Skip to main content

సివిల్స్‌...ఇంటర్వ్యూలో విజయానికి సూచనలు

దేశంలో అత్యున్నత కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు వీలుకల్పించే మార్గం..
సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌! యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. ఏటా సివిల్స్‌ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహించి, తుది జాబితాను సిద్ధం చేస్తోంది. 2017 మెయిన్స్‌ ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. మెయిన్స్‌ లో ప్రతిభచూపిన వారికి ఇంటర్వ్యూలు మార్చిలో ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్‌గా పేర్కొనే ఈ ఇంటర్వ్యూలో విజయానికి సూచనలు..

ఇటీవల ముగిసిన సివిల్స్‌ మెయిన్స్‌ 2017 పరీక్షలకు 13,366 మంది హాజరయ్యారు. వీరిలో దాదాపు 2 వేల మందికి ఇంటర్వ్యూకు అర్హత లభించే అవకాశముంది. ఈ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే మెయిన్స్‌ ఫలితా లు వచ్చే వరకు నిరీక్షించకుండా ఇంటర్వ్యూ కాల్‌ వస్తుందనే నమ్మకమున్న వారు ఇప్పటి నుంచే సన్నద్ధమవాలి.

పర్సనల్‌ టు ప్రొఫెషనల్‌...
గత నాలుగైదేళ్ల ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే.. మెయిన్స్‌లో 45–55 శాతం మధ్యలో మార్కులు సాధించి నవారు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. దీని ఆధారంగా ఇంటర్వ్యూ కాల్‌ వచ్చే అవకాశముందని భావిస్తున్న అభ్య ర్థులు.. వ్యక్తిగత నేపథ్యం నుంచి ప్రొఫెషనల్‌ ప్రొఫైల్‌ వరకు అన్ని విషయాలపైనా దృష్టిసారించాలి. పని అను భవం ఉన్న వారైతే విధి నిర్వహణలో ఇప్పటివరకు తాము సాధించిన పురోగతి, తద్వారా సంస్థకు కలిగిన ప్రయోజ నం తదితర అంశాలను వివరించగలగాలి. మెయిన్స్‌ సమ యంలో పూర్తిచేసిన డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ (డీఏఎఫ్‌)లో పొందుపర్చిన.. హాబీలు, సర్వీసు ప్రాధాన్యత, వ్యక్తిగత నేపథ్యం, పుట్టిన ప్రదేశం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.

సోషల్‌ సర్వీస్‌ లక్ష్యంగా...
సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు కచ్చితంగా ఎదురయ్యే ప్రశ్న.. సివిల్‌ సర్వీసెస్‌లో చేరాలనుకో వడానికి కారణమేంటి? అని! దీనికి అభ్యర్థులు టక్కున చెప్పే సమాధానం.. సామాజిక సేవ!! అయితే అభ్యర్థి దీన్ని సమర్థించుకునేలా ఇంటర్వ్యూకు సిద్ధమవాలి. ముఖ్యంగా బీటెక్, ఎంబీఏ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు.. ‘సామాజిక సేవ కోసమే’ అని సమాధానం చెప్పే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం తాము పనిచేస్తున్న సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే అంశాలను చెప్పగలగాలి. ఉదాహరణకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు.. నేటి డిజిటైజేషన్‌ యుగంలో సాఫ్ట్‌వేర్‌ సేవల ద్వారా సమాజానికి కలుగుతున్న ప్రయోజనాలను వివరించగలగాలి.

హాబీలపై ప్రత్యేకంగా...
సివిల్స్‌ ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే అభ్యర్థులు.. తా ము డీఏఎఫ్‌లో పేర్కొన్న హాబీల గురించి ఇప్పటి నుంచే ప్రత్యేకంగా కసరత్తు చేయాలి. చాలామంది బుక్‌ రీడింగ్, వాచింగ్‌ టీవీ, సింగింగ్, ప్లేయింగ్‌ వంటి వాటిని హాబీలుగా పేర్కొంటారు. ఇంటర్వ్యూ సమయంలో వీటిపైనా ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని గమనిం చాలి. బుక్‌ రీడింగ్‌ హాబీకి సంబంధించి.. నిర్దిష్టంగా ఒక రచయిత పేరును పేర్కొన్న అభ్యర్థులు మరింత శ్రద్ధగా వ్యవహరించాలి. సదరు రచయిత ప్రచురణల్లో ముఖ్యమై నవి, వాటిలోని ముఖ్యాంశాలను తెలుసుకోవాలి. సదరు రచయిత రాసిన ఫలానా పుస్తకం చదివారా? అందులో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి? లేదా అందులో వివాదాస్పద అంశం ఏమిటి? వంటి ప్రశ్నలు వస్తాయి. గతంలో సింగింగ్‌ హాబీగా పేర్కొన్న అభ్యర్థిని.. ఏదైనా ఒక పాట పాడమని అడిగారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని గుర్తించి, ఆ మేరకు సిద్ధంగా ఉండాలి.

సమస్యలపై అవగాహన..
పర్సనల్‌ ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే అభ్యర్థులు.. తమ ప్రాంతం ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం, స్థానిక సమ స్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రస్తుతం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను సైతం రాబట్టేలా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి స్థానిక పరిస్థితులు, సమస్యలపై అవగాహనతోపాటు, పరిష్కార మార్గాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. ఇటీవల కాలంలో అభ్యర్థుల వ్యక్తిగత బలాలు, బలహీనతలకు సంబంధించి కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని, సిద్ధంగా ఉండాలి. బలహీనతల గురించి చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ‘అగ్రెసివ్‌నెస్‌’, ‘సహనం తక్కువ’ వంటి బలహీనతలు ఉన్నట్లు చెప్పకూడదు.

