Skip to main content

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపుకు సర్కార్ ‘నో’

సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా ఫీజులను పెంచేందుకు ప్రభుత్వం నిరాకరించింది.
కరోనా వేళ పెంపు సరికాదని భావించి కాలేజీల విన్నపాన్ని తిరస్క రించింది. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చేసిన ఫీజుల సవరణ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. ప్రస్తుతం ఉన్న ఫీజులనే కొనసాగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఫీజులపై స్పష్టత రావడంతో వెంటనే ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కోటా మెడికల్ సీట్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

రెండు రకాల సిఫారసులు
బీ, సీ కేటగిరీ ఫీజులను పెంచాలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏఎఫ్‌ఆర్‌సీకి విన్నవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలు ఉండగా దీన్ని రూ. 14 లక్షల వరకు పెంచాలని కొన్ని కాలేజీలు కోరినట్లు తెలిసింది. కల్పించిన మౌలిక సదుపాయాలు, పెరిగిన ఖర్చులు తదితర వివరాలతో అకౌంట్ల సమగ్ర నివేదికలను కాలేజీలు ఏఎఫ్‌ఆర్‌సీకి సమర్పిం చాయి. కాలేజీల్లో వసతులను బట్టి, వాటి ఖర్చును బట్టి ఒక్కో కాలేజీకి ఒక్కోరకంగా ఫీజు ఉంటే బాగుంటుందని ఏఎఫ్‌ఆర్‌సీ భావించి ప్రభుత్వానికి నివేదించింది (ఈ ఏడాది పీజీ మెడికల్ మేనేజ్‌మెంట్ సీట్ల ఫీజును అలాగే ఖరారు చేసిన సంగతి తెలిసిందే). అలాగే రెండో ప్రతిపాదన కూడా చేసింది. ప్రస్తుతం ఉన్నట్లుగానే అన్ని కాలేజీలకు ఒకే ఫీజును కూడా నిర్ణయించవచ్చని సిఫారసు చేసింది. ఈ రెండింటిపై చర్చించిన ప్రభుత్వం ఈసారి అసలు ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం ఈసారి కూడా బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలు వసూలు చేసుకోవచ్చు. ఇక సీ కేటగిరీలో దీనికి రెట్టింపు ఫీజు.. రూ. 23.10 లక్షల వరకు వసూలు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. సర్కారు నిర్ణయంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కంగుతిన్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజల ఆదాయాలు పడిపోవడం, ఉన్న ఫీజులే భరించలేని పరిస్థితుల్లో పెంచడం సబబు కాదనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Published date : 16 Dec 2020 03:23PM

Photo Stories