Skip to main content

మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంతో...ఉచితంగా 1,500 ఐటీ కోర్సులు

సాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), డేటా సైన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో సహా ఆధునిక కాలానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలలో యువతను తీర్చిదిద్దేందుకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నడుంబిగించింది.
లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తేనేగానీ లభ్యంకాని పలు కోర్సులను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంతో ఈ కోర్సులను ఈ-లెర్నింగ్‌ పోర్టల్‌ ద్వారా అందించనున్నారు. మైక్రోసాఫ్ట్‌ లెర్నింగ్‌ రిసోర్సు సెంటర్‌ ద్వారా ఈ-లెర్నింగ్‌ పోర్టల్‌కు ఈ కోర్సులకు సంబంధించిన అంశాలను అనుసంధానించారు. మొత్తం 1,500 సాంకేతిక పరిజ్ఞాన కోర్సులను ఈ పోర్టల్‌ నుంచి అందిస్తారు.

ఉచితంగా మెటీరియల్‌ కూడా...
'మైక్రోసాఫ్ట్‌ లెర్న్‌ ఫర్‌ ఎడ్యుకేటర్స్‌' ప్లాట్‌ఫామ్‌ ద్వారా అధ్యాపకులకు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ అభ్యాసమార్గాలు, అవసరమైన మెటీరియల్‌ కూడా పొందుపరుస్తున్నారు. విద్యార్థులేగాక ఆసక్తి ఉన్న అధ్యాపకులు కూడా ఈ కోర్సులను అధ్యయనం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయడం ద్వారా ఈకోర్సులకు సంబంధించిన బోధన సామగ్రిని పొందే ఏర్పాట్లు చేశారు.

ఈ స‌మ‌యంలో పేద విద్యార్థులకు ఎంతో మేలు..:
కోవిడ్‌-19 నేపథ్యంలో విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలను అలవర్చుకునేందుకు, భవిష్యత్తులో వారు అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకు ఈ కోర్సులు ఉపకరించనున్నాయి. ముఖ్యంగా సంప్రదాయ కోర్సుల స్థానే నేటి ప్రపంచ అవసరాలకు తగిన ప్రమాణాలను విద్యార్థులు అలవరచుకోవలసి ఉందని ఏఐసీటీఈ అభిప్రాయపడింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కోర్సులు అందించడంలో మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యం ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది.

యాప్‌ల రూపకల్పన, సంపాదన కూడా.. :
18 ఏళ్లు దాటిన యువత ఈ కోర్సులను ఉచితంగా అభ్యసించడమే కాకుండా యాప్‌ల రూపకల్పన, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి పర్చుకోవడం ద్వారా మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన 'అజూర్‌' క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త ఆవిష్కరణలను చేయడం ద్వారా ఆదాయం పొందేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఏఐసీటీఈ పరిధిలోని విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ వెబినార్స్‌ ద్వారా నెక్ట్స్ జనరేషన్‌ టెక్నాలజీలను అందించనుంది. కంప్యూటర్‌ కోర్సులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందుకోలేని స్థితిలో ఉన్నవారికి ఈ-లెర్నింగ్‌ పోర్టల్‌ ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. సాంకేతిక పరిజ్ఞాన కోర్సుల్లో మైక్రోసాఫ్ట్‌ ఉచిత సర్టిఫికెట్‌ కోర్సులను వారికి అందించనుంది.
Published date : 20 Oct 2020 08:13PM

Photo Stories