Skip to main content

Kids: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..

How To Build Strong Bones In Kids

పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే పెద్దవారితో పోల్చితే పిల్లల ఎముకలు బలహీనంగా ఉంటాయి. దీనివల్ల చిన్న చిన్న దెబ్బలు తాకినా తొందరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. బాల్యంలోని బలమైన ఎముకలు వారి జీవితకాల ఆరోగ్యానికి అద్భుతమైన పునాదిని అందిస్తాయి. అందువల్ల వారి ఎముకలు దృఢంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన ఆహార నియమాలపై అవగాహన కోసం...
 
కాల్షియం
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరం అని తెలుసు  కాబట్టి పిల్లలు రోజుకు కనీసం రెండు గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే ఆహారంలో బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు, బెండ, పొట్ల వంటి కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడండి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్‌ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 

చ‌ద‌వండి: Rs 2 lakh incentive for single girl child: ఒక్క ఆడపిల్ల ఉంటే రూ.2 లక్షలు

విటమిన్‌ డి
శరీరానికి కావలసిన కాల్షియంను గ్రహించేందుకు విటమిన్‌ డి సహాయపడుతుంది. విటమిన్‌ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్‌ డి లేకపోతే విటమిన్‌ డి సప్లిమెంట్‌ను తీసుకోవాలి. నవజాత శిశువులకు కూడా విటమిన్‌ డి సప్లిమెంట్స్‌ అవసరం. కానీ డాక్టర్లను సంప్రదించిన తర్వాతే ఇవ్వాలి. 

మెగ్నీషియం, విటమిన్‌ కె
శరీరంలో విటమిన్‌ కె, మెగ్నీషియం స్థాయిలు ఎక్కువగా ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.  కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా మీ పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. బచ్చలికూర, క్యాబేజీ, మొలకలు వంటి వాటిల్లో విటమిన్‌ కె,  మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు తృణధాన్యాలను పెట్టండి. 

కార్బోనేటేడ్‌ పానీయాలు వద్దే వద్దు
కార్బోనేటేడ్‌ పానీయాలలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్‌ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్‌ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ పానీయాలను తాగించండి. ఎముకలను బలోపేతం చేసేవాటిలో ముఖ్యమైనది శారీరక శ్రమ. అందుకే పిల్లలు బాగా ఆటలు ఆడేలా చూడండి. వీలైతే చిన్న చిన్న వ్యాయామాలను చేయించండి.  

చ‌ద‌వండి: Anganwadi school: అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు

Published date : 07 Oct 2023 05:12PM

Photo Stories