Success: ఆమె కలకు వైకల్యం అడ్డు రాలేదు.. సైలెంట్ లాయర్
కేరళలోని కొట్టాయంకు చెందిన సన్నీ, బెట్టి దంపతులు బెంగళూరులో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు పిల్లలు. దురదృష్టవశాత్తు ముగ్గురికి వినికిడి సమస్య ఉంది. నార్మల్ స్కూల్‌లోనే చదివించారు. మిగతా విద్యార్థులతో పోటీ పడుతూ చదువులో తమ ప్రతిభను చాటుకున్నారు పిల్లలు. ఎక్కడా ఆత్మన్యూనతకు గురికాకుండా అణువణువూ ఆత్మవిశ్వాసం ఉండేలా పిల్లలను పెంచారు తల్లిదండ్రులు. సారా, మరియాలు కవలపిల్లలు. లాయర్ కావాలనేది సారా చిన్నప్పటి కోరిక. ‘కచ్చితంగా అవుతావు తల్లీ’ అని తల్లిదండ్రులు ఆశీర్వదించారు తప్ప ఎప్పుడూ చిన్నబుచ్చలేదు. బెంగళూరులో బి.కామ్ పూర్తి చేసింది సారా. ఇప్పుడిక తన చిరకాల కోరికను నెరవేర్చుకునే ఆనందసమయం వచ్చేసింది అనుకుంది. ఒక లా కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తే సారాకు వినికిడి సమస్య ఉన్న కారణంగా నిరాకరించారు. అయితే చదువులో తన పూర్వ ప్రతిభను దృష్టిలో పెట్టుకొని సెయింట్ జోసెఫ్ లా కాలేజీ ఆడ్మిషన్ ఇచ్చింది. పాత క్లాస్‌మెట్ ఒకరు కూడా ఈ కాలేజీలో చేరడంతో తనకు సహాయంగా నిలిచినట్లయింది. కాన్‌స్ట్యూషనల్ లా, డిసెబిలిటీ లా, హ్యుమన్ రైట్స్‌లాను లోతుగా అధ్యయనం చేయాలనేది సారా కోరిక.
సెయింట్ జోసెఫ్ కాలేజీలో నార్మల్ స్టూడెంట్స్‌తో పోటీ పడుతూ మంచిమార్కులు తెచ్చుకుంది ‘లా’ పట్టా చేతికి వచ్చిన క్షణాలు తన జీవితంలో మరిచిపోలేని సమయం! ‘పట్టుదలతో కృషి చేస్తే, దారి ముందుకు వచ్చే అవరోధాలు తోకముడుస్తాయి’ అని మరోసారి గుర్తు చేసుకున్న సగర్వ సందర్భం. కర్నాటక బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయింది సారా. న్యాయశాస్త్రం చదువుకోవడం సరే ‘కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారు?’ అనే ప్రశ్నకు ‘ ఇంటర్‌ప్రెటర్ సహాయంతో’ అని జవాబు ఇచ్చింది సారా. సారా న్యాయవాద వృత్తిని ఎంచుకోవడానికి, న్యాయశాస్త్రం మీద ఆసక్తి, అభిమానాలతో పాటు వినికిడి సమస్య ఉన్న వాళ్లలో ‘యస్. నేను కూడా లాయర్ కాగలను’ అనే ఆత్మవిశ్వాసం నింపడం కూడా.
చదవండి:
మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆరతి డోగ్రా విజయ గాథ..
నడవలేవంటూ వదిలేసిన భర్త.. తండ్రి ప్రోత్సాహంతో నేడు సివిల్స్ లో టాపర్..