Skip to main content

JEE Advanced Results 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు
 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తా చాటిన   ఏపీ విద్యార్థులు
JEE Advanced Results 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో టాప్‌–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. 

నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్‌ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్‌ కుమార్‌ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్‌ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్‌ సుహాస్‌ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. 

ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్‌ జోన్‌)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్‌కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు రెండు, ఐఐటీ బాంబే జోన్‌కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్‌ జోన్‌కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. 

ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్‌ కుమార్‌ పటేల్‌ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్‌గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్‌ జోన్‌కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. 

పెరిగిన ఉత్తీర్ణత 
దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్‌సీస్‌ ఇండియన్స్‌ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.

Also Read: JEE Advanced Results: పెరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌.. జనరల్‌ కేటగిరి ఎన్ని మార్కులంటే..

నేటి నుంచి జోసా కౌన్సెలింగ్‌ 
ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది.

 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్‌ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.

నా లక్ష్యం ఐఏఎస్‌
మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభు­త్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్‌లో 987 మార్కు­లు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.99 పర్సెంటెల్‌తో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 252వ ర్యాంకు వచ్చింది. 

జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్‌ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్‌ ఇండియాలో మొదటి ర్యాంక్‌ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివి, సివిల్స్‌ పరీక్ష రాసి ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు 

ముందస్తు ప్రణాళికతో చదివా                  
మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్‌.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్‌ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకు

పెరిగిన కటాఫ్‌ మార్కులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్‌ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్‌ ర్యాంకు కటాఫ్‌ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్‌ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్‌ మార్కులు పెరిగాయి. 

సత్తా చాటిన లారీ డ్రైవర్‌ కుమారుడు
నరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్‌ కుమారుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టాడు. 

పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్‌ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు.   

Published date : 10 Jun 2024 01:48PM

Photo Stories