Disaster Management for Groups Exams : డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో కీలక ప్రశ్న.. ప్రపంచ విపత్తుల్లో వరదల శాతం ఎంత?
1556లో చైనాలోని ‘సాంగ్జీ’ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం వల్ల సుమారు 8,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో గత మూడున్నర దశాబ్దాలుగా దాదాపు 431 రకాల విపత్తులు సంభవించాయి. దీంతో సుమారు 4,800 కోట్ల అమెరికన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది.
విపత్తులు – ప్రాథమిక భావనలు
సహజ, సాంస్కృతిక వనరులను ధ్వంసం చేసి, ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే ప్రకృతి పరమైన, మానవ ప్రేరేపిత ఆకస్మిక సంఘటనలే విపత్తులు. విపత్తు అనే పదాన్ని ఇంగ్లిష్‌లో డిజాస్టర్ అంటారు. ఇది మధ్యయుగం నాటి ఫ్రెంచి పదం. దీన్ని మూడు భాషా పదజాలల నుంచి గ్రహించారు. అవి..
1) డస్ (Dus), ఆస్టర్ (Aster)
అనే గ్రీకు పదాలు.
2) డెస్ (Des), ఆస్ట్రే (Aster)
అనే ఫ్రెంచ్ పదాలు.
3) డిస్ (Dis), ఆస్ట్రో (Astro)
అనే లాటిన్ పదాలు
గ్రీకు, లాటిన్ భాషల్లో డిజాస్టర్ అంటే ‘దుష్టనక్షత్రం’ అని అర్థం.
విపత్తుల ముఖ్య లక్షణాలు
1. ఆకస్మికంగా సంభవిస్తాయి.
2. అతివేగంగా విస్తరిస్తాయి
3. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వనరులను ధ్వంసం చేస్తాయి.
4. ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తాయి.
5. ప్రకృతి వనరులను ధ్వంసం చేసి ఒక ప్రాంత సుస్థిరాభివృద్ధికి విఘాతం కలిగిస్తాయి.
క్రీ.పూ. 430లో ఏథెన్స్ నగరంలో ‘టైఫస్’ వ్యాధితో సంభవించిన నష్టాన్ని మొదటిసారిగా నమోదు చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. దీన్నే తొలి విపత్తు నమోదుగా భావిస్తారు. 1556లో చైనాలోని ‘సాంగ్జీ’ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం వల్ల సుమారు 8,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇప్పటి వరకు అత్యధిక ప్రాణ నష్టం జరిగిన విపత్తు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రీసెంట్ సొసైటీస్ (ఐఎఫ్‌ఆర్‌సీ) ప్రచురించిన ప్రపంచ విపత్తు నివేదిక–2010 ప్రకారం 2000 – 2009 మధ్య ప్రపంచ వ్యాప్తంగా విపత్తుల ప్రభావానికి గురైన వారిలో 85 శాతం మంది ఆసియా, పసిఫిక్ ప్రాంతానికి చెందినవారు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్‌నేషనల్స్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ (యూఎన్‌ఐఎస్‌డీఆర్) విడుదల చేసిన ‘గ్లోబల్ అసెస్‌మెంట్ రిపోర్ట్ –2011 ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వరదల ప్రభావానికి గురవుతున్న వారిలో 90 శాతానికి పైగా దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల ప్రజలు ఉన్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం 1995–2004 మధ్య సంభవించిన విపత్తుల వివరాలు..
1) వరదలు – 30 శాతం
2) తుపానులు – 21 శాతం
3) కరవు– 19 శాతం
4) మహమ్మారి వ్యాధులు – 15 శాతం
5) భూకంపాలు, సునామీలు – 8 శాతం
6) భూతాపాలు – 4 శాతం
7) హిమపాతాలు – 11 శాతం
8) అగ్ని పర్వతాలు – 1 శాతం
9) కీటకదాడులు – 1 శాతం
ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం.. భారతదేశంలో సంభవించే విపత్తుల వల్ల జాతీయ ఆదాయంలో ఏటా 2.25 శాతం నష్టం వాటిల్లుతోంది. ‘ప్రివెన్షన్ వెబ్ స్టాటిటిక్స్’ రిపోర్ట్ ప్రకారం భారత్‌లో గత మూడున్నర దశాబ్దాలుగా దాదాపు 431 రకాల విపత్తులు సంభవించాయి. వీటి ద్వారా సుమారు 1,43,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 కోట్ల మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వీటి ప్రభావానికి గురయ్యారు. సుమారు 4,800 కోట్ల అమెరికన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది. ఇవి ఇప్పటి వరకు భారతదేశంలో, ప్రపంచంలోనూ ఎక్కువసార్లు సంభవించిన విపత్తు ‘వరదలు’గా ఆ నివే దిక పేర్కొంది.
ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (ఐడీకేఎన్) రిపోర్ట్స్ ప్రకారం దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏదో ఒకవిపత్తుకు తరచు గురవుతున్నాయి. 25 ప్రదేశాలు విపత్తు భరిత ప్రాంతాలు. దీనికి కారణాలు..
