Skip to main content

ఏపీ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి.
ఇటీవలే 700 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల నియామకం, తాజాగా అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు తదితర చర్యలతో ఎండీ, ఎంఎస్‌ వంటి పీజీ సీట్లకు అర్హత వచ్చింది. దీంతో పలు కాలేజీల్లో వివిధ పీజీ కోర్సులకు దరఖాస్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు కళాశాలల్లో దరఖాస్తు చేసిన సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో సుమారు ఐదు విభాగాల్లో 28 సీట్లు రానున్నాయి. కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజీలో గైనకాలజీ సీట్లు, పీడియాట్రిక్స్, జనరల్‌ సర్జరీ సీట్లకు దరఖాస్తు చేశారు. కాకినాడలోని వైద్య కళాశాలకు భారీగా ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. సీట్లు పెరగడం వల్ల పేదలకు భారీ లబ్ధి జరగనుంది. కర్నూలు, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం కాలేజీల్లో కూడా భారీగా పీజీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లు పెంచేందుకు దరఖాస్తు చేశారు. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కలిపి ఒకేసారి 145 సీట్లు పెరగడం ఇదే మొదటిసారి. ఈ సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి.

చ‌ద‌వండి: రెండేళ్లలోనే ఏపీలో విద్య, వైద్య విప్లవం 

సీట్లతో పాటు మౌలిక వసతుల కల్పన
వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడమంటే కేవలం వైద్య విద్యార్థులు చదువుకోవడమే కాకుండా, దీనికి సంబంధించి భారీ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి విభాగంలోనూ యూనిట్లు పెంచాలి. ఒక్కో యూనిట్‌కు ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్‌లు, ఒక ప్రొఫెసర్‌ ఉండాలి. స్టాఫ్‌ నర్సులు, ఆపరేషన్‌ థియేటర్లు పెరుగుతాయి. ఇంటెన్సివ్‌ కేర్, ఆక్సిజన్‌ బెడ్స్‌ విధిగా అందుబాటులోకి తీసుకురావాలి. ఇలా ఒక పీజీ సీటు పెరిగిందంటే చాలా రకాల మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, వైద్యులు పెరిగితే ఆటోమేటిగ్గా ఎక్కువ మంది పేషెంట్లకు స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అందువల్ల త్వరలో పెరగనున్న పీజీ సీట్లతో భారీగా వసతులు ఏర్పాటు కానున్నాయి.

పెరగనున్న సీట్లు
  • కడప మెడికల్‌ కాలేజీ
    ఎండీ మైక్రో బయాలజీ : 07
    ఎండీ బయో కెమిస్ట్రీ : 05
    ఎండీ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ : 05
    ఎండీ సైకియాట్రీ : 04
    ఎండీ ఫార్మకాలజీ : 07
  • రంగరాయ మెడికల్‌ కాలేజీ, కాకినాడ
    ఎంఎస్‌ అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ : 10
    ఎండీ పీడియాట్రిక్స్‌: 05
    ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ: 06
  • ఎస్వీ మెడికల్‌ కాలేజీ, తిరుపతి
    ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ: 07
    ఎండీ రెస్పిరేటరీ మెడిసిన్‌: 02
    ఎండీ పీడియాట్రిక్స్‌: 10
  • అనంతపురం మెడికల్‌ కాలేజీ
    ఎండీ పల్మనరీ మెడిసిన్‌: 08
    ఎండీ అనాటమీ: 08
  • నెల్లూరు మెడికల్‌ కాలేజీ
    ఎండీ గైనకాలజీ: 10
  • ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, విశాఖపట్నం
    డీఎం పల్మనరీ మెడిసిన్‌: 02
  • కర్నూలు మెడికల్‌ కాలేజీ
    డీఎం ఎండోక్రినాలజీ: 02
    డీఎం న్యూరాలజీ: 02
    ఎండీ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ : 05
    ఎంఎస్‌ అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ : 06
  • సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, విజయవాడ
    ఎండీ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ : 05
    ఎండీ సైకియాట్రీ : 06
    ఎండీ రేడియో డయాగ్నోసిస్‌: 06
    ఎంఎస్‌ ఓటో రినోలారీంగాలజీ : 06
    ఎంఎస్‌ ఆఫ్తాల్మాలజీ : 11

ప్రస్తుతం ఉన్న పీజీ సీట్లు

మెడికల్‌ కళాశాలలు

సీట్ల సంఖ్య

ఆంధ్ర, విశాఖ

212

రంగరాయ, కాకినాడ

133

గుంటూరు మెడికల్‌ కళాశాల

102

రిమ్స్, శ్రీకాకుళం

23

రిమ్స్, ఒంగోలు

12

రిమ్స్, కడప

34

ఎస్‌వీఎంసీ, తిరుపతి

142

కర్నూలు మెడికల్‌ కళాశాల

139

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, అనంత

57

సిద్ధార్థ, విజయవాడ

89

స్విమ్స్, తిరుపతి

41

మొత్తం

984


ప్రభుత్వ వైద్య కళాశాలలు బలోపేతం
జాతీయ మెడికల్‌ కమిషన్‌ నిబంధనల మేరకు సీట్లు పెంచుతున్నాం. అదనపు సీట్లతో భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆయా సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. సీట్లకు సరిపడా ప్రొఫెసర్ల కోసం అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాలలు భారీగా బలోపేతం కానున్నాయి.
– డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు

చ‌ద‌వండి: జూన్‌16 నుంచి ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ తరగతులు!
Published date : 14 Jun 2021 07:25PM

Photo Stories