Skip to main content

ఎవర్ గ్రీన్ కెరీర్ `లా`

‘రోజురోజుకూ న్యాయ విద్య ప్రాధాన్యం పెరుగుతోంది. లా కోర్సు ఆధునికతను సంతరించుకుంటోంది. కేవలం ప్రాక్టీసింగ్ అనే ధోరణి మారింది. ఈ పరిస్థితుల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు లా కెరీర్‌ను నిస్సందేహంగా ఎంపికచేసుకోవచ్చు’ అంటున్నారు..
కామన్ లా అడ్మిషన్ టె్‌స్ట్ (క్లాట్)-2018 నిర్వాహక సంస్థ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రోజ్ వర్గీస్. నాలుగు దశాబ్దాల కిందట న్యాయవాద వృత్తిలో ప్రవేశించి.. న్యాయవాదిగా, ఆ తర్వాత న్యాయ విద్యావేత్తగా అనుభవం గడించి.. ప్రస్తుతం ఎన్‌యూఏఎల్‌ఎస్ వీసీగా బాధ్యతలు నిర్వహిస్తూ.. క్లాట్-2018 పర్యవేక్షణ చేపడుతున్న ప్రొఫెసర్ రోజ్ వర్గీస్‌తో గెస్ట్ కాలం..

న్యాయవాద వృత్తి ఎవర్ గ్రీన్ కెరీర్. దశాబ్దాలుగా ఈ వృత్తికి ఉన్న విలువ వెల కట్టలేనిది. ప్రస్తుతం వివిధ రంగాల్లో రాణిస్తున్న వారెందరో న్యాయ విద్య నేపథ్యం నుంచి వచ్చిన వారే. ఒకానొక సమయంలో ‘లా’ కోర్సులను కేవలం ప్రత్యామ్నాయంగా భావించిన మాట కొంతవరకు నిజమే. కానీ, ఇటీవల విద్యార్థుల దృక్పథంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయ విద్యవైపు అడుగులు వేస్తున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. జాతీయ స్థాయిలో క్లాట్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం.

కార్పొరేట్ అవకాశాలు :
ప్రస్తుతం లా గ్రాడ్యుయేట్లకు కార్పొరేట్ అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా సైబర్ ‘లా’, ఐపీఆర్, కార్పొరేట్ ‘లా’ నిపుణులకు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.

అదనపు అర్హత.. ప్రయోజనం
సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు న్యాయ విద్యను అభ్యసించడాన్ని అదనపు ప్రయోజనంగా భావిస్తున్నారు. క్లాట్ అడ్మిషన్స్ పరంగా ఈ నేపథ్యం ఉన్నవారి సంఖ్య అయిదు నుంచి పది శాతం మధ్యలో ఉంటోంది. మిగతా వారు కూడా తమకు స్థానికంగా అందుబాటులో ఉన్న కళాశాలల్లో న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. దీనివల్ల వారికి వృత్తి పరంగా ఎదురయ్యే న్యాయ సమస్యలపై అవగాహన ఏర్పడుతుంది. ఫలితంగా తమ వృత్తిలో మరింత ఉన్నతంగా రాణించేందుకు అవకాశం ఉంటుంది.

విశ్లేషణ.. ప్రాక్టికాలిటీ
న్యాయ విద్యలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం.. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా విశ్లేషించగల సామర్థ్యం. అదేవిధంగా నిరంతరం చట్టాల్లో వస్తున్న మార్పులు గురించి అధ్యయనం చేయగలిగే విధంగా సెల్ఫ్ లెర్నింగ్ దృక్పథం అలవరచుకోవాలి. కోర్సు చేస్తున్నప్పుడే ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో అడుగులు వేయాలి. అందుకే గడిచిన కొన్నేళ్లుగా మాక్ కోర్టులు, రియల్ కేస్ అనాలిసిస్‌లు వంటి వాటిని కరిక్యులంలో తప్పనిసరి చేశారు. దీనివల్ల విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది.

ఫ్యాకల్టీ కొరత.. పరిష్కారం!
న్యాయ కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత ఉందనే అభిప్రాయాన్ని కొంత వరకు అంగీకరించాల్సిందే. అయితే దీనికి కారణం.. ఇటీవల కాలంలో న్యాయవిద్యను పూర్తిచేసుకున్న అభ్యర్థులు కార్పొరేట్ కొలువులు, ఇతర మార్గాల వైపు దృష్టి సారించడమే. ఏటా సర్టిఫికెట్లు అందుకుంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 20 శాతం మంది అధ్యాపక వృత్తిని ఎంపిక చేసుకుంటే ఫ్యాకల్టీ కొరత సమస్యను పరిష్కరించొచ్చు.

గతేడాది తరహాలోనే..
క్లాట్-2018 విషయానికి వస్తే పరీక్ష విధానం గతేడాది మాదిరిగానే ఉంటుంది. క్లాట్ ద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులను అందించడానికి కారణం.. విద్యార్థులకు ముందునుంచే ఈ కోర్సు, ప్రొఫెషన్‌పై బలమైన పునాది ఏర్పరచేందుకే. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం కొన్ని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్స్.. అయిదేళ్ల కోర్సు వ్యవధిలో విద్యార్థులు ప్రాథమికంగా తమకు ఆసక్తి ఉన్న కోర్సులను అభ్యసించే విధంగా కరిక్యులంను రూపొందించాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లు సైన్స్ కోర్సులను కూడా అందిస్తున్నాయి.
Published date : 20 Dec 2017 03:19PM

Photo Stories