Skip to main content

భూసంస్కరణలు

భారతదేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ జీవనంలో వ్యవసాయ సమస్యలు నేటికీ కీలకస్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. వ్యవసాయ రంగం దేశంలోని అత్యధిక శాతం జనాభాకు జీవనోపాధి కల్పిస్తోంది. జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా కీలమైంది. దేశ ఆర్థికాభివృద్ధిలోనూ ఈ రంగం ముఖ్య భూమిక వహిస్తోంది.
  • వార్షిక గణాంకాల్ని పరిశీలిస్తే.. వ్యవసాయరంగం వృద్ధిరేటు అధికంగా ఉన్న సంవత్సరాల్లో దేశ ఆర్థిక వృద్ధిరేటు ఎక్కువగా ఉందని అవగతమవుతుంది. దేశ ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ రంగ అభివృద్ధి కీలకమని చెప్పవచ్చు.
  • నిర్మాణాత్మక, విప్లవాత్మక మార్పులు వస్తేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. దేశంలో, రాష్ట్రంలోని అత్యధిక శాతం గ్రామీణ జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. వీరి జీవన ప్రమాణాల్లో మార్పులు వచ్చినప్పుడే సర్వతోముఖాభివృద్ధి జరిగి దేశం ప్రగతి పథంలో పురోగమిస్తుంది.
  • వ్యవసాయ రంగం వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి, ఆ రంగంలోని స్తబ్దతకు వ్యవస్థాగత అంశాలే ప్రధాన కారణం. ఈ పరిస్థితిలో మార్పు రావడానికి నిర్మాణాత్మక చర్యల ఆవశ్యకత ఉంది.
  • భూయాజమాన్యంలో అసమాన పంపిణీలు, భూకేంద్రీకరణ, లాభసాటిలేని కమతాలు, కమతాల విభజన, విఘటన, అధిక కౌలుపరిమాణం, కౌలుదార్లకు భద్రత లేకపోవడం, వివిధ రకాలైన కౌలుదారీ పద్ధతులు, గ్రామీణ రుణ సమస్యలు తదితర అభివృద్ధి నిరోధక లక్షణాలున్న వ్యవస్థల్లో భూసంస్కరణలు ప్రధాన పాత్ర వహిస్తాయి.
భూసంస్కరణలు-నిర్వచనాలు
కౌలుదార్లు, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని భూమిని (ఆస్తి హక్కు) పునఃపంపిణీ చేయడమే భూసంస్కరణలు.

ఐక్యరాజ్యసమితి నిర్వచనం:
భూమి పునఃపంపకం, వ్యవసాయ, ఆర్థికసంస్థల అభివృద్ధి, వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడే విధానాల గురించి ఐరాస వివరించింది. భూమి పునఃపంపకమే కాకుండా కౌలు పరిమాణ నిర్ణయం, కౌలుదార్ల భద్రత, వ్యవసాయ కూలీల వేతన నిర్ణయం, వ్యవసాయ పరపతి మార్గాల అభివృద్ధి, భూమి పన్నుల విధానాల మెరుగుదల, సహకార సంస్థల అభివృద్ధి, వ్యవసాయ విద్యా బోధన, వ్యవసాయంలో సాంకేతిక మార్పులు మొదలైనవన్నీ భూసంస్కరణలుగా నిర్వచించారు.

రాజ్‌కృష్ణ నిర్వచనం:
భూ సంస్కరణలను నాలుగు రకాలుగా విభజించారు. అవి..
1. విమోచనం(లిబరేషన్)
2. పంపిణీ చేసేవి(డిస్ట్రిబ్యూషన్)
3. వ్యవస్థాగతమైనవి(ఆర్గనైజేషనల్)
4. అభివృద్ధికరమైనవి(డెవలప్‌మెంటల్)
వీటిలో మొదటి మూడు రకాలు భూసంస్కరణలకు సంబంధించినవని రాజ్‌కృష్ణ తెలిపారు.
ఎ) భారతదేశంలో మధ్యవర్తుల తొలగింపు మొదటి వర్గానికి సంబంధించింది.
బి) భూమి హక్కుల పునఃపంపకం, కమతాల సమీకరణ, కౌలు సంస్కరణలు రెండో వర్గానికి చెందినవి.
సి) సహకార, సామూహిక వ్యవస్థల నిర్మాణం మూడో వర్గానికి చెందింది.

