Skip to main content

అమ్మ కలల్ని నిజం చేశా.. మను చౌదరి

చిన్నప్పటి నుంచి ఆ విద్యార్థి తల్లి అతణ్ని కలెక్టర్ చేయాలనుకుంది. నువ్వు పెద్దయ్యాక కలెక్టర్ కావాలి అని చెబుతూ ఉండేది. అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలనుకున్న ఆ పిల్లాడు తల్లి మాటలను సీరియస్‌గా తీసుకున్నాడు. చిన్నప్పుడు స్కూల్లో ‘నీ లక్ష్యం ఏంటీ’ అని టీచర్లు అడిగితే తడుముకోకుండా కలెక్టర్‌నవుతా అనే చెప్పేవాడు. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి అమ్మ ఆశయమే తనకు సరైన లక్ష్యమని తెలుసుకున్నాడు. సివిల్సే లక్ష్యంగా తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 36వ ర్యాంకు సాధించాడు మిక్కిలినేని మను చౌదరి.
మాది ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు. నాన్న రాజబాబు ఓరియెంట్ సిమెంట్‌లో సీనియర్ కెమిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మ భారతి గృహిణి. తమ్ముడు ఎంబీఏ చదువుతున్నాడు. 2015లో పీజీడీఎం పూర్తిచేసిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. తొలి ప్రయత్నంలోనే విజయం దక్కడం నాకు, నా కుటుంబానికి అమితానందాన్ని కలిగించింది. నాన్నకు ఉద్యోగరీత్యా బదిలీలు అవుతుంటాయి. అందులో భాగంగా నా విద్యాభ్యాసం పలు ప్రాంతాల్లో సాగింది. నాలుగో తరగతి వరకు ఆదిలాబాద్‌లోని దేవాపూర్‌లో చదివా. అక్కడి నుంచి నాన్నకు మహారాష్ట్ర జల్గావ్‌కు బదిలీ అయింది. ఇక అయిదో తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివాను. జల్గావ్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాను. తర్వాత ఢిల్లీలో పీజీడీఎం చేశాను.
 
ఇంజనీరింగ్ నుంచే..
చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాతే సమాజంపై అవగాహన ఏర్పడింది. ఇంజనీరింగ్‌లో భిన్న వర్గాల వారితో కలిసి చదువుకోవడం కారణంగా సామాజిక స్పృహ అలవడింది. మూడో ఏడాదిలో ఉన్నప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానం, చదవాల్సిన పుస్తకాలు మొదలైన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో శోధించడం ప్రారంభించా. ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ కోసం ఢిల్లీ వెళ్లాను. ఎప్పటికప్పుడు సీనియర్లతో, ర్యాంకు సాధించిన వారితో మాట్లాడుతూ సన్నద్ధమవ్వాల్సిన తీరుతెన్నులను తెలుసుకున్నాను. ఎంబీఏ తర్వాత పూర్తిసమయాన్ని సివిల్స్ ప్రిపరేషన్‌కు కేటాయించా. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవలసిన అవసరం లేదు. కోచింగ్‌లో ఏ పుస్తకాలు చదవాలి? ఎలా చదవాలి? తదితర గెడైన్స్ మాత్రమే ఇస్తారు. చదవాల్సిన బాధ్యత పూర్తిగా విద్యార్థిపైనే ఉంటుంది. 
 
ఆప్షనల్ .. సైకాలజీ  :
సాధారణంగా అభ్యర్థులు సైన్స్ లేదా సోషల్ సెన్సైస్ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకుంటారు. అయితే సైకాలజీ ఈ రెండు అంశాల కలబోతగా ఉంటుంది. నేను ఎంబీఏలో చదివిన హుమ్యాన్ బిహేవియర్ ఇన్ ఆర్గనైజేషన్, కన్జ్యూమర్ బిహేవియర్ పుస్తకాలు సైకాలజీ సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోవడానికి ముఖ్య కారణం. ఈ పుస్తకాల్లో సైకాలజీకి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయి. దీంతో సైకాలజీపై కాస్త ఆసక్తి పెరిగింది. పైగా సివిల్స్ పరీక్షలో సైకాలజీలో గతంలో మంచి మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించి సైకాలజీ సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకున్నాను.
 
