Skip to main content

TSPSC Jobs: ఉద్యోగాల భర్తీ మరింత వేగవంతం.. 1:3 నిష్పత్తి ఫార్మూలా అమలు

Merit list creation process  District level job category selection process  TSPSC Jobs   Telangana State Public Service Commission l  Notification announcement
TSPSC Jobs

సాక్షి, హైదరాబాద్‌: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో కొలువులున్న జిల్లాస్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించనుంది. జిల్లాస్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్‌–4 ఉద్యోగాలు పెద్దసంఖ్యలో ఉన్నా యి. దాదాపు 9 వేల ఉద్యోగాలుండగా... వీటి భర్తీకి 1:3 నిష్పత్తి ఫార్మూలానే అమలు చేయనున్నారు.  

దీంతో పాటు జిల్లాస్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకూ ఇదే ఫార్ములా అమలు చేయనున్నట్టు  సమాచారం. ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్‌ భావిస్తోంది. ఇక జోనల్, మల్టీ జోనల్‌  స్థాయి ఉద్యోగాలను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఈ అంశాలపై మథనం చేస్తున్న కమిషన్‌ అతి త్వరలో నిర్ణయం తీసుకొని ఆ మేరకు అమలు చేయనున్నట్టు తెలిసింది. 

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం 
టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. పెండింగ్‌లో ఉన్న అర్హత పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు ‘కీ’లు, జవాబుపత్రాల ‘కీ’, మెజారిటీ పరీక్షలకుగాను జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌(జీఆర్‌ఎల్‌)లను కూడా కమిషన్‌ విడుదల చేసింది. జీఆర్‌ఎల్‌కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు సమాచారం. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్‌పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 

ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం జిల్లాస్థాయి, జోనల్‌స్థాయి, మల్టీ జోనల్‌ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా... ఇప్పటివరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామకాల బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ), తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)లు ప్రాథమిక జాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తిని నిర్ధారించుకుని ఉద్యోగాల భర్తీ పూర్తి చేశాయి. దాదాపు 33వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు. 

మిగిలిపోయిన కొలువులు..ఎంపికకు 1:3 నిష్పత్తి

నోటిఫికేషన్‌లో నిర్ధేశించిన పోస్టులు, భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపు 15శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఒక్కో అభ్యర్థికి రెండు, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం, సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు.   

 

Published date : 04 Apr 2024 01:02PM

Photo Stories