Skip to main content

జేఈఈ మెయిన్ - 2015... తుది దశ ప్రిపరేషన్ గెడైన్స్

ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసాయి..ఎంపీసీ విద్యార్థులు జేఈఈ-మెయిన్‌కు సన్నద్ధమవుతున్నారు.. మరో పది రోజుల వ్యవధి మాత్రమే ఉంది..
మెయిన్‌లో ప్రతిభ చూపితేనే ఐఐఐటీలు, నిట్‌లు వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజనీరింగ్ చదివే అవకాశం లభిస్తుంది.. ఐఐటీ కల నెరవేర్చే అడ్వాన్స్‌డ్ మెట్టు ఎక్కేందుకు జేఈఈ-మెయిన్‌లో నిర్దేశించిన అర్హత సాధించాల్సిందే...! అందుబాటులో ఉన్న కొద్ది రోజుల సమయంలో ఏం చదవాలి? ఎలా రివిజన్ చేయాలి? పరీక్షలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి? తదితర అంశాలపై నిపుణులు అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం..

  • జేఈఈ-మెయిన్ పెన్-పేపర్ పరీక్ష ఏప్రిల్ 4,
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏప్రిల్ 10,11
  • ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు: నిట్‌లు, ఐఐఐటీలు
  • ఐఐటీ - అడ్వాన్స్‌డ్‌కు అర్హత
జేఈఈ-మెయిన్‌లో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. పేపర్-1 బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించింది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్-2

మ్యాథమెటిక్స్
పేపర్-పెన్ పరీక్షకు 10 రోజులు, కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 15 రోజుల సమయం మిగిలి ఉంది. ఈ సమయంలో 5 రోజులు (పేపర్-పెన్), 10 రోజులు (కంప్యూటర్ ఆధారిత) మ్యాథమెటిక్స్‌లో కీలకంగా భావించే అంశాలను సమగ్రంగా పునశ్చరణ చేసుకోవాలి.
Bavitha
  • మ్యాథమెటిక్స్‌లో అడిగే ప్రశ్నలు 80 శాతం ప్రాథమిక భావనలపై ఆధారపడి ఉంటాయి.
  • అందుబాటులో ఉన్న సమయంలో అన్ని చాప్టర్ల కంటే కీలకంగా భావించే చాప్టర్లను సమగ్రంగా, మిగిలిన చాప్టర్లను ప్రాథమిక స్థాయిలో ప్రిపేర్ అయితే సరిపోతుంది.
  • మ్యాథమెటిక్స్‌లో వేగానికి ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనన్నీ గ్రాండ్ టెస్ట్‌లను రాసి వేగాన్ని మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా వాటి ఫలితాల ఆధారంగా ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవాలి.
  • గత రెండేళ్ల ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి.
  • ప్రాక్టీస్‌లో అధిక వెయిటేజీ ఉండే చాప్టర్లపై ఎక్కువగా దృష్టి సారించాలి.
  • ప్లేన్స్, 3డి లైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ రీజనింగ్, సీక్వెన్సెస్, సెట్స్ అండ్ రిలేషన్స్, మీన్ వాల్యూ థీరమ్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికేషన్స్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిసెస్ డిటర్‌మెంట్, క్వాడ్రేటిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, సర్కిల్స్ చాప్టర్ల నుంచి కచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
  • ఈ సమయంలో ఎటువంటి కొత్త అంశాన్ని చదవకపోవడమే మంచిది. ప్రిపరేషన్ కోసం 5, 6 పుస్తకాలు కాకుండా ఏవైనా 2-3 ప్రామాణిక పుస్తకాలకే పరిమితం కావడం ప్రయోజనకరం.
  • జేఈఈ-మెయిన్ 2014 విశ్లేషణ: గతంతో పోల్చితే 2014 మ్యాథమెటిక్స్ పేపర్ సులభంగానే ఉంది. మొత్తం 30 ప్రశ్నల్లో.. సులభమైనవి-10, సుదీర్ఘ ప్రశ్నలు-7, కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు-8, క్లిష్టమైనవి-5. అంతేకాకుండా గత ప్రశ్నపత్రాల నుంచి 7 ప్రశ్నలు వచ్చాయి.
ఎం.ఎన్.రావు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, హైదరాబాద్.