బ్యాలెన్స్‌డ్‌గా సమాధానాలు
ఎంబీఏ తర్వాత 2015 ఏప్రిల్‌లో ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో చేరా. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు ఒకేసారి ప్రిపరేషన్ ప్రారంభించా. మెయిన్స్ కోసం రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేశా. సీనియర్లు, గత విజేతలు రాసిన నోట్స్ ఫాలో అయ్యా. 2015 మెయిన్స్ టాపర్లు రాసిన పేపర్లు నెట్‌లో అందుబాటులో ఉంటాయి. వారు రాసిన విధానంలో కొన్ని సానుకూల అంశాలను వెతికి అదే మోడల్‌లో రాశాను. డిస్క్రిప్టివ్ పద్ధతిలో సమాధానాలు రాసేటప్పుడు సమతూకం పాటించాలి. 
 
చదివిన పుస్తకాలు :
సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు మొదట ఆరో తరగతి నుంచి +2 వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఔపోసన పట్టాలి. తర్వాత సబ్జెక్టుల వారీగా రిఫరెన్స్ పుస్తకాలు చదవాలి. పాలిటీ-లక్ష్మీకాంత్; ఎన్విరాన్‌మెంటల్- శంకర్ ఐఏఎస్ పుస్తకం; జాగ్రఫీ- ఎన్‌సీఈఆర్‌టీ + కరెంట్ అఫైర్స్ + గో చెంగ్ లియాంగ్ పుస్తకం; ఎకానమీ- ఎన్‌సీఈఆర్‌టీ + కరెంట్ అఫైర్స్ + క్లాస్ నోట్స్; మోడర్న్ హిస్టరీ- బిపిన్‌చంద్ర; మిడీవల్ హిస్టరీ- తమిళనాడు స్టేట్ లెవల్ ఇంటర్ ఫస్టియర్ పుస్తకం; ప్రాచీన చరిత్ర- ఆర్.ఎస్. శర్మ పుస్తకం + క్లాస్ నోట్స్.
  
ఇంటర్వ్యూ సాగిందిలా...
ఇంటర్వ్యూ బోర్డ్‌లో చైర్మన్ పీకే. జోషి + నలుగురు సభ్యులు ఉన్నారు. ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఎంబీఏకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. సిక్స్ సిగ్మా అంటే ఏమిటి? మార్కెటింగ్, సేల్స్‌కు మధ్య తేడా ఏమిటి? డబ్ల్యూపీఐ, సీపీఐపై ప్రశ్నలు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, హ్యాపీనెస్ ఇండెక్స్ తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. తెలంగాణలో, ఏపీలో ఉన్న ముఖ్య సమస్యలు ఏమిటి? కొత్తగూడెం దేనికి పేరొందింది? మొదలైన ప్రశ్నలతో దాదాపు 25-30 నిమిషాల పాటు ఇంటర్వ్యూ సాగింది.
 
 ప్రొఫైల్
పదో తరగతి (2006 - 2007): 87 శాతం 
10+2 (2007 - 2009): 82 శాతం 
ఇంజనీరింగ్ (మెకానికల్) (2009 - 2013):  75 శాతం 
పీజీడీఎం (2013 - 2015): 9.4 సీజీపీఏ 
సివిల్ సర్వీసెస్-2016 ర్యాంకు: 36.
 
కోచింగ్‌కు వెళ్లలేని వారు సరైన మెటీరియల్ సేకరించుకొని చదివితే విజయం సాధించడం కష్టమేమీ కాదు. ఇప్పడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే.. ఇంటర్‌నెట్‌లో అవసరమైన సమాచారం అందుబాటులో ఉంది. కానీ, ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికలో మాత్రం అప్రమత్తత అవసరం.
Published date : 02 Jun 2017 05:21PM

Photo Stories