షాపింగ్
ప్యాకేజింగ్‌లో ఊతమిస్తున్న విభాగాలు ఈ-కామర్స్, ఆన్‌లైన్ షాపింగ్ కార్యకలాపాలు. మెడిసిన్స్ నుంచి మొబైల్ ఫోన్స్ వరకు ఇప్పుడంతా ఆన్‌లైన్ షాపింగ్ ద్వారానే జరుగుతోంది. వీటిని ఆర్డర్ చేసిన వినియోగదారులకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా అందించాలంటే సరైన ప్యాకింగ్ ఉండాలి. అలాంటి ప్యాకింగ్ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ). భారతదేశంలో ప్యాకేజింగ్ రంగం భారీ ఎత్తున పురోగతి సాధించనుంది. ఉదాహరణకు ఈ-కామర్స్ ప్యాకింగ్ విభాగాన్ని పరిగణిస్తే 2018 చివరి నాటికి మార్కెట్ టర్నోవర్ 40 నుంచి 50 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్ ప్యాకేజింగ్ విభాగం టర్నోవర్ 80 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఇంతలా వృద్ది సాధిస్తున్న ఈ రంగంలో నిపుణులు ఎంతో అవసరం.

సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకు అనుకూలం
ప్రస్తుతం పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ వంటి ఫుల్‌టైం కోర్సులు, షార్ట్‌టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు, ఆన్‌లైన్/డిస్టెన్స్ సర్టిఫికెట్ కోర్సులను ఐఐపీ అందిస్తోంది. 2017-18 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల బీటెక్ కోర్సును ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ప్యాకేజింగ్ రంగం కోర్సులు సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో అనుకూలం. కారణం.. వారికి ఆయా ఉత్పత్తులకు సంబంధించి క్షేత్ర స్థాయి వివరాలు, వాటి మన్నికకు అవసరమైన చర్యల గురించి తెలియడం. ఇలాంటి అభ్యర్థులు సదరు ఉత్పత్తుల ప్యాకేజింగ్ విషయంలోనూ రాణించగలరు. అలాగని ఇతర విద్యార్థులకు సరిపోదని కాదు. అయితే ఇతర నేపథ్యం గల విద్యార్థులతో పోల్చితే సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులకు కొంత సులువుగా కోర్సు అంశాలు ఉంటాయి. తర్వాత కెరీర్ పరంగా రాణించగల నేర్పు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది.

ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్
నేటి విద్యార్థుల్లో ప్రధానంగా కనిపిస్తున్న లోపం వారు ఏదో ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని, దాని కోసమే అహర్నిశలు శ్రమించడం, అది అందకపోతే కుంగిపోవడం జరుగుతోంది. కానీ 18 నుంచి 20 ఏళ్ల వయసులో ఉండే విద్యార్థులు అలా మానసికంగా కుంగిపోతే ముందుకు సాగలేరు. ఒక రంగంలో అవకాశం రాకున్నా.. తమ అర్హతలకు అందుబాటులో ఉన్న ఇతర రంగాల్లో చేరేందుకు సిద్ధంగా ఉండాలి. యువత ఎంపిక చేసుకున్న ప్రత్యామ్నాయాలు ఇంటర్ డిసిప్లినరీగా ఉంటే వారికి తాము లక్ష్యంగా చేసుకున్న కోర్సులో సీటు రాలేదన్న బెంగ కూడా ఉండదు. ఉదాహరణకు ఫుడ్ టెక్నాలజీ కోర్సును ప్రధాన లక్ష్యంగా ఎంపిక చేసుకున్న వ్యక్తి ఫుడ్ సైన్స్‌ను ప్రత్యామ్నాంగా నిర్దేశించుకోవడం, అదే విధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకున్న విద్యార్థి అగ్రికల్చర్‌లో బీఎస్సీ కోర్సును ప్రత్యామ్నాయంగా నిర్దేశించుకోవడం వంటివి. దీని వల్ల తాము లక్ష్యంగా చేసుకున్న కోర్ కోర్సుకు సంబంధించిన అంశాలు చదువుతున్న భావన కలుగుతుంది.

ఒత్తిడిని జయిస్తూ
ఏ కోర్సు చూసినా, ఏ కెరీర్‌ను పరిగణనలోకి తీసుకున్నా.. ఒత్తిడి సహజమైన అంశంగా మారింది. ప్రతి కోర్సు, కెరీర్‌లోనూ నిరంతరం ఎన్నో మార్పులు, సాంకేతిక ఆవిష్కరణలు ముందుకొస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని స్ట్రెస్ మేనేజ్‌మెంట్, రెగ్యులర్ లెర్నింగ్ దృక్పథాన్ని అలవర్చుకుంటే ఏ రంగంలో అడుగు పెట్టినా ఉన్నత స్థాయికి ఎదగొచ్చు!!
Published date : 09 Jun 2016 03:19PM

Photo Stories