Skip to main content

వేతన ఉపాధి కార్యక్రమాలు

భారత్ అనాదిగా వ్యవసాయ ఆధార దేశంగా ఉంది. నేటికీ అనేక మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జనాభా పెరుగుదల, తగినంత వర్షపాతం లభించకపోవడం తదితర కారణాలతో పేదరికం పెరిగిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల్లో అధిక శాతం నైపుణ్యం లేని శ్రమ ద్వారా లభించే వేతనాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వేతన ఉపాధి కార్యక్రమాలు పేద కుటుంబాల వినియోగ వ్యయంలోని ఒడుదొడుకులను తగ్గించడానికి దోహదపడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ కార్యకలాపాలు లేని సమయాల్లో ఇవి పేద ప్రజలకు సుస్థిర జీవనానికి భరోసా కల్పిస్తున్నాయి.
పేదరికం, నిరుద్యోగ నిర్మూలనకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వేతన ఉపాధి కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. నీటి పారుదల సౌకర్యాలు, మౌలిక వసతులు, అడవుల పునరుద్ధరణ, భూసార పరిరక్షణ, రోడ్ల నిర్మాణం లాంటి ప్రజా పనుల్లో నైపుణ్యం లేని శ్రామికులకు స్వల్పకాల ఉపాధిని అందిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఈ కార్యక్రమాలు పేద కుటుంబాలకు ఆదాయ బదిలీకి తోడ్పడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ కార్యకలాపాలు లేని సమయాల్లో పేద కుటుంబాల వినియోగ వ్యయంలోని ఒడుదొడుకులను తగ్గించడానికి ఇవి దోహదపడుతున్నాయి. వీటి ద్వారా లభించే అనశ్వర ఆస్తులు పేద ప్రజల సుస్థిర జీవన ప్రమాణానికి తోడ్పడుతున్నాయి.
కనీస వేతనాల వద్ద ప్రజా పనుల్లో వేతన ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అనేక వేతన ఉపాధి కార్యక్రమాలను అమలు చేసింది. వీటిలో కొన్నింటిని పైలట్ ప్రాజెక్ట్‌లుగా రూపొందించారు.