కరెంట్‌ అఫైర్స్‌:
ఇంటర్వ్యూ సమయంలో వర్తమాన అంశాలపైనా ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాలు, జాతీయ, రాష్ట్రీయ పరిణామాలు, ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న సమస్యలు, వాటిపై అభిప్రాయాలు, పరిష్కార మార్గాలపై బోర్డు సభ్యుల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి అభ్యర్థులు కేవలం పర్సనల్, ప్రొఫెషనల్‌ అంశాలే కాకుండా.. కరెంట్‌ అఫైర్స్‌పైనా పట్టు సాధించాలి. ప్రతిరోజూ కనీసం రెండు దినపత్రికలను నిర్మాణాత్మక దృక్పథంతో చదవాలి. ఇంటర్వ్యూ రోజు కూడా కచ్చితంగా దినపత్రిక చదవాలి. ‘ఈ రోజు ఏ పేపర్‌ చదివారు. అందులో మీరు ప్రధానాంశంగా భావించిన వార్త ఏంటి?’ వంటి ప్రశ్నలు సైతం అడిగిన సందర్భాలు ఉన్నాయి.

సమయస్ఫూర్తితో...
తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పగలిగే సామర్థ్యం అలవరచుకోవాలి. తమ వాదనలను బలపరిచే అంశాలను ఉదహరించేలా వ్యవహరించాలి. ఇంటర్వ్యూ అంటే కేవలం ప్రశ్న, సమాధానం అనే అభిప్రాయానికి స్వస్తిపలకాలి. 25–30 నిమిషాల పాటు జరిగే ఇంటర్వ్యూలో.. చిన్నపాటి చర్చ తరహాలో ప్రశ్నలు–సమాధానాలు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని సిద్ధమవాలి. ఇటీవల కాలంలో ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు.. అభ్యర్థుల నుంచి ఆశిస్తున్న మరో లక్షణం.. సమయస్ఫూర్తి, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌. ‘మీరు ఒక ఐఏఎస్‌ అధికారిగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఒక సమస్య ఎదురైంది? దీనికి తక్షణ పరిష్కారంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?’ వంటివి. ఇలాంటి వాటికి సమాధానం చెప్పేటప్పుడు.. ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూ .. వాటికి అనుగుణంగా పరిష్కార చర్యలు చేపడతామని వివరించాలి.

బాడీ లాంగ్వేజ్‌ :
ఇంటర్వ్యూ ఔత్సాహిక అభ్యర్థులు బాడీ లాంగ్వేజ్‌ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్వ్యూ ఆసాంతం హుందాగా వ్యవహరించాలి. పురుష అభ్యర్థులు లైట్‌ కలర్‌ షర్ట్స్‌ ధరించడం మంచిది. మహిళా అభ్యర్థులు శారీ, లేదా సల్వార్‌ కమీజ్‌ ధరించి ఇంటర్వ్యూకు హాజరవడం మంచిది.

మెరిట్‌ జాబితాలో...
ఇంటర్వ్యూలో పొందిన మార్కులు మెరిట్‌ లిస్ట్‌లో అభ్యర్థుల ర్యాంకులను నిర్దేశిస్తున్నాయి. సివిల్స్‌–2016 ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన అభ్యర్థి.. మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థి కంటే మెయిన్స్‌ రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించారు. కానీ ఇంటర్వ్యూలో మూడో ర్యాంకు పొందిన వ్యక్తికి తక్కువ మార్కులు, మొదటి ర్యాంకు పొందిన వ్యక్తికి ఎక్కువ మార్కులు వచ్చాయి. దీంతో రాత పరీక్షలో అధిక మార్కులు వచ్చినా.. మూడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు కనిపించాయి.

సివిల్స్‌ ఇంటర్వ్యూ.. అయిదేళ్ల కటాఫ్‌ మార్కులు

సంవత్సరం

జనరల్‌

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

2012 211 208 209 197
2013 236 229 210 205
2014 211 213 199 192
2015 201 204 188 184
2016 201 206 198 190

విజయం సాధించాలంటే...
  • సానుకూల దృక్పథం.
  • ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్‌.
  • భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం.
  • సమకాలీన అంశాలపై అవగాహన.
  • సమయస్ఫూర్తి.
  • సమస్య పరిష్కార నైపుణ్యం.
  • సహనం, ఓర్పు.
  • పేపర్‌ రీడింగ్‌.
  • అభిప్రాయాల్లో స్పష్టత.

నిజాయితీ ప్రధానం :
ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు నిజాయితీతో సమాధానాలివ్వడం ప్రధానం. ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పాలి. అంతేగానీ ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించకూడదు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ భావోద్వేగాలను నియంత్రించుకునే విధంగా వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల సహనాన్ని పరీక్షిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉద్రేకానికి లోనుకాకుండా బోర్డు సభ్యులను మెప్పించగలిగేలా వ్యవహరించాలి.
– పి.అన్వేష రెడ్డి, సివిల్స్‌–2016 విజేత.

పేపర్‌ రీడింగ్‌ ప్రధానం...
ఇటీవల కాలంలో సివిల్స్‌ ఇంటర్వ్యూల శైలిని పరిశీలిస్తే వ్యక్తిగత నేపథ్యం, సమకాలీన పరిణామాలపై ప్రశ్నలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఔత్సాహిక అభ్యర్థులు కచ్చితంగా రోజూ పేపర్‌ చదువుతూ ముఖ్యాంశా లను విశ్లేషించాలి. ప్రధాన సమస్యలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
– శ్రీరంగం శ్రీరామ్, డైరెక్టర్, శ్రీరామ్స్‌ ఐఏఎస్‌.

Published date : 19 Dec 2017 02:31PM

Photo Stories