Skip to main content

Inspirational Story: అప్పులతో తల్లిదండ్రుల సూసైడ్‌... అయినా పట్టువదలకుండా గ్రూప్‌–2లో టాపర్‌గా...

అన్ని సౌకర్యాలు, వసతులున్నా ఒద్దికగా చదవడం కష్టం. అలాంటిది తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు శోకంలో కూడా నాన్న చివరి కోరిక కోసం అహర్నిషలూ కష్టపడడం అంటే మామూలు విషయం కాదు.
Inspiration

ఒకేసారి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నా పట్టువదలకుండా చదివి గ్రూప్‌–2లో టాపర్‌లలో ఒకడిగా నిలిచిన రాఘవరెడ్డి సక్సెస్‌ స్టోరీ మీకోసం...
రూ.3 లక్షలు అమ్మ, నాన్న ప్రాణం తీశాయి
ఖమ్మం జిల్లా తల్లాడ మా గ్రామం.  మాది రైతు కుటుంబం. నాన్న కౌలు రైతు. 2004లో వరుస కరువు.. వ్యవసాయంలో నష్టంతో రూ.3 లక్షల అప్పులు మిగిలాయి. అప్పులిచ్చినవారి వేధింపులు, అవమాన భారం భరించలేక అమ్మానాన్న ఇద్దరూ ఉరేసుకుని చనిపోయారు. అంత బాధలోనూ నాన్న చివరి కోరికను తీర్చడానికి కష్టపడి చదివి డిగ్రీ పాసయ్యా. అప్పటినుంచి ఉన్నత ఉద్యోగమే లక్ష్యంగా పోరాడా.
పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ...
డిగ్రీ పూర్తయింది నాన్న లక్ష్యం నెరవేర్చాలి. ఏంచేయాలి? జీవితానికి దారికావాలి. అప్పులేమో అలాగే ఉన్నాయి. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. అందుకోసం పొలిటికల్ సైన్స్‌లో ఓయూ పీజీ ప్రవేశపరీక్ష రాశా. అందులో ఫస్ట్‌ర్యాంకు వచ్చింది. తర్వాత 2006 బీఈడీ పూర్తిచేసి 2008లో డీఎస్సీ రాశా. దురదష్టం వెంటాడింది. ఈలోపు గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ వెలువడటంతో దరఖాస్తు చేశా. కానీ, ఆర్థిక ఇబ్బందులు.. బంధువులు ఆదుకోవడంతో 2009 నుంచి 2011 వరకు మూడేళ్లు అవిశ్రాంతంగా చదివా. మూడు నెలల కోచింగ్‌ మినహా ప్రిపరేషన్‌ అంతా సొంతంగానే. పేపర్‌–1కు సొంతం నోట్స్‌తోపాటు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పుస్తకాలు, పేపర్‌–2కు పూర్తిగా సాక్షి భవిత, విద్య అందించే మెటీరియల్, పాలిటీకి విజేత కాంపిటీషన్‌, వి.కష్ణారెడ్డి పుస్తకాలు క్షుణ్నంగా చదివా. 150 మార్కులకు 129 మార్కులొచ్చాయి. పేపర్‌–3కి ఆర్‌సీ రెడ్డి మెటీరియల్‌ విశ్లేషణాత్మకంగా చదివా. 
పగలూ, రాత్రి తేడాతెలిసేది కాదు...
నాన్న ఆఖరి కోరిక తీర్చాలి. అందుకే గ్రూప్‌–2లో డిప్యూటీ తహసీల్దార్‌ పోస్ట్‌ నా లక్ష్యం. అది చేజారుతుందనే భయంతో ఇంకా ఎక్కువ చదివేవాడిని. ఒక్కోసారి ఎన్నిగంటలు చదువుతున్నానో తెలిసేదికాదు. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు రాత్రవుతుందో తెలియకుండా చదివా. ఒక్కోసారి రోజుకు 17గంటలు చదివేవాడిని. చివరకు ఫలితాల్లో 332 మార్కులతో ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యా. 
జోన్‌ స్థాయిలో రెండో స్థానం...
ఇంటర్వ్యూ పది నిమిషాలు జరిగింది. ఖమ్మం జిల్లా సమాచారం? రాజ్యసభకు ఎంపికైన ఖమ్మం జిల్లా ఎంపీ? ఖమ్మం నుంచి ముఖ్యమంత్రిగా ఎంపికైంది ఎవరు? భద్రాచలం ఏ జిల్లాలో ఉంది? నచ్చిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్‌ అన్నారు కదా.. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు? గోల్డెన్‌ షేక్‌హ్యాండ్‌ పథకం అంటే? వంటి అనేక ప్రశ్నలకు సంతప్తికరంగా జవాబులు  చెప్పాను. ఫలితంగా రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో, జోన్‌ స్థాయిలో 2వ స్థానంలో నిలిచా.
అప్పులతోనే సావాసం...
పేరుకి రైతు కుటుంబమైనా అనునిత్యం ఇబ్బందులే.   పదో తరగతి నుంచి పీజీ వరకు అప్పు చేసే చదివా. చిన్నాన్న ఆదుకోవడంతో కొంచెం కష్టాలు తగ్గాయి. కష్టాలు ఎందరికో ఉంటాయి. ఎన్ని ఆర్థికకష్టాలున్నా అవన్నీ తాత్కాలికమే. వాటన్నింటికి సమాధానం పట్టుదలగా చదవడం, అది సఫలమైతే కష్టాలు అవే పోతాయి. అలాగే నాణ్యమైన మెటీరియల్‌ ఉంటే ఏ కోచింగ్‌ అక్కర్లేదు. దేనికైనా ఓపిక అవసరం. ఓపికతో ప్రిపరేషన్‌ చేస్తే విజయం సాధించడం సులువే.

Published date : 08 Dec 2022 07:09PM

Photo Stories