Skip to main content

పెంచాలా? వద్దా?..మెడికల్ ఫీజు పెంపుపై ఫీజుల నియంత్రణ కమిటీ తర్జనభర్జన!

సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ ఫీజులను పెంచాలని ప్రైై వేట్ మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాయి.

కన్వీనర్ కోటా సహా మేనేజ్‌మెంట్ (బీ), ఎన్ ఆర్‌ఐ (సీ) కేటగిరీ సీట్లకు ఫీజులు పెంచాలని కోరాయి. ఈ మేరకు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ)కి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నివేదించాయి. ఫీజులు పెంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ తమ అకౌంట్ వివరాలను అందజేశాయి. కాలేజీల నిర్వహణ, ఫ్యాకల్టీ, సిబ్బందికి వేతనాలు, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, విద్యార్థులకు లైబ్రరీల ఏర్పాటు, కరెంటు వంటి వాటికి ఖర్చులు భారీగా పెరిగాయని ఆధారాలతో సహా సమర్పించాయి. ఈ నేపథ్యంలో మెడికల్ ఫీజుల సవరణపై ఏఎఫ్‌ఆర్‌సీ కసరత్తు చేస్తోంది. ఫీజులు పెంచాలా? వద్దా? పెంచితే ఎంత పెంచాలి? వంటి వివరాలతో ఏఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. అనంతరం సర్కార్ ఉత్తర్వులు విడుదల చేయనుంది.

కన్వీనర్ సీట్లకూ పెంచాలన్న డిమాండ్...
రాష్ట్రంలో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో 1,740 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే 22 ప్రైై వేట్, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 3,300 సీట్లున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై కసరత్తు మొదలైంది. ప్రైవేట్‌లోని సగం కన్వీనర్ కోటా సీట్లకు ఏడాదికి ఫీజు రూ. 60 వేలుంది. 35 శాతం బీ కేటగిరీ సీట్లకు రూ. 11.55 లక్షలుంది. 15 శాతం సీ కేటగిరీ సీట్లకు (బీ కేటగిరీ ఫీజుకు రెట్టింపు) రూ. 23.10 లక్షల వరకు వసూలు చేసుకోవడానికి వీలుంది. ఇక మైనారిటీ కాలేజీల్లోని 60 శాతం కన్వీనర్ కోటా సీట్లకు రూ. 60 వేల ఫీజు ఉంది. 25 శాతం బీ కేటగిరీ సీట్లకు 14 లక్షలు, 15 శాతం సీ కేటగిరీ సీట్లకు రూ. 18 లక్షల ఫీజుంది. కన్వీనర్ కోటా సీట్లకు దాదాపు 8 ఏళ్ల క్రితం ఫీజు ఖరారైందని ప్రైవేట్ కాలేజీలు చెబుతున్నాయి. ఇక బీ, సీ కేటగిరీ సీట్ల ఫీజు 2017లో ఖరారైంది. ప్రతీ ఏడాది 5 శాతం పెంచుకోవచ్చని ప్రభుత్వం అప్పట్లో చెప్పిందని, కానీ అమలు కావడం లేదని యాజమాన్యాలు అంటున్నాయి. కాబట్టి పెరిగిన ఖర్చుల దృష్ట్యా కన్వీనర్ కోటా సహా అన్ని ఫీజులు పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ మేరకు ఎంతెంత పెంచాలన్న వివరాలనూ కూడా అంతర్గతంగా ఏఎఫ్‌ఆర్‌సీకి విన్నవించినట్లు తెలిసింది.

నోటిఫికేషన్ కు ముందే నిర్ణయం...
నీట్ ఫలితాలు వెలువడ్డాయి. ఆలిండియా కోటా సీట్లకు 27 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇక తెలంగాణలో ఈ నెల 29న నోటిఫికేషన్ జారీ కానుందని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. అప్పటినుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుందని అంటున్నాయి. అందువల్ల రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదలకు ముందే ఫీజుల పెంపుపై సర్కారు నిర్ణయం తీసుకుంటుందని ప్రైై వేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుంటే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఫీజులు పెంచొద్దని సర్కారుకు విన్నవిస్తున్నారు. కరోనా కాలంలో అసలే వ్యాపారాలు లేక ఆదాయం పడిపోయిందని, ఉపాధి అవకాశాలు కోల్పోయామని చెబుతున్నారు.

డీమ్డ్ వర్సిటీలపై విద్యార్థుల చూపు...
ఇదిలావుంటే రాష్ట్రంలో ఫీజులు పెంచినా, అధిక ఫీజులు వసూలు చేసినా విద్యార్థులు భరించే పరిస్థితి కనిపించడం లేదు. నీట్ కారణంగా జాతీయంగా ఇష్టమైన కాలేజీల్లో చేరడానికి వీలుంది. రాష్ట్రంలో కంటే తక్కువ ఫీజుతో ఇతర రాష్ట్రాల్లో మంచి కాలేజీల్లో చేరడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో
డీమ్డ్ వర్సిటీల్లోని మెడికల్ కాలేజీల్లో ఇక్కడి మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ ఫీజుల కంటే చాలా తక్కువ ఫీజుకే సీట్లు వస్తున్నాయంటున్నారు. కాబట్టి ఇక్కడ అధిక ఫీజులు పెట్టి చదవాల్సిన అవసరం లేదన్న భావన కొందరు తల్లిదండ్రుల్లోనెలకొంది. కరోనా కాలంలో దూరం వెళ్లడం సమస్యగా మారుతోంది.

Published date : 27 Oct 2020 03:50PM

Photo Stories