ప్రపంచ బ్యాంకు నిర్వచనం:
భూసంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు, గ్రామీణాభివృద్ధికి మధ్య స్పష్టమైన తేడాలను ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.
ఎ) కమతాల పరిమాణం, ఆదాయ పంపిణీలో మార్పుల ద్వారా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులు తెచ్చే సాధనమే భూసంస్కరణలు.
బి) వ్యవసాయ రంగంలో విస్తృతమైన ప్రభావం చూపే, అన్ని పరిస్థితుల్లోనూ సవరణలను తెలియజేసేవి వ్యవసాయ సంస్కరణలు.
సి) గ్రామీణ రంగంలోని అన్ని భాగాలు, వర్గాల్లో... అంటే వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలకు సంబంధించిన అన్ని అంశాల్లో మార్పులు తెచ్చేవి. వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకతల పెరుగుదల కంటే గ్రామీణ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చేది గ్రామీణాభివృద్ధి.

ప్రభుత్వాలు భూసంస్కరణలను ప్రవేశపెట్టడానికి రెండు రకాల కారణాలున్నాయి.
  1. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పుల ద్వారా అభివృద్ధి సాధించడం కోసం ప్రభుత్వం స్వయంగా ప్రవేశపెట్టే సంస్కరణలు.
  2. ఆర్థిక, రాజకీయ, సాంఘిక సంఘర్షణల నుంచి బయటపడేందుకు.. అంటే వ్యవసాయదారుల్లో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తి నుంచి తప్పించుకోవడానికి, వారిని ఉపశమింపజేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టే భూసంస్కరణలు.
భారతదేశంలో వ్యవసాయ రంగం వెనుకబడటానికి ప్రధాన కారణం వ్యవస్థాపూర్వకమైన కారకాలు.
  • లోపభూయిష్ట భూస్వామ్య విధానాలే భారతదేశ వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకతకు కారణమని 1889లో డాక్టర్ వాల్కర్ తెలిపారు.
  • సమర్థమైన వ్యవసాయాన్ని కొనసాగించడానికి అవసరమయ్యే ముఖ్యమైన ఆర్థికాంశాలను సరఫరా చేసినప్పుడే భారతదేశ వ్యవసాయదారుల జీవన ప్రమాణాల అభివృద్ధి సాధ్యమవుతుందని డాక్టర్ ఆర్.కె. ముఖర్జీ పేర్కొన్నారు. భూస్వామ్య పద్ధతుల్లో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఆధునిక సాంకేతిక విజ్ఞానం, సహకార వ్యవసాయం అంతగా దోహదపడవని ఈయన తెలిపారు.
  • భారతదేశంలో గ్రామీణాభివృద్ధికి అతి ముఖ్యమైన నిరోధం సాంఘికమైనదేనని, అది వ్యవస్థాపూర్వక చట్టమే (ఫ్రేమ్ వర్క్) నని హెరాల్డ్ మాన్ పేర్కొన్నారు.
  • స్వాతంత్య్రం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి పొందడమేకాదని.. భారతీయ పెట్టుబడిదారులు, భూస్వాముల దోపిడి నుంచి ప్రజలను (రైతులను) విముక్తుల్ని చేయాలని మహాత్మాగాంధీ పేర్కొన్నారు.
  • జవహర్‌లాల్ నెహ్రూ 1928లో ఉత్తర ప్రదేశ్‌లో నిర్వహించిన రాజకీయ సభలో భూస్వామ్య విధానం తొలగింపు అనేది కాంగ్రెస్ కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశంగా ఉండాలని సూచించారు. రైతులపై భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.
పి.సి.జోషి భారతదేశంలో వచ్చిన భూ సంస్కరణల అనుభవాలను 4 రకాలుగా వర్గీకరించారు. అవి:
  1. ప్రభుత్వ చట్టాల ద్వారా వచ్చిన భూ సంస్కరణలు: చట్టాల ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో మార్పులు తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేసి అమలు పరిచాయి. మధ్యవర్తుల తొలగింపు, కౌలుదారీ చట్టాలు, భూకమతాలపై గరిష్ట పరిమితి చట్టం మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి.
  2. ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన సంస్కరణలు: రైతు ఉద్యమాల ఫలితంగానూ వ్యవసాయ సంబంధ అంశాల్లో మార్పులు వచ్చాయి. తెలంగాణా సాయుధ పోరాటం, నక్సల్‌బరీలో ప్రారంభమైన నక్సలైట్ ఉద్యమం, భూ ఆక్రమణల ఫలితంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మనోగతాల ఆధారంగా భూయాజమాన్యంలో చోటుచేసుకున్న మార్పులు, కౌలుదారీ హక్కులు మొదలైనవి వీటికి ఉదాహరణలు.
  3. చట్టాలు, ప్రజా ఉద్యమాల ఫలితంగా వచ్చిన భూ సంస్కరణలు: ఒకవైపు రైతులు ఉద్యమాలు చేయడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయడం వల్ల భూ సంస్కరణలు అమలయ్యాయి. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు, వామపక్ష ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు వీటికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.
  4. ప్రజల నుంచి ఐచ్ఛికంగా వచ్చిన భూ సంస్కరణలు: భూస్వాములు, పెత్తందార్లు వారంతట వారే ఐచ్ఛికంగా యాజమాన్య హక్కులను వదులుకోవడం వల్ల కూడా భూ సంబంధాల్లో మార్పులు వచ్చాయి. భూదాన, గ్రామదాన ఉద్యమాలు ఈ రకానికి చెందినవి.
భూ వినియోగం
రాష్ట్రంలో మొత్తం భూ విస్తీర్ణం 114.84 లక్షల హెక్టార్లు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 23.89 శాతం (27.43 లక్షల హెక్టార్లు) అడవులు విస్తరించి ఉన్నాయి.  దాదాపు 43.20 శాతం (49.61 లక్షల హెక్టార్లు) భూమి సాగులో ఉంది. ప్రస్తుతం 8.36 శాతం భూములు (9.6 లక్షల హెక్టార్లు) పడావగా, 7.79 శాతం భూములను (8.95 లక్షల హెక్టార్లు) వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. 5.36 శాతం భూములు (6.15 లక్షల హెక్టార్లు) బంజరు, సాగుకు పనికిరానివిగా ఉన్నాయి. 6.24 శాతం (7.17 లక్షల హెక్టార్లు) ఇతర పడావ భూములు. మిగిలిన 5.16 శాతం సాగు చేయడానికి వీలైనా.. వ్యర్థం కింద 5.93 శాతం శాశ్వత పచ్చిక బయళ్లు, మేత బయళ్ల రూపంలో, నికరంగా విత్తిన విస్తీర్ణంలో చేర్చని, ఇతర వృక్షాలు, తోపుల కింద ఉంది. నికరంగా విత్తిన భూముల కింద లెక్కించని ఈ భూములు 5.93 లక్షల హెక్టార్ల వరకు ఉన్నాయి.

