Election Code: మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి బ్రేక్
వనపర్తి: ఎన్నికల కోడ్‌తో మెడికల్ కాలేజీలో పలు పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త మెడికల్ కాలేజీల్లో మూడవ సంవత్సరం విద్యను ప్రవేశపెట్టేందుకు ఎన్‌ఎంసీ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) విజిట్ చేయనున్న నేపథ్యంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల నియామకానికి ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఈమేరకు ఆయా కళాశాలల్లోనే ఇంటర్వ్యూ పద్ధతిన పోస్టుల భర్తీకి వెసులుబాటు కల్పిస్తూ ఈనెల 13న ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. కనీసం రాష్ట్రస్థాయిలోనైనా ఇంటర్వ్యూలు నిర్వహించి, పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉన్నతాఽధికారులు ఉన్నా.. సాధ్యం కాలేదు. దీంతో మెడికల్ కళాశాలకు మంజూరైన 246 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.
ఇంటర్వ్యూలు రద్దు..
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వుల మేరకు ఈనెల 16న నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను రద్దుచేశారు. అదే రోజు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సైతం ఉన్నతాధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలతో పాటు పలు కేటగిరీల్లో అధ్యాపకుల నియామకం ఇంటర్వ్యూలను నిలిపివేశారు.
కేటగిరీలు ఇలా..
అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మికాలజీ, ఫిజియాలజీ, ఫాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడీయాట్రిక్‌లతో పాటు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, రేడియాలజీ, అనస్థీషియా విభాగాలకు అధ్యాపకులను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎన్నికల కోడ్‌తో భర్తీ చేయలేకపోయాం..
అధ్యాపకుల పోస్టులను ఇంటర్వ్యూ పద్ధతిన భర్తీ చేసేందుకు ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చినా.. ఎన్నికల కోడ్ కారణంగా భర్తీ చేయలేకపోయాం. ఎన్నికల తర్వాత ఉన్నతాధికారుల సూచన మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించి, మెడికల్ కళాశాలను మూడవ సంవత్సరానికి అప్‌గ్రేడ్ చేసేందుకు కావాల్సిన పోస్టులను భర్తీ చేస్తాం.
– సునందిని, ప్రిన్సిపాల్, మెడికల్ కాలేజీ
రెండు నెలల్లో ఎన్‌ఎంసీ విజిట్..
మెడికల్ కళాశాలలో మూడవ సంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు ఎన్‌ఎంసీ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) విజిట్ తప్పనిసరి. మరో రెండు నెలల్లో వనపర్తి మెడికల్ కళాశాలను ఎన్‌ఎంసీ విజిట్ చేయాల్సి ఉంది. ఈక్రమంలో రాాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముందస్తు ఆలోచనతో అధ్యాపకుల నియామకానికి చర్యలు చేపట్టింది. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆయా పోస్టుల్లో ఏడాది గడువు (2025 మార్చి 31) వరకు కొనసాగించాలని నిర్ణయించింది. అందులో స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఉండేలా పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టినా.. ఎన్నికల కోడ్‌తో నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది.