Skip to main content

భారతదేశంలో రవాణా

ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. రైల్వే నెట్‌వర్‌‌కలో అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. భారతీయ రైల్వే సంస్థ దశాబ్దాల పాత పద్ధతులను పక్కనబెట్టి ప్రమాదాల కుదుపులు లేకుండా ప్రయాణికులను గమ్య స్థానం చేర్చడానికి అవసరమైన అన్ని రకాల విధానాలను పట్టాలనెక్కిస్తోంది. మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్లకు సంబంధించిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా హైస్పీడు వేగంతో పరుగులు తీస్తోంది.

భారతదేశంలోని రవాణా రంగంలో రైల్వేలు, విమానయాన రంగం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

రైల్వే రవాణా

దేశంలో పెద్ద ఎత్తున సరకును, ప్యాసింజర్లను సుదూర ప్రాంతాలకు తరలించడంలో రైల్వేలు కీలకపాత్ర వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 65 వేల కి.మీ. రైల్వే రూటు మార్గం, 1,14,500 కి.మీ. పొడవైన రైలు పట్టాలు, 8 వేలకు పైగా రైల్వేస్టేషన్లు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వేలో రోజూ 19 వేల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 12 వేల రైళ్లు ప్రయాణీకులకు సేవలందిస్తుండగా, 7 వేల రైళ్లు సరకు రవాణా సాగిస్తున్నాయి.

రెండు రైలు పట్టాల మధ్య ఉన్న దూరం ఆధారంగా రైల్వే లైన్లను అయిదు గేజ్‌లుగా విభజించారు. అవి:

  • బ్రాడ్ గేజ్ - 1.676 మీటర్లు
  • మీటర్ గేజ్ - 1 మీ.
  • న్యారోగేజ్ - 0.762 మీ.
  • లైట్ న్యారోగేజ్ - 0.610 మీ.
  • స్టాండర్డ్‌ గేజ్ - 1.500 మీ. (దీన్ని మెట్రో మార్గాల్లో ఉపయోగిస్తున్నారు)

దేశంలో రైల్వేల అభివృద్ధి ఎక్కువగా గంగా-సింధూ మైదాన ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో వీటికి ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. ఈశాన్య ప్రాంతాల్లో రైల్వేల అభివృద్ధి అతి తక్కువగా ఉంది.
దీనికి కారణాలు:
1) అల్ప జన సాంద్రత ఉండటం
2) అల్ప ఆర్థిక వ్యవస్థ
3) విసిరేసినవిధంగా ఉన్న మానవ నివాసాలు
4) ఎగుడు, దిగుడు భూ స్థలాకృతి

దేశంలో పొడవైన రైలు మార్గాలు ఉన్న రాష్ట్రాల్లో మొదటి 4 స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. దేశంలో రైల్వేలైన్లు లేని రాష్ట్రాలు మేఘాలయ, సిక్కిం. అసోం మినహా మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో (అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం) రైల్వే టెర్మినళ్లు మాత్రమే ఉన్నాయి.
కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్: దేశంలో మొదటిసారిగా 1998 జనవరి 26న ప్రైవేట్ రంగంలో రైల్వే మార్గాన్ని నిర్మించారు. ఇది మహారాష్ర్టలోని ‘రోహా’తో కర్ణాటకలోని ‘మంగళూరు’ను కలుపుతుంది. దీని పొడవు 700 కి.మీ. ఈ మార్గంలో అతి పొడవైన (6.5 కి.మీ.) సొరంగ మార్గం ఉంది. దీన్ని ‘కార్బూద్ టన్నెల్’గా పేర్కొంటారు. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాలు కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కేంద్ర కార్యాలయం నవీ ముంబయిలో ఉంది.
దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం 17 రైల్వే మండలాలుగా విభజించారు. వీటిలో ‘కేంద్ర రైల్వే మండలం’ దేశంలోనే మొదటిది కాగా, అతి పెద్ద రైల్వే మండలం న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ‘ఉత్తర రైల్వే మండలం’.

యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ రైల్వేలు

రైల్వే లైను

- గుర్తించిన సంవత్సరం

డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే(పశ్చిమ బెంగాల్)

- 1999

ఛత్రపతి శివాజీ టెర్మినల్ (ముంబయి)

- 2004

నీలగిరి పర్వత రైల్వే (తమిళనాడు)

- 2005

కల్క - సిమ్లా రైల్వే (హిమాలయాలు)

- 2008

మాతరన్ రైల్వే (మహారాష్ట్ర)

