Skip to main content

హార్డ్‌వర్క్ ప్రధానం.. ఎస్.మాధవి

‘సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించాలంటే.. హార్డ్‌వర్క్‌నే నమ్ముకోవాలి. నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించే ఆత్మ స్థయిర్యం అత్యంత అవసరం. అప్పుడే విజయావకాశాలు మెరుగవుతాయి’ అంటున్నారు.. సివిల్ సర్వీసెస్-2016 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 104వ ర్యాంకు సాధించిన సోడిశెట్టి మాధవి. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే సొంత ప్రిపరేషన్‌తో 104వ ర్యాంకు సాధించానంటున్నారు మాధవి.
మా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. నాన్న అరుణ్ కుమార్ వ్యాపారం చేస్తుంటారు. అమ్మ రాజేశ్వరి గృహిణి. ఇంటర్మీడియెట్ వరకు పాలకొల్లులోనే విద్యాభ్యాసం. తర్వాత హైదరాబాద్‌లో చదువుకున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను. అదే సబ్జెక్ట్ ఆప్షనల్‌గా సివిల్స్‌కు ప్రిపరేషన్ సాగించాను.  నన్ను, అక్కను ఉన్నత చదువులు చదివించాలని అమ్మానాన్న తపించేవారు. అందుకు తగ్గట్లుగానే మేమిద్దరం చదువుల్లో బాగా రాణించాం.
 
 2014 నుంచి సివిల్స్ ప్రిపరేషన్ :
 సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ఎంచుకున్నాక... 2014 నుంచి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. 2015లో తొలిసారి పరీక్ష రాశాను. కానీ విజయం లభించలేదు. అయినా నిరాశ చెందకుండా ఆత్మస్థయిర్యంతో ముందుకు సాగాను.
 
 రెండో ప్రయత్నంలో 104వ ర్యాంకు :
 తొలి ప్రయత్నంలో వైఫల్యానికి కారణాలను విశ్లేషించుకుని, అవి మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతూ రెండో ప్రయత్నం సాగించాను. ముఖ్యంగా రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిచ్చాను. ఇదే గత ఓటమికి కారణంగా భావించాను. రైటింగ్ పరంగా పరీక్ష సమయంలో ఇబ్బంది ఎదురైందని భావించాను. దాన్ని అధిగమించేందుకు 2016 సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు రీడింగ్‌తోపాటు రైటింగ్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చాను.
 
 ఎకనామిక్స్.. ఆప్షనల్ :
 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రెండు అటెంప్ట్‌లకు ఎకనామిక్స్ సబ్జెక్ట్‌నే ఎంపిక చేసుకున్నాను. ఎంఏలో ఎకనామిక్స్ చదవడం వల్ల సివిల్స్‌లో ఈ సబ్జెక్ట్ సిలబస్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ప్రిపరేషన్ కోసం ఎంఏ ఎకనామిక్స్ పుస్తకాలతోపాటు.. అడ్వాన్స్‌డ్ మైక్రో ఎకనామిక్స్ థియరీ, ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్ వంటి స్టాండర్డ్ పుస్తకాలు, ఇండియా ఎకనామిక్ సర్వేలు చదివా. అదే విధంగా ఇగ్నో ఎకనామిక్స్ మెటీరియల్ కూడా ఎంతో ఉపయోగపడింది.
 
 శిక్షణ తీసుకోకున్నా..
 సివిల్ సర్వీసెస్ పరీక్ష అంటే శిక్షణ తప్పదు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో శిక్షణ లేకపోయినా విజయం సాధించొచ్చు. అయితే శిక్షణతో కలిగే ప్రయోజనం.. గెడైన్స్.. మనం ఎక్కడ ఉన్నాం? ఎలా ముందుకు వెళ్లాలి? ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అనే అంశాలపై నిపుణుల సలహాలు లభిస్తాయి. ఫలితంగా విజయావకాశాలు మెరుగవుతాయి. అంతేతప్ప శిక్షణ తీసుకోకపోతే అసలు విజయమే లభించదు అనే భావన సరికాదు. రాత పరీక్ష పరంగా శిక్షణ తీసుకోకపోయినా.. ఇంటర్వ్యూ కోసం మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యాను.
 
 ఇంటర్వ్యూ ఆహ్లాదకరంగా...
 ఇంటర్వ్యూ ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. వినయ్ మిట్టల్ నేతృత్వంలోని బోర్డ్‌లో ఇంటర్వ్యూ జరిగింది. అధిక శాతం ప్రశ్నలు నా అకడమిక్ ప్రొఫైల్‌ను అనుసంధానం చేస్తూ కరవు పరిస్థితులపై అడగడం జరిగింది. అన్నిటికీ సరైన సమాధానం ఇచ్చాక మంచి ఫలితం వస్తుందని ఆశించాను.
 
 అదే స్ఫూర్తిగా :
 నేను ఐఏఎస్‌నే లక్ష్యంగా చేసుకోవడానికి స్ఫూర్తి.. పూనం మాలకొండయ్య. నేను మా  ఊర్లో చదువుకునే సమయంలో ఆమె మా జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ పలు కీలక పథకాల అమలు విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించి అవి అసలైన లబ్ధిదారులకు అందేలా చేశారు. దాని ద్వారా ఎందరో ఆనందంగా ఉండటం చూసి.. ఐఏఎస్ అయితే ఇలాంటి అధికారాలుంటాయి కదా.. అనే అభిప్రాయం కలిగింది. అప్పటి నుంచే ఐఏఎస్ లక్ష్యంగా ఏర్పరచుకున్నాను.
 
 ఈసారి ఐఏఎస్ సాధిస్తా :
 ప్రస్తుత ర్యాంకుకు ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యే అవకాశముంది.. కానీ నా లక్ష్యం ఐఏఎస్. ఐఆర్‌ఎస్, ఇతర సర్వీసుల ద్వారా కేవలం ఒక విభాగానికి సంబంధించే సేవలందించే అవకాశం ఉంటుంది. ఐఏఎస్‌తో అన్ని విభాగాల్లో సేవలందించే అవకాశం తద్వారా సామాజిక అభివృద్ధికి కృషి చేసేందుకు ఆస్కారం లభిస్తుంది. ఐఏఎస్‌నే లక్ష్యంగా చేసుకోవడంతో సివిల్స్-2017కు కూడా దరఖాస్తు చేశాను. త్వరలో జరగనున్న ప్రిలిమనరీకి ప్రిపరేషన్ సాగిస్తున్నాను. ఈసారి కచ్చితంగా అన్ని దశలు దాటి ఐఏఎస్ సాధిస్తాననే నమ్మకం కలిగింది.  భవిష్యత్తులో ఐఏఎస్‌కు ఎంపికైతే మహిళా సాధికారతకు కృషి చేస్తాను.
 
 సివిల్ సర్వీసెస్  పరీక్షలో విజయానికి మనం ఆలోచించే విధానం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముందుగానే పరీక్ష అంటే భయంతో, ఆందోళనతో ఉంటే అది మనతోపాటు కొనసాగుతుంది. అది పరీక్షలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఔత్సాహికులు ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి.
Published date : 02 Jun 2017 05:25PM

Photo Stories