భూకమతాలు
వ్యవసాయ కమతాల గణన, 2010-11 ప్రకారం రాష్ట్రంలో భూకమతాల సంఖ్య 55.54 లక్షలు. వీటి కింద ఉన్న మొత్తం భూమి 61.97 లక్షల హెక్టార్లు. రాష్ట్రం సగటు భూకమతం పరిమాణం 1.11 హెక్టార్లు. 62 శాతం హెక్టారు కంటే చిన్నవైన, నామమాత్రపు (ఉపాంత) కమతాలు. 1-2 హెక్టార్ల మధ్య విస్తీర్ణం ఉన్న చిన్న కమతాల శాతం 23.9. మొత్తం కమతాల్లో నామమాత్రపు, చిన్నవి కలిపి 85.9 శాతం ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 60 శాతానికి పైగా భూములు నామమాత్రపు కమతాలే. చిన్న, ఒక మోస్తరు కమతాలన్నీ కలిపితే, నామమాత్రపు కమతాల మొత్తం కంటే ఎక్కువ శాతమే. సగటు కమతం విస్తీర్ణం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక స్థాయిలో 1.40 హెక్టార్లుండగా, 0.92 హెక్టార్ల సగటు విస్తీర్ణంతో నిజామాబాద్ అతి తక్కువ స్థాయిలో ఉంది.

మాదిరి ప్రశ్నలు

Published date : 14 Sep 2015 06:43PM

Photo Stories