1) భారతదేశంలోని విశిష్ట శీతోçష్ణస్థితి
2) అధిక జనాభా
3) సుదీర్ఘ తీరరేఖ
4) వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ,
పారిశ్రామికీకరణ
5) ఖనిజోద్గ్రహణం
6) అటవీ నిర్మూలన, గ్లోబల్ వార్మింగ్
విపత్తుల అవగాహన కోసం కింద పేర్కొన్నప్రాథమిక భావనల గురించి తెలుసుకోవాలి..
1. వైపరీత్యాలు: ఒక భౌగోళిక ప్రాంతంలో ఆస్తి, పర్యావరణ, ప్రాణ నష్టం కల్గించే శక్తి రూప ఆకస్మిక సంఘటనలే వైపరీత్యాలు. వైపరీత్య ధృతి, దాని ప్రభావ కాలం ఆధారంగా వైపరీత్యాలు రెండు రాకాలు..
ర్యాపిడ్– అన్‌సెట్ హజర్డ్స్ (Rapid - onset Hazards): ఒక ప్రాంతంలో ఆకస్మికంగా సంభవించి, కొద్ది కాలం మాత్రమే ప్రభావం చూపే వాటిని ర్యాపిడ్ అన్‌సెట్ హజర్డ్స్ అంటారు. భూకంపాలు, సునామీలు, ఆగ్నిపర్వత విస్పోటనాలు, భూపాతం, తుపానులు, వరదలు మొదలైనవి.
స్లో– అన్‌సెట్ హజర్డ్స్ (Slow - onset Hazards): ఒక ప్రాంతంలో నెమ్మదిగా సంభవించి, దీర్ఘ కాలం ప్రభావం చూపేవాటిని స్లో అన్‌సెట్ డిజార్డ్స్ అంటారు. కరవు, పర్యావరణ క్షీణత, చీడపీడలు, నెమ్మదిగా సంభవించే వరదలు మొదలైనవి.
1999లో విపత్తు నిర్వహణపై కె.సి. ఫంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అత్యున్నతాధికార కమిటీ’ దేశంలోని పలు ప్రాంతాల్లో పరిశోధించి 31 రకాల విపత్తులను గుర్తించింది. వీటిని ఐదు సబ్‌గ్రూప్‌లుగా విభజించింది.
2. దుర్భలత్వం: విపత్తు నష్ట తీవ్రతను పెంచే ఆ ప్రాంత పరిస్థితుల పరిధిని దుర్భలత్వం అంటారు. ఇది ప్రజల ఆర్థిక పరిస్థితి, లింగభేదం, పేదరికం, నిరక్షరాస్యత, వయసు, పట్టణీకరణ, జనాభా పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది.
3. సామర్థ్యం/సమర్థత: వైపరీత్యం వల్ల నష్ట΄ోయిన ఆస్తులు, వనరులను, జీవనో΄ాధిని పునరుద్ధరించుకోగల శక్తినే ‘సామర్థ్యం’ అంటారు.
4. విపత్కరస్థితి/ముప్పు: వైపరీత్యాలు, దుర్భలత్వ పరిస్థితుల మధ్య పరస్పర చర్యల కారణంగా ఊహించదగిన నష్టాలు జరిగే సంభావ్యతనే ‘విపత్కరస్థితి’ అంటారు. ఈ ముప్పు స్థాయి అధారపడే అంశాలు..
ఎ) వైపరీత్య స్వభావం
బి) వైపరీత్య ప్రభావానికి గురయ్యే
అంశాల దుర్భలత్వం
సి) ఆ అంశాల ఆర్థిక విలువ
మాదిరి ప్రశ్నలు
1. ‘విపత్తు’ అనే పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు?
ఎ) అరబిక్ బి) గ్రీకు
సి) లాటిన్ డి) ఫ్రెంచ్
2. కిందివాటిలో ర్యాపిడ్ అన్‌సెట్ వైపరీత్యం?
ఎ) భూకంపాలు బి) అగ్ని పర్వతాలు
సి) సునామీ డి) పైవన్నీ
3. 1999లో కె.సి.ఫంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘అత్యున్నతాధికార కమిటీ’ దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది?
ఎ) 20 బి) 10 సి) 31 డి) 21
4. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు నష్టాన్ని కలగించే శక్తి ఉన్న ఆకస్మిక సంఘటనలను ఏమంటారు?
ఎ) విపత్తులు బి) వైపరీత్యాలు
సి) దుర్భలత్వం డి) అపాయం
5. ‘విపత్తు’ అనేది దేని ఫలితం?
ఎ) వైపరీత్యం బి) దుర్భలత్వం
సి) విపత్కరస్థితి డి) ఎ, బి
6. 2010 ప్రపంచ విపత్తుల నివేదిక ప్రకారం 2000–09 మధ్య కాలంలో సంభవించిన విపత్తు బాధితుల్లో 85 శాతం ప్రజలు ఏ ప్రాంతానికి చెందినవారు?
ఎ) ఉత్తర ఆసియా
బి) ఆసియా పసిఫిక్
సి) ఆగ్నేయాసియా
డి) వాయవ్య ఆసియా
7. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత?