వేతన ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు
 • పేదరికం, నిరుద్యోగ నిర్మూలన ప్రధాన ఉద్దేశంగా 1960-61లో రూరల్ మ్యాన్ పవర్ ప్రోగ్రామ్, 1971-72లో క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమాలను ప్రారంభించారు.
 • 1973లో రూరల్ వర్క్స్ కార్యక్రమంగా కరవు పీడిత ప్రాంతాల కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని 1994-95లో దేశంలోని 13 రాష్ట్రాలకు సంబంధించి 96 జిల్లాల్లోని 627 బ్లాకుల్లో అమలు పరిచారు. హనుమంతరావు కమిటీ సిఫార్సుల మేరకు 384 నూతన బ్లాకులను కరవు పీడిత ప్రాంతాల కిందకు తీసుకువచ్చారు. దీంతోపాటు 64 బ్లాకులను కరవు పీడిత ప్రాంతాల కార్యక్రమం నుంచి ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం కిందకు మార్చారు. తద్వారా 13 రాష్ట్రాల్లోని 164 జిల్లాలకు సంబంధించి 947 బ్లాకులకు ఈ కార్యక్రమం విస్తరించింది. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాకుల పునర్విభజన నేపథ్యంలో ఇది 16 రాష్ట్రాల్లోని 182 జిల్లాలకు సంబంధించి 972 బ్లాకులకు విస్తరించింది. ఈ కార్యక్రమం కింద ఉన్న మొత్తం విస్తీర్ణం 7,45,914 చదరపు కి.మీ. మహారాష్ట్రలో 25 జిల్లాలకు సంబంధించి 149 బ్లాకులు, మధ్యప్రదేశ్‌లో 23 జిల్లాలకు చెందిన 105 బ్లాకులు అధికంగా ఈ కార్యక్రమం పరిధిలోకి వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలకు సంబంధించి 94 బ్లాకుల్లో 99218 చ.కి.మీ. విస్తీర్ణాన్ని కరవు పీడిత ప్రాంతాల కార్యక్రమం అమలు పరిధిలోకి తీసుకువచ్చారు.
 • పైలట్ ప్రాజెక్టుల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 1977లో పనికి ఆహార పథకం రూపంలో వేతన ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 • పనికి ఆహార పథకాన్ని పునర్నిర్మించి దాని స్థానంలో జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 నిష్పత్తిలో భరించాయి. కేంద్రానికి సంబంధించిన సహాయాన్ని ఆహార ధాన్యాలు, నగదు రూపంలో ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, అల్ప ఉద్యోగిత ఉన్నవారికి సంవత్సరానికి 300 నుంచి 400 మిలియన్ పనిదినాలు కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
 • గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో 1983 ఆగస్టు 15న ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక ఆస్తుల కల్పన, గ్రామీణ ప్రజల జీవన నాణ్యత పెంచడం తదితరాల కోసం ఈ పథకం ద్వారా కృషి చేశారు. ఈ కార్యక్రమం కింద ఉపాధి కల్పనలో భాగంగా.. భూమిలేని శ్రామికులు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కార్యక్రమం కింద అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పథకం అమలుకు సంబంధించి వనరులు కేటాయించే విషయంలో వ్యవసాయ శ్రామికులు, ఉపాంత రైతులు, ఉపాంత శ్రామికులకు 50 శాతం, పేదరిక తీవ్రతకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు.
 • ఉపాధి హామీ పథకం ద్వారా సామాజిక అడవుల కార్యక్రమం, ఇందిరా ఆవాస్ యోజన, మిలియన్ బావుల పథకం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించారు.
 • 1989 ఏప్రిల్‌లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ జవహర్ రోజ్‌గార్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు అమల్లో ఉన్న గ్రామీణ వేతన ఉపాధి కార్యక్రమాల (ఆర్‌ఎల్‌ఈజీపీ, ఎన్‌ఆర్‌ఈపీ)ను ఇందులో విలీనం చేశారు.
 • జవహర్ రోజ్‌గార్ యోజనకు కొన్ని మార్పులు చేసి 1999 ఏప్రిల్ 1 నుంచి దీన్ని ‘జవహర్ గ్రామ సమృద్ధి యోజన’గా అమలు చేశారు. దీని కింద ప్రతి గ్రామ పంచాయతీకి చేరువయ్యే విధంగా లక్ష్యాలను నిర్ణయించారు. పంచాయతీల ద్వారా దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 440 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జవహర్ రోజ్‌గార్ యోజన కింద వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80:20 నిష్పత్తిలో భరించాయి. కేంద్రం ఆయా రాష్ట్రాల్లో పేదరిక రేఖ దిగువన నివసించే జనాభా పరిమాణం ఆధారంగా నిధులు పంపిణీ చేసింది. జిల్లాలకు నిధుల పంపిణీ ఆయా జిల్లాల వెనుకబాటుతనం ఆధారంగా జరిగింది. జవహర్ రోజ్‌గార్ యోజన కింద గ్రామీణ పేదలకు ఉపాధి పథకాల అమలుకు సంబంధించి గ్రామ పంచాయతీలకు తగిన మొత్తంలో నిధులు ఇచ్చారు. జవహర్ గ్రామ సమృద్ధి యోజనను 1999-2000 నుంచి గ్రామీణ అవస్థాపనా కార్యక్రమంగా తీర్చిదిద్దారు.
