Skip to main content

JEE Main 2024: జేఈఈ మెయిన్ పరీక్షలకు సర్వం సిద్ధం.. పరీక్ష రాసే వారు ఇవి మరిచిపోకండి..!

దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
National Testing Agency Organizes JEE Main   JEE Main 2024 Session 1 exam in January 24, 2024   NTA Completes Arrangements for JEE Main

ఈ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24 నుంచి ఫిబ్రవరి-1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహిస్తుండగా.. జనవరి 27, 29, 30, 31 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ సహా మొత్తం 10 భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండో దశ పరీక్షలు ఏప్రిల్‌‌లో నిర్వహించనున్నారు. 

ప‌రీక్ష కోసం సన్నద్ధమైన విద్యార్థులు తమ అడ్మిట్‌ కార్డుల‌ను https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవ‌చ్చు. బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 24వ తేదీ జరిగే పేపర్‌-2 పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. 

➤ జేఈఈ మెయిన్​ 2024 అడ్మిట్​ కార్డు డౌన్​లోడ్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు ఇవే..
► పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను తెలిపే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. 
► విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు త‌ప్ప‌నిస‌రిగా తమ అడ్మిట్‌ కార్డును తీసుకెళ్లాలి. అడ్మిట్‌ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

► పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుంగా మీ అడ్మిట్‌ కార్డులో ఇచ్చిన సూచనలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గుడ్డిగా అంచనా వేసి ఆన్సర్లు చేయకూడదు. తెలియని ప్రశ్నను పట్టుకుని, సమయం వృథా చేసుకోవద్దు. 
► పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగానే చేరుకొనేలా ప్లాన్‌ చేసుకోండి.
► అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయండి. పరీక్ష హాలు తెరవగానే మీకు కేటాయించిన సీట్లో కూర్చొని అన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోండి.
► ట్రాఫిక్‌ జామ్‌, రైలు/బస్సు ఆలస్యం వంటి కారణాల వల్ల పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోకపోతే.. అక్కడ ఇన్విజిలేటర్లు ఇచ్చే ముఖ్యమైన సూచనల్ని మీరు మిస్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ఆలస్యానికి ఎన్‌టీఏ బాధ్యత వహించదు. 

► ఏదైనా సాంకేతిక సాయం/ఎమర్జెన్సీ, పరీక్షకు సంబంధించి ఇబ్బంది ఎదురైతే సెంటర్‌ సూపరింటెండెంట్‌/ఇన్విజిలేటర్‌ను సంప్రదించవచ్చు.
► పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్‌ షీట్లపైనే కాలిక్యులేషన్సు/రైటింగ్‌ వర్కు చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత రఫ్‌ షీట్లను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
► పరీక్షలకు ముందు రోజు కొత్త టాపిక్స్‌ను కవర్‌ చేసేందుకు ప్రయత్నించొద్దు. దానివల్ల విద్యార్థుల ఒత్తిడి, ఆందోళన స్థాయి పెరుగుతుంది.
► పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సిన వాటిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి. 

► పరీక్ష కేంద్రం ఎక్కడో ముందుగానే సరిచూసుకొని.. లొకేషన్‌, అక్కడి పరిసరాల గురించి తెలుసుకోవడం మంచిది.
► హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులు, నగలు, మెటాలిక్‌ వస్తువులు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్‌ మెటీరియల్‌, వాటర్‌ బాటిళ్లు, మొబైల్‌ఫోన్‌/ఇయర్‌ ఫోన్‌/మైక్రోఫోన్‌/పేజర్‌, కాలిక్యులేటర్‌‌, డాక్యుపెన్‌, కెమెరా, టేప్‌ రికార్డర్ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.   
► పరీక్ష కేంద్రానికి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను తీసుకెళ్లడం మరిచిపోవద్దు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్‌ చేసిన ఫొటోను ఎగ్జామ్‌ సెంటర్‌కు తీసుకెళ్లి అటెండెన్స్‌ షీట్‌పై అతికించాలి. అలాగే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్‌పాయింట్‌ పెన్‌ను తీసుకెళ్లాలి.
► దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్‌ ఆఫీసర్‌ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాలి.

నెగెటివ్‌ మార్కులతో జాగ్రత్త..
జేఈఈ మెయిన్స్‌లో నెగెటివ్‌ మార్కులు ఉన్నందున ప‌రీక్ష రాసే ప్ర‌తి ఒక్క‌రూ జాగ్రత్తగా ఉండాలి. సమాధానం కచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి. తప్పుగా టిక్‌ పెడితే మైనస్‌–1 అవుతుంది. కాబట్టి తెలియని ప్రశ్నలకు ఊహించి రాసేకన్నా, వదిలేయడమే మంచిది. కన్ఫ్యూజ్‌ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృథా చేయకూడదు. 

పరీక్ష విధానం ఇలా..
➤ పేపర్‌-2(ఏ) బీఆర్క్‌ పరీక్ష..
ఇది నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష. పేపర్‌-2ఏగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ఎంసీక్యూల్లో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. అదే విభాగంలో న్యూమరికల్‌ ప్రశ్నలలో పది ప్రశ్నలకుగాను అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. డ్రాయింగ్‌ టెస్ట్‌లో మాత్రం రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్‌ వేయమంటారు. ఒక్కో టాపిక్‌కు 50 మార్కులు ఉంటాయి.

➤ పేపర్‌-2(బీ) బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది.  మ్యాథమెటిక్స్‌లోని న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా ఉంటాయి. మూడు పరీక్షలకు కేటాయించిన సమయం మూడు గంటలు. బీఆర్క్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ రెండు పేపర్లకు మూడున్నర గంటల సమయం ఉంటుంది. 

➤ IIT and NIT Seats Increase 2024 : ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పెరిగే అవ‌కాశం ఇలా..! అలాగే కటాఫ్ కూడా మార్పు..?

Published date : 24 Jan 2024 08:49AM

Photo Stories