DEO Ashok: ప్రాథమిక స్థాయిలో చిన్నారుల్లో విద్యా సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమం
ఆసిఫాబాద్‌రూరల్: ప్రాథమిక స్థాయిలో చిన్నారుల్లో విద్యా సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈవో అశోక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయులకు రెండో విడత తొలిమెట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాల దశలో విద్యార్థికి అందించే ప్రాథమిక విద్య జీవితానికి పునాది వంటిందన్నారు. ఈ దశలో విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠ్యాంశాల బోధన, అభ్యసన తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని 15 మండలాల నుంచి 90 మంది ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. శిక్షణ పొందిన వారు మండలంలోని మిగిలిన టీచర్లకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, శిక్షణ రిసోర్స్‌పర్సన్లు రాజకమలాకర్, చారి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
CBSE Classes in Local Languages: పాఠశాలలు ఇప్పుడు ప్రాంతీయ భాషలలో బోధించవచ్చు!