ఫిజిక్స్
అందుబాటులో ఉన్న సమయంలో ప్రాథమిక భావనలు, ఫార్ములాలు, సూత్రాలను సమగ్రంగా పునశ్చరణ చేసుకోవడం మంచిది.
Bavitha
  • సాధ్యమైతే అన్ని ఫార్ములాలు, సూత్రాలను ఒకే పేపర్ రాసుకోవాలి. తద్వారా పునశ్చరణ సులభమవుతుంది.
  • ఈ సమయంలో ఎటువంటి కొత్త అంశాన్ని చదవకపోవడమే మంచిది.
  • రెండు, మూడు మోడల్ టెస్ట్‌లకు హాజరు కావడం మంచిది.
  • ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే జేఈఈ-మెయిన్‌లో మంచి స్కోర్ సాధించవచ్చు.
  • మెకానిక్స్, మాగ్నటిజం, ఎలక్ట్రిసిటీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.
  • థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్‌లలో కొన్ని అంశాలు ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఉమ్మడిగా ఉంటాయి. కాట్టి సిలబస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని గమనిస్తూ చదవడం ప్రయోజనకరంగా ఉండడంతోపాటు సమయం ఆదా అవుతుంది.
  • ఆప్టిక్స్‌లో జియోఆప్టిక్స్‌తో పోల్చితే వేవ్ ఆప్టిక్స్‌లో పరిధి తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా వేవ్ ఆప్టిక్స్‌ను చదవడం ప్రయోజనకరం.
  • ట్రాన్స్‌వర్ వేవ్స్, సౌండ్ వేవ్స్‌కు సమ ప్రాధాన్యత ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫిజికల్ ఆప్టిక్స్, ఎల్‌సీ ఆసిలేషన్స్, ఏసీ సర్క్యూట్స్‌లో ఉండే మ్యాథమెటికల్ పార్ట్ వేవ్స్‌లో కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
  • గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మ్యాగ్నటిజంలో కొన్ని అంశాలు ఉమ్మడిగా ఉంటాయి.
  • పరీక్షలో ప్రతి ప్రశ్నకు ఇచ్చిన సూచనలను సమగ్రంగా చదవడం మంచిది.
  • ఏదైనా ప్రశ్నకు ఎక్కువ స్టెప్‌లు వచ్చే అవకాశం ఉంటే దాన్ని చివర్లో ప్రయత్నించడం ఉత్తమం.
  • పరీక్ష రోజు సబ్జెక్ట్‌కు సంబంధించి స్నేహితులు, క్లాస్‌మెట్స్ ఎవరితో చర్చించకపోవడం మంచిది.
  • జేఈఈ-మెయిన్ 2014 విశ్లేషణ: ఫిజిక్స్ క్లిష్టంగానే ఉంది. ఎందుకంటే..కొన్ని ప్రశ్నలు సమస్యాధారితంగా (ప్రాబ్లమ్ బేస్డ్) ఉన్నాయి. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 16 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 14 ప్రశ్నలు ఇచ్చారు.
డాక్టర్ సి. రామకృష్ణ, ఆర్ కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్.

