Skip to main content

‘ప్రాంగణం’లో విజయానికి స్కిల్స్ ముఖ్యం

‘ఇంజనీరింగ్ విద్యార్థులు తమ కోర్ బ్రాంచ్‌లో సబ్జెక్టు నైపుణ్యాలను పెంచుకోవటంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై కూడా దృష్టిసారించాలి’ అని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ సంస్థ క్యాప్‌జెమిని హ్యూమన్ రిసోర్సెస్ వైస్ ప్రెసిడెంట్ కె.జగదీశ్ సూచిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో విద్యాసంస్థల్లో ప్రాంగణ నియామకాలు ఊపందుకోనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు జగదీశ్ అందిస్తున్న సలహాలు..
ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించడానికి తమ ప్రొఫైల్ ఏ సంస్థకు సరితూగుతుంది? ఆయా సంస్థల్లో ఏ పోర్ట్‌ఫోలియోలో ఉద్యోగాలకు తమకు అర్హత ఉంటుంది అనే విషయాలపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి. ఇన్‌స్టిట్యూట్‌లకు వచ్చే సంస్థల గురించి ప్లేస్‌మెంట్ సెల్స్‌కు సమాచారం అందుతుంది. ప్లేస్‌మెంట్ అధికారులను సంప్రదిస్తే ఆయా సంస్థల వివరాలు తెలుసుకోవచ్చు.

నైపుణ్యాల కొరతే సమస్య
ప్రాంగణ నియామకాల్లో వివిధ కంపెనీలు సబ్జెక్టు, సాఫ్ట్ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. వీటి విషయంలో విద్యార్థులు రాణించలేకపోతున్నారు. అందువల్ల కంపెనీలు ఎంపిక సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నైపుణ్యాలు ఒకే అభ్యర్థిలో ఉండని కారణంగా ఉద్యోగిత విషయంలో స్కిల్ గ్యాప్ సమస్య తలెత్తుతోంది.

పరిష్కారం విద్యార్థుల చేతుల్లోనే
ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచుకోవడం, జాబ్ రెడీగా రూపొందడం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ప్రొఫెషనల్ కోర్సుల స్థాయికి వచ్చిన విద్యార్థులు కేవలం తరగతికే పరిమితం కాకూడదు. సబ్జెక్టు నైపుణ్యాల పరంగా సమకాలీన పరిస్థితుల్లో వస్తున్న తాజా మార్పుల గురించి నిరంతరం అధ్యయనం చేయాలి. సందేహాల నివృత్తి కోసం ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి.

కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకం
తమ సబ్జెక్టు నైపుణ్యాల ఆధారంగానే భవిష్యత్తులో విధులు నిర్వర్తిస్తామని విద్యార్థులు భావిస్తున్నారు. అయితే కొత్త ప్రాజెక్ట్‌లు, ఉత్పత్తులపై సంస్థలు నిర్వహించే సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఉద్యోగి అభిప్రాయాలు అడిగే సందర్భాలు ఎదురవుతాయి. సబ్జెక్ట్ నైపుణ్యం ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టిపెట్టాలి. లాంగ్వేజ్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, క్రాస్ కల్చరల్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్ కోసం అవసరమైతే శిక్షణ తీసుకోవాలి. ఇటీవల ఇన్‌స్టిట్యూట్‌లే ప్రత్యేకంగా సాఫ్ట్‌స్కిల్ ట్రెయినింగ్ సెల్స్ ఏర్పాటుచేస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి.

కంపెనీలు కోరుకునే అంశాలు
ఉద్యోగార్థుల్లో సబ్జెక్ట్‌పై పట్టుతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా అనే అంశాలపై కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. సబ్జెక్టు నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు సర్టిఫికెట్లు, గ్రేడ్లు ప్రామాణికం కావు. కరిక్యులంలో లేని అంశాలపై కూడా ప్రాంగణ నియామక ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ ప్రత్యేకత, దాని ఫలితాలు, లైవ్ ప్రాజెక్ట్/డమ్మీ ప్రాజెక్ట్ వంటివి తెలుసుకునేందుకు రిక్రూటర్లు పలు రకాల ప్రశ్నలు సంధిస్తారు. వీటిని ఎదుర్కోవడానికి తమ ప్రాజెక్ట్ వర్క్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలి.

‘ఎక్స్‌ట్రా’ అంశాలపైనా ఫోకస్

ఇటీవల కాలంలో రిక్రూటర్స్ దృక్పథంలో మార్పు వస్తోంది. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో విద్యార్థుల భాగస్వామ్యం గురించి కూడా ఆరా తీస్తున్నాయి. కల్చరల్ ఫెస్ట్‌లు, సెమినార్లు వంటి వాటిలో విద్యార్థులు పాల్గొనటంపై దృష్టిపెడుతున్నాయి.

‘స్ట్రాంగ్ రెజ్యూమె’తో విజయం
ప్రాంగణ నియామకాల కోసం నవంబర్ మొదటి వారం నుంచి కంపెనీలు కళాశాలలకు వెళ్లనున్నాయి. రెజ్యూమె ఎంత సమగ్రంగా ఉంటే విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. వాస్తవ నైపుణ్యాలను తెలిపేలా రెజ్యూమెను రూపొందించాలి. తమకున్న నైపుణ్యాలు హైలైట్ అయ్యేలా రెండు పేజీల్లో రెజ్యూమెను పూర్తి చేయడం మంచిది. ఇంటర్వ్యూ సమయంలో రెజ్యూమె ఆధారంగానే ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల రెజ్యూమె జాగ్రత్తగా తయారుచేయాలి. మలి దశ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోగా మరిన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేస్తే పోటీలో అందరికంటే ముందుండి మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు!!.
- కె.జగదీశ్, హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్, క్యాప్‌జెమిని, హైదరాబాద్.
Published date : 23 Oct 2015 06:32PM

Photo Stories