- 2014

వాయు రవాణా

రవాణా మార్గాలన్నింటిలోకెల్లా అతి ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్న రవాణా ఇదే. దేశంలో పౌర విమాన సర్వీసులను అందజేయడంలో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్‌‌స, వాయుదూత్, పవన్‌హన్‌‌స లిమిటెడ్ తదితర సంస్థల పాత్ర ఉంది. వీటితో పాటు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్‌‌ట అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఏఏఐ), నేషనల్ ఎయిర్‌పోర్‌‌ట అథారిటీ (ఎన్‌ఏఏ) సంస్థలు ప్రాథమిక సదుపాయాల కల్పనకు సంబంధించి కీలకపాత్ర పోషిస్తున్నాయి.
పౌర విమానయానానికి సంబంధించి జాతీయ విధానాలు, నిబంధనలు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, విమానాశ్రయాల ఏర్పాటు, వైమానిక రవాణా క్రమబద్ధీకరణ, పౌర విమాన రవాణా విస్తరణకు అమలు చేయదగిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.
దేశంలో విమానయానం 1911లో మొట్టమొదటిసారిగా అలహాబాద్ - నైనిటాల్ మధ్య ప్రారంభమైంది. పోస్టల్ సర్వీస్‌ను బట్వాడా చేయడం ద్వారా దీన్ని ప్రారంభించారు. 1953 వరకు దేశంలో విమానయానాన్ని ప్రైవేట్ రంగంలో నిర్వహించారు. 1950లో ఏర్పాటు చేసిన రాజ్ అధ్యక్ష కమిటీ సూచనల మేరకు 1953లో ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న విమానయాన సంస్థలన్నింటినీ జాతీయం చేస్తూ రెండు ప్రధాన ప్రభుత్వ రంగ కార్పొరేషన్‌లుగా విభజించారు. అవి:
ఎ. ఎయిర్ ఇండియా: ఇది దేశాన్ని ఆనుకొని ఉన్న చిన్న చిన్న పొరుగు దేశాలు మినహా ఇతర దేశాలకు ఖండాంతర విమాన సర్వీసులను నడుపుతోంది.
బి. ఇండియన్ ఎయిర్ లైన్స్‌: ఇది దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య, దేశాన్ని ఆనుకొని ఉన్న చిన్న చిన్న పొరుగు దేశాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. 2005 డిసెంబరు 8న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ పేరును ‘ఇండియన్’గా మార్చారు. దీని మస్కట్ ‘కోణార్క్‌ సూర్య దేవాలయంలోని రథ చక్రం’. 2007లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను, ఎయిర్ ఇండియాతో కలిపి ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. దీని మస్కట్ ‘ఎగిరే హంసతో కూడిన కోణార్క్‌ చిత్రం’.
వాయుదూత్: సరకుల రవాణా కోసం 1981 లో దీన్ని ప్రారంభించారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ విమానాలు నడవని ప్రాంతాలు, ముఖ్యంగా దట్టమైన అడవులున్న ఈశాన్య ప్రాంతాలకు ప్రయాణికుల కోసం ఈ సర్వీసులను ఉపయోగించారు. దీన్ని 1993లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశారు.

పవన్‌హన్స్‌ లిమిటెడ్: దీన్ని 1985 అక్టోబర్ 15న స్థాపించారు. దీని కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. పెట్రోలియం స్థావరాలకు సహాయం కోసం ఇది ఏర్పాటైంది. తర్వాతి కాలంలో కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, ఎన్టీపీసీ, గెయిల్, బీఎస్‌ఎఫ్ లాంటి సంస్థలకు సేవలందించేందుకు విస్తరించారు.

  • ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీలో పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఇది ఉత్తర ప్రదేశ్‌లోని ఫుర్‌సత్‌గంజ్‌లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది.
  • బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ విమానాల తయారీ, రిపేర్లను నిర్వహిస్తోంది.

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా:
నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియాలను విలీనం చేసి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియాను 1995 ఏప్రిల్ 1న ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) కింద మూడు సంస్థలు పనిచేస్తున్నాయి. అవి
1. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ డివిజన్
2. నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ డివిజన్
3. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్
1990లో ప్రవేశపెట్టిన ఓపెన్ స్కై పాలసీ వల్ల ప్రైవేటు రంగంలో 8 ప్యాసింజర్ ఎయిర్‌వేస్ ప్రారంభమయ్యాయి. అవి
1. జెట్ ఎయిర్‌వేస్
2. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌
3. ఇండిగో ఎయిర్‌వేస్
4. స్పైస్‌జెట్
5. జెట్‌లైట్
6. గో ఎయిర్‌వేస్
7. పారామౌంట్ ఎయిర్‌వేస్
8. దక్కన్ ఏవియేషన్

అంతర్జాతీయ విమానాశ్రయాలు

1. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  (పాతపేరు పాలెం) - న్యూఢిల్లీ
2. నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (పాతపేరు - డమ్‌డమ్) - కోల్‌కతా
3. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం (పాతపేరు శాంతాక్రాజ్, సహారా) - ముంబై (మహారాష్ర్ట)
4. అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం (పాతపేరు మీనంబాకం) - చెన్నై (తమిళనాడు)
5. నిడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం - తిరువనంతపురం (కేరళ)
6. గురురామ్‌దాస్‌జీ/రాజాసాన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం - అమృత్‌సర్ (పంజాబ్)
7. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  - శంషాబాద్ (హైదరాబాద్)
8. లోకప్రియ గోపీనాథ్ బర్డోలియా అంతర్జాతీయ విమానాశ్రయం - గువాహటి (అసోం)
9. సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం -  అహ్మదాబాద్ (గుజరాత్)
10. వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం - పోర్ట్‌బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవులు)
11. దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం - ఇండోర్ (మధ్యప్రదేశ్)
12. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం - నాగపూర్ (మహారాష్ర్ట)
13. గయా అంతర్జాతీయ విమానాశ్రయం - గయ (బీహార్)
14. బెంగళూరు/ దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం - బెంగళూరు (కర్ణాటక)
15. రాజాభోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం - భోపాల్ (మధ్యప్రదేశ్)
16. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం - జైపూర్ (రాజస్థాన్)
17. వాస్కోడగామా అంతర్జాతీయ విమానాశ్రయం - పనాజి (గోవా)

Published date : 05 Sep 2015 05:31PM

Photo Stories