 • జవహర్ గ్రామ సమృద్ధి యోజన కింద ఒక ఏడాదిలో చేసే వ్యయంలో 22.5 శాతం షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రయోజనానికి ఉద్దేశించిన పథకాలకు కేటాయించాలి. జవహర్ గ్రామ సమృద్ధి యోజనను 2001-02లో సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజనలో విలీనం చేశారు.
 • 2001 సెప్టెంబర్ 25న సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో వేతన ఉపాధి ద్వారా ఆహార భద్రత, కమ్యూనిటీ, సాంఘిక, ఆర్థిక ఆస్తుల కల్పన ఈ పథకం ఉద్దేశం. ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరించాయి. 2002 ఏప్రిల్ 1 నుంచి జవహర్ గ్రామ సమృద్ధి యోజన, ఉపాధి హామీ పథకాలను ‘సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన’లో విలీనం చేశారు.
 • రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ పథకం కింద రూ. 5000 కోట్ల విలువైన ఆహార ధాన్యాలను ఏటా ఉచితంగా అందించారు. మరో రూ. 5000 కోట్లు వేతనాలు, మెటీరియల్ వ్యయం నిమిత్తం అందించారు. ఈ పథకం కింద వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 87.5 : 12.5 నిష్పత్తిలో భరించాయి.
 • సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన కింద నగదును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 నిష్పత్తిలో భరించాయి. దీని కింద సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో వంద కోట్ల పనిదినాలు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విలీనం చేశారు.
 • ఫిబ్రవరి 2001లో పనికి ఆహార పథకాన్ని మొదట అయిదు నెలల అమలుకు సంబంధించి ప్రారంభించారు. ఆ తర్వాత విస్తరించారు. ఎనిమిది రాష్ట్రాల్లోని (గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాంచల్) కరవు పీడిత ప్రాంతాల్లో వేతన ఉపాధి ద్వారా ఆహార భద్రత కల్పించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం.
 • నవంబర్ 2004లో 150 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ పథకంగా జాతీయ పనికి ఆహార పథకం ప్రారంభించారు. అదనపు సప్లిమెంటరీ వేతన ఉపాధి కల్పన ద్వారా ఆహార భద్రత కల్పించడం ఈ పథకం ఉద్దేశం. దీని కింద రాష్ట్రాలకు ఆహారధాన్యాలు ఉచితంగా సరఫరా చేశారు. తర్వాత దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విలీనం చేశారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005 సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2006 ఫిబ్రవరి 2 నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. మొదట ఈ పథకాన్ని 200 జిల్లాల్లో ప్రారంభించారు. 2008 ఏప్రిల్ 1 నుంచి దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రపంచ బ్యాంక్ ‘వరల్డ్ డెవలప్‌మెంట్ నివేదిక-2014’లో ఈ పథకాన్ని ‘గ్రామీణాభివృద్ధికి ఆదర్శప్రాయమైన ఉదాహరణ’గా అభివర్ణించింది. ఈ పథకం కింద ఉపాధి చేపట్టడానికి సుముఖత చూపిన ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజనులకు సంవత్సరంలో వంద రోజులు పని కల్పించడం ద్వారా వేతనం అందిస్తారు. ఈ పథకాన్ని గ్రామ పంచాయతీల ద్వారా అమలు చేస్తున్నారు. ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ మహిళా సాధికారత, గ్రామీణ పట్టణ వలసల తగ్గింపు, సాంఘిక న్యాయ సాధన కోసం ఈ పథకం దోహదపడుతుంది. 2014 ఫిబ్రవరిలో ఈ పథకం కింద కల్పించే పనిదినాల సంఖ్యను గిరిజన ప్రాంతాల్లో వంద నుంచి 150కి పెంచారు. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కింద భూమి హక్కులు పొందిన గిరిజనులు గ్రామీణ ఉపాధి పథకం కింద అదనంగా 50 రోజుల వేతన ఉపాధి పొందడానికి అర్హులు. తద్వారా 14 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద 2012-13లో 4.8 కోట్ల కుటుంబాలకు ఉపాధి లభించింది. దీని కింద మొత్తం రూ. 39,000 కోట్ల వ్యయంతో 213 కోట్ల పనిదినాలు కల్పించారు. 2006-07లో సగటు వేతన రేటు రోజుకు రూ. 65. 2012-13లో దీన్ని రూ. 128కి పెంచారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటి సంరక్షణ, నీటి వినియోగం, కరవు నివారణ, భూమి అభివృద్ధి, వరద నివారణ, గ్రామీణ కనెక్టివిటీ పెంపుపై ప్రధానంగా దృష్టి సారించారు. 2015-16 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు రూ. 79526 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 34,699 కోట్లు కేటాయించారు.


మాదిరి ప్రశ్నలు

Published date : 02 Jan 2016 04:15PM

Photo Stories