Skip to main content

వైఎస్సార్‌ ఉచిత బీమా పథకం

అనుకోని విపత్తుగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఉచిత బీమా అందించడమే లక్ష్యంగా కేంద్రం సాయం లేకున్నా బీమా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ నిరుపేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020 అక్టోబర్‌ 21న వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించారు.
YSR Bima scheme
YSR Bima scheme

అంటే కుటుంబాలలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, ఆ వ్యక్తి కుటుంబానికి తోడుగా నిలబడాలనే దృక్పథంతో ఈ పథకం ఏర్పడింది. అయితే పేద కుటుంబాల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ.. పలు కారణాలతో ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా సకాలంలో చెల్లించడానికి కొర్రీలు వేస్తున్నాయి.

బీమా కంపెనీలు, బ్యాంకుల ద్వారా ఎదురవుతున్న సవాళ్లు ఎన్నో..
ఈ పథకం ప్రారంభించిన మొదట్లో ప్రధాన మంత్రి జన జీవన బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై)కు కేంద్ర ప్రభుత్వం 50 శాతం ప్రీమియం చెల్లించేది. అయితే 2020 మార్చి 31 నుంచి కేంద్ర ప్రభుత్వం తన వాటా చెల్లించడం పూర్తిగా ఆపేసింది. రాష్ట్రాలు కావాలనుకుంటే కొనసాగించుకోవచ్చని చెప్పింది. దీంతో బీమా సొమ్ము చెల్లించే బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలపై పడింది. అంతేకాకుండా కేంద్రం బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరి పేరుపై ప్రత్యేక వ్యక్తిగత ఖాతా తెరవాలని మెలిక కూడా పెట్టించింది. అంటే బీమా నమోదు చేసుకున్న ప్రతిఒక్కరితో బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయిస్తే తప్ప, ఇన్సూరెన్స్ కు అర్హత రాదన్నమాట (ఇంతకు ముందు అయితే గ్రూప్‌ ఇన్సూరెన్స్ ఉండేది). తీరా అకౌంట్‌ ఓపెన్‌ చేసి, ఇన్సూరెన్స్ కంపెనీకి బ్యాంకులో ప్రీమియం చెల్లించాక, 45 రోజుల పాటు కూల్‌ ఆఫ్‌ పీరియడ్‌ అని కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చారు. అంటే 45 రోజుల లోపు ఎవరైనా చనిపోతే వారికి పరిహారం వర్తించదు. దీనితో ప్రభుత్వం ప్రీమియం చెల్లించినప్పటికీ.. అకౌంట్‌ ఓపెన్‌ చేయలేదనో, ఎన్‌రోల్‌ కాలేదనో, కూల్‌ ఆఫ్‌ పీరియడ్‌ కింద ఉన్నారనో చెప్పి కుటుంబాలకు పరిహారం అందడం లేదు.

నేరుగా ప్రభుత్వమే..
పై కారణాల దృష్ఠ్యా18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న సంపాదించే వ్యక్తి మరణిస్తే.. బీమా కంపెనీలు, బ్యాంకులతో సంబంధం లేకుండానే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సహాయం అందించేలా జూలై 1, 2021 నుంచి ఈ పథకంలో మార్పులు చేశారు. ఇవే కాకుండా రైతులు, మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించినా, పాడిపశువులు మరణించినా.. దరఖాస్తు అందిన నెల రోజుల్లోగా పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టారు. వీటన్నింటి కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. అన్ని రకాల ఇన్సూరెన్స్ క్లెయిములకు సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా మార్పులు చేశారు. ఇంకా.. ఈ పథకంలో భాగంగా అర్హులుగా గుర్తించినప్పటికీ, పేర్లు నమోదు చేసుకోకముందే మరణించిన వారి కుటుంబాలకు కూడా బీమా సొమ్మును చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇవీ ప్రయోజనాలు..

