Skip to main content

ఐఐటీల స్థాయిలో నిలపాలన్నదే లక్ష్యం

ఏపీ ట్రిపుల్ ఐటీస్.. మహానేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మానస పుత్రికలు. గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యనందించాలనే సదాశయంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు ట్రిపుల్ ఐటీల స్థాపనకు ఆయన సంకల్పించారు. అలా 2008లో ఇడుపులపాయ, బాసర, నూజివీడులలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసి.. వీటి నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ)ని నెలకొల్పింది. కేవలం పదో తరగతి అర్హతతో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందిన 6000మంది విద్యార్థులు త్వరలో తమ చదువులు పూర్తిచేసుకొని ఉజ్వల కెరీర్ దిశగా అడుగులు వేయనున్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకు సాధించిన ప్రగతి, పరిశ్రమ పరంగా లభించిన గుర్తింపు తదితర అంశాలపై ఆర్‌జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.వి.రాజ్‌కుమార్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..

సవాళ్లను అధిగమించి..
ఏపీ ట్రిపుల్ ఐటీల్లో తొలి బ్యాచ్‌లో.. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో.. ఒక్కో క్యాంపస్‌లో రెండు వేల మంది చొప్పున మొత్తం మూడు క్యాంపస్‌లలో ఆరు వేల మందికి అడ్మిషన్ కల్పించాం. ఒక రకంగా ఇది సవాల్. దేశంలో ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీలు.. వేటిలోనూ ఒకే క్యాంపస్‌లో ఇంతమంది విద్యార్థులకు ప్రవేశం లభించదు. కానీ ఆర్‌జీయూకేటీ పరిధిలోని ఏపీ ట్రిపుల్ ఐటీల్లో తొలి బ్యాచ్‌లోనే ఆరు వేల మందికి ప్రవేశం కల్పించాం. ఎన్నో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొని విద్యార్థులను సమర్థంగా తీర్చిదిద్దాం. తొలి బ్యాచ్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రముఖ కంపెనీలు, సంస్థలు నిర్వహించిన.. నిర్వహిస్తున్న క్యాంపస్ రిక్రూట్‌మెంట్లే ఇందుకు నిదర్శనం!

ఇన్ఫోసిస్ వంటి సంస్థల గుర్తింపు..
ఒక ఇన్‌స్టిట్యూట్ ప్రామాణికతకు కొలబద్ధ.. సదరు ఇన్‌స్టిట్యూట్‌కు పరిశ్రమ వర్గాల నుంచి లభించే గుర్తింపే. ఈ విషయంలో ఏపీ ట్రిపుల్ ఐటీలు తొలి బ్యాచ్‌లోనే ఆ ఘనతను సాధించాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజంగా పేరొందిన ఇన్ఫోసిస్ వంటి సంస్థ తొలి బ్యాచ్ విద్యార్థుల్లో 153 మందిని ప్రాంగణ నియామకాల ద్వారా ఎంపిక చేసింది. సాధారణంగా ఇన్ఫోసిస్ వంటి కంపెనీ ఒక ఎన్‌ఐటీ క్యాంపస్ నుంచి 30 మందిని మాత్రమే రిక్రూట్ చేస్తుంది. దీంతో పోల్చితే ఏపీ ట్రిపుల్ ఐటీలు మూడు క్యాంపస్‌లలో 153 మంది ఎంపిక కావడం విశేషమే. అదే విధంగా టెక్ మహీంద్రా సంస్థ తాజాగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ మొదలుపెట్టి తొలి దశలోనే 31 మందిని ఎంపిక చేసింది. ఇలా.. ఐటీసీ, ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రెజైస్, ఐవిజ్ టెక్నాలజీస్, అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వంటి మరెన్నో సంస్థలు.. ప్రాంగణ నియామకాల ప్రక్రియను ప్రారంభించాయి. ఎఫ్‌ఎంసీ టెక్నాలజీస్ సంస్థ ఇద్దరు విద్యార్థులకు రూ.5.2 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేయడం ఈ ఇన్‌స్టిట్యూట్‌ల నాణ్యతకు మరో నిదర్శనం.

వినూత్న కరిక్యులం..
ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో.. మూడో ఏడాది నుంచి మొదలయ్యే ఇంజనీరింగ్ కరిక్యులంను వినూత్నంగా రూపొందించడమే పరిశ్రమ పరంగా మా విద్యార్థులకు లభిస్తున్న గుర్తింపునకు కారణం. దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో మరే యూనివర్సిటీలో లేని విధంగా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయడం కూడా లాభించింది. ఫలితంగా.. తొలి బ్యాచ్‌లో 5,700 మంది విద్యార్థులు.. ఇరిగేషన్ అండ్ ఐక్యాడ్ డిపార్ట్‌మెంట్, విశాఖ ఉక్కు కర్మాగారం, ఎన్‌ఐటీ సూరత్‌కల్ వంటి అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు.