ఎ) 5 శాతం బి) 6 శాతం
సి) 7 శాతం డి) 8 శాతం
8. ప్రపంచ విపత్తుల్లో వరదల శాతం ఎంత?
ఎ) 20 శాతం బి) 30 శాతం
సి) 35 శాతం డి) 40 శాతం
9. విపత్తు అనేది ఒక సంఘటన అయితే దాని వల్ల కలిగేది?
ఎ) ప్రాణనష్టం
బి) జీవనోపాధి దెబ్బతినడం
సి) ఆస్తి నష్టం
డి) పైవన్నీ
10. వైపరీత్యం ఒక ప్రమాదకర సంఘటన అయితే అది కిందివాటిలో ఒక?
ఎ) భూకంపం బి) సునామీ
సి) వరద డి) పైవన్నీ
సమాధానాలు
1) డి; 2) డి; 3) సి; 4) బి;
5) డి; 6) బి; 7) డి; 8) బి; 9) డి; 10) డి.
గతంలో అడిగిన ప్రశ్నలు
☛ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడ ఉంది? – న్యూఢిల్లీ
☛ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక జర్నల్ పేరు? – డిజాస్టర్ అండ్ డెవలప్‌మెంట్
☛ ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 1996–2000 మధ్యకాలంలో విపత్తుల వల్ల భారత జాతీయ ఉత్పత్తిలో సుమారు ఎంత శాతం నష్టం వాటిల్లింది? – 2.25 శాతం
☛ జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఏ సంవత్సరంలో ఆమోదించింది? – 2009
☛ జనాభా మీద సార్థకంగా విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు? – మెరుగైన ప్రణాళికలు, సన్నాహక అవగాహన, నివారణ చర్యలు
☛ దేశంలో తుపానులు, తుపాను తరంగాలు, సునామీల వల్ల హానీ సంభవించగల తీర్రపాంత విస్తీర్ణం? – 5,700 కిలోమీటర్లు
☛ ఇండియాలో విపత్తు కార్యనిర్వాహక చట్టం ఏ సంవత్సరంలో రూపోందించారు? – 2005
☛ భారతదేశంలో ఏ నెలలో దుమ్ము తుపానులు ఎక్కువగా సంభవిస్తాయి? – మే
☛ వల్కానిక్ బారెన్ ద్వీపం ఎక్కడ ఉంది? – దక్షిణ అండమాన్
☛ సునామీ తరంగాలు/అలలు సంభవించడానికి కారణం? – సముద్రంలో భూకం΄ాలు
☛ ఏ దేశంలో సాధారణంగా భూకంపాలు సంభవించవు? – ఆస్ట్రేలియా
☛ 2005లో ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం ఎక్కడ జరిగింది? – జపాన్
☛ సార్క్ విపత్తు నిర్వహణ వెబ్‌సైట్? – www.saarc-sdmc.nic.in
☛ 1957లో నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ స్థాపించారు? – నాగపూర్
☛ రిక్టర్ స్కేల్‌తో కొలిచేది? – భూ కంపాల తీవ్రత
☛ సముద్రగర్భంలో సంభవించే భూకంపాన్ని ఏమంటారు? – సునామీ
☛ వరదలు రావడానికి ప్రధాన కారణం? – భారీ వర్షపాతం
☛ 1980–2010 మధ్యకాలంలో సంభవించిన భూకంపాల సంఖ్య? – 34
☛ సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది – న్యూఢిల్లీ
☛ సైక్లోన్ అనే గ్రీకు పదానికి అర్థం? – పాముచుట్లు
☛ సునామీలు అధికంగా ఎక్కడ సంభవిస్తాయి? – పసిఫిక్ మహాసముద్రం
☛ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేనిని తయారు చేస్తుంది? – నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్‌మేంట్
☛ విపత్తుల రకాలు? – జీవ సంబంధ, భూ సంబంధ, నీటి, వాతావరణ సంబంధ విపత్తులు
☛ పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక గ్రూపు ఎక్కడుంది? – టోక్యో
☛ నేషనల్ ప్లాట్‌ఫాం ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎక్కడ ఉంది? – న్యూఢిల్లీ
☛ జాతీయ విపత్తు నివారణ దినం? – అక్టోబర్ 29
☛ కేంద్ర జలకమిషన్ కింద ఏర్పడిన జాతీయ నీటి అకాడమీ ఎక్కడ ఉంది? – పుణే
☛ అకస్మాత్తుగా లేదా దురదృష్టంగా సంభవించి సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే సంఘటనే విపత్తు అని నిర్వచించింది? – ఐక్యరాజ్యసమితి
Tags
- Disaster Management
- groups exams
- appsc and tspsc groups exam
- disaster management in groups exams
- material and model questions
- material on disaster management for groups exams
- groups exam material and questions in disaster management
- Government Jobs
- police jobs exams
- groups exams for govt jobs
- floods in global disasters
- floods in global disasters for groups exams
- Education News
- Sakshi Education News
- gk questions with answers
- Competitive Exams