  • 18 నుంచి 50 ఏళ్లలోపు వారు సహజంగా మరణిస్తే రూ. లక్ష బీమా చెల్లిస్తారు.
  • 18 నుంచి 70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు. ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం చెందితే రూ.3,62,500 చెల్లించడం జరుగుతుంది. అలాగే ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.1.5 లక్షల బీమా చెల్లిస్తారు.
  • ఈ పథకానికి అర్హులెవరంటే..
  • లబ్ధిదారులను గుర్తించడం కోసం గ్రామ వార్డు సచివాలయ వలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తారు. లబ్ధిదారులను నిర్ధారించే అధికారం (రిజిçష్ట్టరింగ్‌ అథారిటీ) వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు ఇస్తారు. ఈ జాబితాను కార్మిక శాఖ పరిశీలిస్తుంది.
  • వైఎస్సార్‌ బీమా పరిధిలోకి రావాలంటే 18 ఏళ్ల పైనా, 70 ఏళ్లలోపు ఉండి, దారిద్యర్రేఖకు దిగువన ఉన్న వారెవరైనా సోషల్‌ సెక్యురిటీ యాక్ట్‌– 2008 కింద ఈ పథకానికి అర్హులౌతారు. అయితే అతను లేదా ఆమె కుటుంబ పోషణ చేసే వారై ఉండాలి.
  • వయసు నిర్ధారణ విషయంలో నోడల్‌ ఏజెన్సీ సంతృప్తి చెందాలి.
  • ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో వైఎస్సార్‌ బీమా రిజిస్ట్రేషన్‌ సదుపాయం ఉంటుంది.
  • ఏ నెలలో ఘటన జరిగితే ఆ నెలలోనే క్లెయిమ్‌ సెటిల్‌ అయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాలు బాధ్యత వహిస్తాయి. ఎలాంటి ఘటన జరిగినా ఆ నెలలోనే చెల్లింపులు జరుగుతాయి. వలంటీర్లు, గ్రామ సచివాలయాలు తోడుగా ఉంటాయి. అదే గ్రామంలో అప్లికేషన్‌ పెట్టగానే వెరిఫికేషన్‌ జరుగుతుంది. క్లెయిమ్స్‌ జాయింట్‌ కలెక్టర్‌కు వెళతాయి. దీనితో అదే నెలలో క్లెయిమ్‌ సెటిల్‌ అవుతుంది.
  • లబ్ధిదారుల నమోదు సంబంధించిన ఫిర్యాదులను డీఆర్‌డీఏ పీడీ పరిష్కరిస్తారు.
  • సహజ మరణం చెందిన వారికి ఇచ్చే లక్ష రూపాయలు చట్టబద్ధమైన వారసుడికి చెందే విషయమై గ్రామ/వార్డు వలంటీర్లే పర్యవేక్షణ చేస్తారు.
  • ఈ స్కీముకు నోడల్‌ ఏజెన్సీగా కార్మిక శాఖ, ఇంప్లిమెంటింగ్‌ (అమలు) ఏజెన్సీగా గ్రామ చివాలయ/వార్డు సచివాలయ విభాగం పనిచేస్తుంది. ప్రమాదవశాత్తు మరణం, లేదా శాశ్వత వైకల్యం గుర్తించే విషయంలో గ్రామ/వార్డు సెక్రటేరియట్‌ పర్యవేక్షణ చేస్తుంది.
  • జిల్లా స్థాయిలో ఈ పథకాన్ని జాయింట్‌ కలెక్టర్లు (సంక్షేమం) నిశితంగా పరిశీలిస్తారు. కుటుంబ పోషకుడు మరణించిన 15 రోజుల నుంచి 30 రోజుల లోపు అన్ని రకాల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.
  • నామినీ లేదా వారసులకు చెల్లింపులు ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాకు (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్ఫర్‌–డీబీటీ) చేస్తారు.
  • పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కన్వీనర్‌గా ఉంటారు. మరో 8 మంది సభ్యులుగా ఉంటారు.
  • రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి కార్మిక ఉపాధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చైర్మన్‌గానూ, మరో 9 మంది వివిధ విభాగాల కమిషనర్లు, డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు.


బీమా కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌

ఏ కారణం చేతైనా అర్హత ఉండీ, బీమా అందకపోయినా, రిజిస్ట్రేషన్‌లో సమస్యలు తలెత్తినా, ఇతర ఏ సందేహాల నివృత్తికైనా, ఎలాంటి సంకోచం లేకుండా ట్రోల్‌ ఫ్రీ నంబర్‌ 155214 కు కాల్‌ చేయవచ్చు.

Published date : 22 Jul 2021 02:21PM

Photo Stories