Education: ఊరినే బడిగా..వినూత్న పద్ధతిలో బోధన
గత ఏడాదిన్నర కాలంగా దేశంలోని పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ తెరుచుకుంటున్నాయి. అదీ చాలా తక్కువ ప్రాంతాల్లో. ఈ లాక్‌డౌన నుంచి పిల్లలను బయటకు తెచ్చి, మళ్లీ చదువు వైపు మళ్లించాలని ఆ ఉపాధ్యాయుడు భావించాడు. కానీ ఎలా? క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పలేడు. తాను పని చేస్తున్నది మారుమూల ప్రాంతమైన జబా గ్రామం. అక్కడ ఇంటర్నెట్, కంప్యూటర్లు వంటివేమీ ఉండవు. నిరుపేదలే నివాసితులు.
ఈ ఐడియాను..
ఆన్‌లైన్ క్లాసులకు అవకాశం లేదు. బాగా ఆలోచించాడు. గ్రామాన్నే తరగతి గదిగా మర్చేస్తే!!.. ఐడియా బాగుంది. వెంటనే ఆచరణలో పెట్టాడు. వీధి గోడలన్నింటినీ బ్లాక్ బోర్డులుగా మార్చాడు. వివిధ సబ్జెక్టుల పాఠాలు వాటిపై రాశాడు. పిల్లల్ని రోడ్డు పక్కన దూరదూరంగా కూర్చొబెట్టాడు. వాళ్లకి మాస్కులిచ్చాడు. చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేయించాడు. పాఠాలు బోధించాడు. రాయడం, చదవడం దగ్గర నుంచి ఎవరి తరగతికి అవసరమైన పాఠాలు వారికి బోధిస్తున్నాడు.
ఎటువంటి సౌకర్యాలు లేని..
ఊర్లో పిల్లలందరూ చదువుకుంటున్నారు. పెద్దలు సంతోషిస్తున్నారు. ఊరినే బడిగా మార్చేసిన నాయక్‌ని అందరూ ‘రాస్తర్ మాస్టర్’ అని పిలుచుకుంటున్నారు. ‘ఈ గ్రామంలో పిల్లలకు చదువు చెప్పడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. అలా అని పిల్లల్ని వదిలేయలేము. అందుకే వీధి గోడలనే బ్లాక్‌బోర్డులుగా మార్చి పాఠాలు బోధిస్తున్నాను. కరోనా కాలంలో ఎలా జీవించాలో కూడా బోధిస్తున్నా. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ ఉపయోగం వంటివి కూడా చెబుతున్నాను. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు’ అని నాయక్ చెప్పారు.