googletag.pubads().enableSingleRequest(); googletag.pubads().setTargeting('SakEdu_section', ['appsc']); googletag.pubads().collapseEmptyDivs(); googletag.pubads().setCentering(true); googletag.enableServices(); }); Skip to main content

Inspirational Srory: రూ.2లతో ప్రారంభం... నేడు రూ.కోట్ల‌కు అధిప‌తి

మనదైనందిక జీవితంలో చాయ్‌ ఒక భాగమైంది. ఉదయం లేవగానే చాయ్‌ తాగందే రోజుగడవదు మనందరికి. ఒత్తిడిలో ఉన్నా.. తలనొప్పెడుతున్నా.. స్నేహితులు, బంధువులతో సరదగా టైం స్పెండ్‌ చేయాలి అన్నా.. సందర్భం ఏదైనా.. ఎక్కడైనా.. కచ్చితంగా  టీ ఉండాల్సిందే.
Niloufer Cafe Baburao

ఏ చాయ్‌ చటుక్కున తాగరా భాయ్‌
ఈ చాయ్‌ చమక్కులే చీపురా భాయ్‌
ఏ చాయ్‌ ఖరీదులో చీపురా భాయ్‌
ఈ చాయ్‌ ఖుషీలనే చూపురా భాయ్‌

ఏ చాయ్‌ గరీబుకు విందురా భాయ్‌
ఈ చాయ్‌ నవాబుకి బంధువే నోయ్‌
ఏ చాయ్‌ మనస్సుకీ మందురా భాయ్‌
ఈ చాయ్‌ గలాసుకీ జై జై 
ఈ చాయ్‌నే తన ఆదాయ వనరుగా మార్చుకున్నారు బాబురావు. చిన్న టీ షాప్‌గా ప్రారంభమైన ఆయన బిజినెస్‌ నేడు కోట్లకు విస్తరించింది. బాబురావు సక్సెస్‌ స్టోరీ మీకోసం...  
చాయ్‌కి కేరాఫ్‌ నిలోఫర్‌ కేఫ్‌...Niloufer Cafe Baburao
చాయ్‌ ని ఎంతో ఇష్టపడే వారికి నగరంలో నీలోఫర్‌ కేఫ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 40 సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ నీలోఫర్‌ కేఫ్‌ ఎప్పుడో ఒక్కసారి కచ్చితంగా వెళ్లి ఉంటారు. బాబురావు ఈ టీ దుకాణాన్ని మొదలు పెట్టినప్పుడు జనాలకు తాను చేసే టీ బాగా నచ్చాలి.. అప్పుడే తన టీ షాప్‌ కి ఎవరైనా వస్తారని.. ఆదే ఆలోచించి అందరికీ నచ్చే విధంగా తయారు చేశారు. అంతేకాదు టీ తాగిన తర్వాత ఎంతో మంది అభిప్రాయాన్ని తెలుసుకుని వారికి ఇష్టంగా టీ తయారు చేయడం మొదలు పెట్టారు. ఆ నాటి నుంచి టీ అంటే నీలోఫర్‌ దుకాణం కేరాఫ్‌గా మారింది. బాబూరావు నడుపుతోన్న ఈ నీలోఫర్‌ చాయ్‌ దుకాణం ఎప్పుడు చూసినా కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. జీఎస్టి నెలకు ఇరవై ఐదు లక్షల రూపాయలుంటే టర్నోవర్‌ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఆకలితో ఉన్న నిర్భాగ్యులకు అన్నం పెడుతూ...
బాబు రావు మనసు కూడా చాలా విశాలమైంది. ఆయన సంపాదనలో ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తుంటారు. ప్రతిరోజూ తన టీ షాప్‌ లో మిగిలిన ఆహార పదార్థాలు ఆకలితో ఉన్నవారందిరికీ పంచుతుంటారు. పాతిక సంవత్సరాల నుంచి తాను ఈ పని చేస్తున్నానని.. మనసుకు ఎంతో తప్తిగా ఉంటుందని బాబూ రావు చెప్తారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి ఆయన హైదరాబాద్‌కి వచ్చారు. తొలినాళ్లలో ఓ బట్టల దుకాణంలో పనిచేసిన ఆయన తర్వాత రోజుకు రెండు రూపాయల కోసం ఒక హోటల్‌లో పనిచేశారు. తన విజయవంతమైన ప్రయాణం కేఫ్‌ నీలోఫర్‌తో ప్రారంభమైనట్లు ఆయన గర్వంగా చెబుతారు. 
కాంట్రాక్ట్‌ తీసుకుని విజయపథంలోకి...
వాస్తవానికి నిలోఫర్‌ కేఫ్‌ నష్టాల్లో ఉన్నప్పుడు బాబురావు దాన్ని కాంట్రాక్ట్‌కు తీసుకున్నారు. తన పనితనంతో లాభాల బాట పట్టించారు. తర్వాత కేఫ్‌ను టేకోవర్‌ చేసి, తానే యజమానయ్యారు. తాను చదువుకునే రోజుల్లో ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డానని.. ఒకదశలో తన చదువు కోసం ఇంట్లో పాడి ఆవుని అమ్మి మరీ చదివించినట్లు గుర్తు చేసుకుంటుంటారు. ఏ కష్టం వచ్చినా కుంగిపోకుండా కృషీ, పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని బాబురావు పలువురిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేస్తుంటారు.  అలాగే 700 మంది వరకు ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. కేఫ్‌లో సుమారు 700 మంది వరకు పనిచేస్తున్నారు. వారికి రోజూ భోజనానికే మూడు లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. మొత్తానికి రోజుకి రెండు రూపాయలతో జీవితం ప్రారంభించిన బాబురావు... నేడు లక్షల రూపాయలను ట్యాక్స్‌గా కట్టేస్థాయికి ఎదగడం ఎంతో మందికి ఇన్ఫిరేష‌న్‌గా నిలుస్తోంది.

Published date : 09 Dec 2022 06:15PM

Photo Stories