క్రాస్ కల్చరల్.. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్..
ఇంజనీరింగ్ విద్యార్థులకు క్రాస్‌కల్చరల్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఎంతో అవసరం. ఆ నైపుణ్యాలు అలవడే విధంగానూ శిక్షణనిస్తున్నాం. ఈ క్రమంలో ఇంజనీరింగ్‌లో మెయిన్ బ్రాంచ్‌తోపాటు మరో ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్ట్ లేదా సైన్స్ సబ్జెక్ట్‌ను, క్లాసికల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌ను మైనర్ సబ్జెక్ట్‌లుగా రూపొందించాం. ఫలితంగా.. ఒక విద్యార్థి ఒకే సమయంలో మూడు విభాగాల్లో నైపుణ్యం పొందే అవకాశం లభిస్తుంది. సమర్థమైన మానవ వనరులను తీర్చిదిద్దడమే ఏపీ ట్రిపుల్ ఐటీల లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ మేరకు బోధన ప్రమాణాలకు రూపకల్పన చేశాం. అదే క్రమంలో.. విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ లభించే విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ వెంచర్స్ వంటి సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టాం. విద్యార్థులను కేవలం బీటెక్ కోర్సు బోధనకే పరిమితం చేయడం లేదు. ఎంటెక్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గేట్.. యూపీఎస్సీ నిర్వహించే ఐఈఎస్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధులయ్యే విధంగా కూడా కోచింగ్ ఇస్తున్నాం. ఆర్‌జీయూకేటీ పరిధిలో ఎంటెక్ కోర్సు ఉన్నప్పటికీ గేట్ ఉత్తీర్ణత తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం ఎంటెక్‌లో కేవలం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వచ్చే ఏడాది నుంచి 100 సీట్లకు పెంచుతాం.

ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు..
ఏపీ ట్రిపుల్ ఐటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. ఫ్యాకల్టీ కొరత. దీనికి పరిష్కారంగా అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థులు ఫ్యాకల్టీగా పనిచేసేందుకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే విధంగా నిరంతర నియామక విధానాన్ని అమలు చేస్తున్నాం. అంతేకాకుండా.. ఐఐటీ-రూర్కీలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ నిర్వహించి నాణ్యమైన ఫ్యాకల్టీని నియమించాం. అయినప్పటికీ.. ఇంకా 50 శాతం మేర ఫ్యాకల్టీ కొరత ఉంది. దీన్ని కూడా త్వరలోనే అధిగమించి విద్యార్థులకు మరింత మెరుగైన బోధనను అందిస్తాం. ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యలో ఉత్తమ బోధనకు మూల సాధనం.. మౌలిక సదుపాయాలు. మొదట్లో వీటి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. క్రమేణా వీటిని మెరుగుపరుస్తున్నాం. ఇప్పటికే అన్ని క్యాంపస్‌లలో లేబొరేటరీలను పూర్తి స్థాయిలో నిర్మించాం. ఈ ఏడాది మూడు క్యాంపస్‌లలోనూ ప్రతి డిపార్ట్‌మెంట్‌కు లేబొరేటరీలతో కూడిన ప్రత్యేక భవనాలు నిర్మించే చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.680 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు పంపాం.

విద్యార్థులకు పూర్తిస్థాయి ఇంజనీరింగ్ పరిజ్ఞానం..
మొత్తంగా చూస్తే.. 2008లో ప్రారంభమైన ఏపీ ట్రిపుల్ ఐటీలు.. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఏటేటా పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. పూర్తి స్థాయి ఇంజనీరింగ్ పరిజ్ఞానం పొందే విధంగా విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. ట్రిపుల్ ఐటీలుగా ఉన్నప్పటికీ.. సమీప భవిష్యత్తులో ఒక్కో క్యాంపస్‌ను ఐఐటీ స్థాయిలో నిలపడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో త్వరలో ఆ లక్ష్యాన్ని చేరుకుని.. దేశంలోనే పేరెన్నిక గల ఇన్‌స్టిట్యూట్‌లుగా గుర్తింపు తీసుకురాగలమని ఆశిస్తున్నాం.
Published date : 11 Feb 2014 12:15PM

Photo Stories