కెమిస్ట్రీ
కెమిస్ట్రీలో 75 శాతం ప్రశ్నలు సగటు విద్యార్థి చేయదగినవి విధంగా ఉంటాయి. కాబట్టి కొంచెం తార్కిత ఉపయోగిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు.
Bavitha
  • కెమిస్ట్రీ నుంచి అడిగే 30 ప్రశ్నల్లో దాదాపు 25 ప్రశ్నలు ఇంటర్మీడియెట్ అకాడమీ పుస్తకాల్లోంచి వస్తాయి. ఇవి కూడా ప్రాథమిక భావనలాధారంగా ఉంటాయి. కాబట్టి ప్రాథమిక భావనలను సమగ్రంగా ప్రిపేర్ కావాలి.
  • మిగిలిన 5 ప్రశ్నలు విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా మిక్స్‌డ్ కాన్సెప్ట్‌గా ఉంటాయి. అంటే రెండు మూడు పాఠ్యాంశాలను మిళితం చేస్తూ అనువర్తిత (అప్లికేషన్) తరహా ప్రశ్నలు ఇస్తారు.
  • ప్రతి పాఠ్యాంశంలోని భావనలు, సూత్రాలు,ఫార్ములాల ను ఒక దగ్గర రాసుకొని మననం చేసుకోవడం మంచిది.
  • పరీక్షలో సమయపాలన ముఖ్యం. కాబట్టి ఇందుకోసం గ్రాండ్ టెస్ట్‌లను రాయడం ప్రయోజనకరం.
  • అకర్బన రసాయన శాస్త్రంలోని అంశాలను పట్టిక రూపంలో రూపొందించుకొవాలి. వాటిలోని ధర్మాలలో పొలికలు, భేదాలను గుర్తించాలి. ఉదాహరణకు హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, ఆక్సో యాసిడ్స్‌లలో నిర్మాణాలు, ధర్మాలు, స్థిరత్వం, చర్యాశీలత వంటివి పీరియడ్, గ్రూపులలో ఏవిధంగా మారుతున్నాయో గమనించాలి.
  • లోహశాస్త్రం, సమన్వయ సమ్మేళనాలు, డి-ఎఫ్ బ్లాక్ మూలకాలు, అనలిటికల్ కెమిస్ట్రీలకు విధిగా చదవాలి.
  • భౌతిక రసాయన శాస్త్రంలో ప్రతి పాఠ్యాంశంలోని భావనలు, ఫార్ములాలు వాటికి సంబంధించిన ప్రశ్నలు, అనువర్తనాలు, పరీక్షలో అడిగే సరళిని గమనిస్తూ ప్రిపరేషన్ సాగించాలి.
  • ద్రావణాలలో గాఢత ప్రమాణాలు, ఆదర్శ-ఆదర్శేతర ద్రావణాలు, కణాధార ధర్మాలు, అసాధారణ మోలార్ ద్రవ్యరాశులు, ఘనస్థితిలో వ ర్గీకరణ, యూనిట్ సెట్, విద్యుత్ రసాయన శాస్త్రంలో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనువర్తనాలు, నెర్నెస్ట్ సమీకరణం, విద్యుత్ విశ్లేషణ వంటి అంశాలను సమగ్రంగా చదవాలి.
  • రసాయన సమతాస్థితి, ఆయాని సమతాస్థితిలోని ఉమ్మడి అయాన్ ప్రభావం, బఫర్ ద్రావణాలు, ద్రావణీయత లబ్ధం వంటి అంశాలను ఎక్కువ సాధన చేయాలి.
  • భౌతిక రసాయన శాస్త్రం నుంచి అడిగే ప్రశ్నలు లోతుగా అడుగుతారు.
  • చక్కని స్కోర్‌కు కర్బన రసాయనశాస్త్రం కీలకం. కాబట్టి ఐసోమార్సిజం, మెకానిజం, నేమ్డ్ రియాక్షన్స్, ఎలక్ట్రాన్ డిస్‌ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి.
  • బయోమాలిక్యుల్స్, పాలిమర్స్‌లోని ప్రాథమిక భావనలను గుర్తు పెట్టుకోవాలి.
  • కర్బన రసాయన సమ్మేళనాల తయారీ, ధర్మాలను ఫ్లోచార్ట్ రూపంలో రూపొందించుకోవాలి. సీక్వెన్స్ టైప్ ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • పరమాణు నిర్మాణం, రసాయన బంధం, వాయు స్థితి, మోల్ భావన, రెడాక్స్ రియాక్షన్స్ ప్రశ్నలు సులభంగా ఉంటాయి. రసాయన బంధంలోని సంకరీకరణం, ద్విధ్రువ భ్రామకం, ఎంఓటీ అంశాలపై అడిగే ప్రశ్నలు సులువుగానే ఉంటాయి.
  • జేఈఈ-మెయిన్ 2014 విశ్లేషణ: కెమిస్ట్రీలో ఇచ్చిన 30 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. మిగిలిన ప్రశ్నల్లో 8 మధ్యస్తంగా ఉంటే.. 4 మాత్రం క్లిష్టమైనవి. ఫిజికల్ కెమిస్ట్రీ: 40 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ: 30 శాతం, ఇనార్గానిక్ కెమిస్ట్రీ: 30 శాతం ప్రశ్నలు వచ్చాయి.
టి.కృష్ణ, ఆర్ కే క్లాసెస్, హైదరాబాద్.

