ITDA PO: ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
పాడేరు రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారుల పిల్లలకు సీడాప్ అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ సూచించారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పాడేరు, హుకుంపేట, జి. మాడుగుల మండలాలకు చెందిన అభ్యర్థులకు ఎంపిక కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పధకంలో వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కూలీల పిల్లలకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో కూడిన శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. శిక్షణ కాలంలో ఒక్కో అభ్యర్థికి రూ.272ల ఉపకార వేతనం కూడ అందిస్తారన్నారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి జమ చేస్తారని తెలిపారు. మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, ఎస్‌అర్టీసీ, వైస్ మెన్‌పవర్ సొల్యూషన్స్, డేటా ప్రో, కై ట్స్ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఏజెన్సీ 2400 మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పీవో పేర్కొన్నారు. పాడేరులో నిర్వహించిన ఎంపికలో మూడు మండలాల నుంచి 399 మంది హాజరు కాగా అందరిని ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. ఈనెల 7న పెదబయలు, ముంచంగిపుట్టు, 8న అనంతగిరిలో 9న అరకులోయ, డుంబ్రిగుడ, 13న చింతపల్లి, జీకే వీధి, 16న కొయ్యూరు మండలాల్లో నిర్వహించే ఎంపికల్లో అభ్యర్థులు ఏ మండలానికి చెందిన వారైన హాజరు కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి పధకం ఏపీడీ జవ్వాది గిరిబాబు, పాడేరు ఇన్‌చార్జి ఎంపీడీవో వెంకటరావు, జేడీఎం కళ్యాణి, ఉపాధి, వెలుగు సిబ్బంది, అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు.
చదవండి: Foreign jobs: ఉత్తరాంధ్రలో మరో భారీ మోసం.. విదేశీ ఉద్యోగాల పేరుతో.