ప్రిపరేషన్ టిప్స్
  • జేఈఈ మెయిన్‌కు 60 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన మొదటి 1,50,000 మంది విద్యార్థులు ఐఐటీలు, ఐఎస్‌ఎం-ధన్‌బాద్‌లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అర్హులు.
  • దాదాపు 50-60 శాతం ప్రశ్నలు సగటు విద్యార్థి చేయదగిన విధంగా ఉంటాయి. కాబట్టి కొంచెం తార్కిత ఉపయోగిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు.
  • ఏటా జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నల సంఖ్య, వాటికి కేటాయించే మార్కుల సంఖ్య మారుతుంటుంది. అందువల్ల సమాధానాలను గుర్తించే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా సూచనలను జాగ్రత్తగా చదవాలి.
  • పరీక్ష రాసేటప్పుడు కచ్చితత్వం, సమయానికి ప్రాధా న్యం ఇవ్వాలి. అవసరమైన చోట షార్ట్‌కట్ మెథడ్స్ ఉపయోగించాలి. నెగిటివ్ మార్కులున్నాయి కాబట్టి ఎన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించామనే దానికంటే ఎంత కచ్చితంగా సమాధానాలు గుర్తించామన్నదే ముఖ్యం.
  • పరీక్షలో 50శాతం ప్రశ్నలకు కచ్చితత్వంతో సరైన సమాధానం గుర్తిస్తే మంచి కాలేజీలో సీటును ఆశించవచ్చు.
  • పరీక్ష గదిలో మొదటి ఐదారు నిమిషాల్లో ప్రశ్నపత్రం మొత్తం ఆసాంతం చదవాలి. తొలుత సులువైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం పూర్తిచేయాలి. తర్వాత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
  • ఇప్పటికే చాలా నమూనా పరీక్షలు రాసి ఉంటారు. ఇప్పుడు మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక భావనలు, సూత్రాలను బాగా ఒంటబట్టించుకోవాలి. ఇప్పుడు కొత్త అంశాలను చదవాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. రెండు, మూడు గ్రాండ్ టెస్ట్‌లు రాసి, తప్పులను సరిదిద్దుకోవాలి.


జేఈఈ-2014 కటాఫ్స్

కేటగిరీ

మార్కులు 360

కామన్ మెరిట్ లిస్ట్

115

ఓబీసీ (నాన్ క్రిమీలేయర్)

74

ఎస్సీ

53

ఎస్టీ

47


ఆప్టిట్యూడ్ పేపర్-2
ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సులకు నిర్వహించే పేపర్-2 లో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్ (ఆబ్జెక్టివ్ విధానం), రెండో విభాగంలో ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ విధానం) ఉంటాయి. మూడో విభాగం డ్రాయింగ్ టెస్ట్. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఎనలిటికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ, ఊహశక్తి, సృజనాత్మకత, ఆర్కిటెక్చర్ వంటి అంశాలను పరీక్షించే విధంగా ఉంటాయి. డ్రాయింగ్ టెస్ట్‌లో సందర్భాలను బొమ్మల రూపంలో చిత్రించాల్సి ఉంటుంది. పేపర్-2కు హాజరయ్యే విద్యార్థులు ఆప్టిట్యూడ్, డ్రాయింగ్ అంశాలను అదనంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది.
Published date : 26 Mar 2015 12:14PM

Photo Stories