Skip to main content

విటమిన్లు

మానవ శరీరానికి 13 విటమిన్లు అవసరం. వీటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి నీటిలో కరిగేవి, కొవ్వుల్లో కరిగేవి. ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వుల్లో కరుగుతాయి. ఇవి కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయి. విటమిన్ బి, సిలు నీటిలో కరుగుతాయి. వీటిని శరీరం ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచుకోలేదు. కాబట్టి ఇవి లభించే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
  • మనిషి ఆహారంలో స్వల్ప మోతాదులో మాత్రమే అవసరమయ్యే కర్బన పోషకాలు విటమిన్లు.
  • విటమిన్లు శక్తి వనరులు కాదు.
  • ఒక విటమిన్ లేదా విటమిన్‌లోని ఒక భాగం లేదా విటమిన్ నుంచి ఏర్పడిన ఉత్పాదకం సహ ఎంజైమ్‌గా వ్యవహరిస్తూ రసాయనిక చర్యలో పాల్గొనే ఎంజైమ్‌లకు సహాయపడతాయి.
  • విటమిన్ అనే పదాన్ని కాసిమర్ ఫంక్ ప్రతిపాదించాడు. విటమిన్లను ఆంగ్ల అక్షరాల క్రమంలో నామకరణం చేసే పద్ధతిని ప్రతిపాదించింది జె.సి. డ్రుమాన్డ్‌.

విటమిన్లు ప్రధానంగా 2 రకాలు

  • కొవ్వులో కరిగేవి: ఎ, డి, ఇ, కె.
  • నీటిలో కరిగేవి: బి-కాంప్లెక్స్, సి

విటమిన్ - ఎ
విటమిన్-ఎ రసాయన నామం రెటినాల్. సాధారణ నామం జీరాఫ్తాల్మియా నిరోధక విటమిన్. ఆరోగ్యకరమైన దృష్టికి, సాధారణ ఆరోగ్యానికి ఇది అవసరం. ఈ విటమిన్ లోపిస్తే కంటిలోని కార్నియా దెబ్బతిని జీరాఫ్తాల్మియా సంభవిస్తుంది.
లభ్యత: క్యారెట్, పసుపు రంగులోని ఫలాలు, నారింజ, సొరచేప కాలేయం నూనె, ఆకుకూరలు, జంతువుల కాలేయంలో ఎక్కువగా లభిస్తుంది. శాకాహారంలో ఇది బీటా కెరోటిన్ రూపంలో లభిస్తుంది. పేగులోని సూక్ష్మజీవులు దీన్ని రెటినాల్‌గా మారుస్తాయి.

విటమిన్ - డి
దీని రసాయన నామం కాల్సిఫెరాల్. దీన్నే రికెట్స్ నిరోధక విటమిన్, సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. బలమైన ఎముకలు, దంతాలకు ఇది అవసరం. శరీరంలోని కాల్షియం, ఫాస్ఫరస్, జీవక్రియలను నియంత్రిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే చిన్నారుల్లో రికెట్స్ వ్యాధి సంభవిస్తుంది. ఎముకలు బలహీనపడి, వంకరలు తిరిగడం ఈ వ్యాధి లక్షణం. పెద్దల్లో ఈ విటమిన్ లోపం వల్ల ఎముకలు బలహీనపడి ఆస్టియోమలేసియా వ్యాధి సంభవిస్తుంది.
లభ్యత: శాకాహారంలో ఇది లభించదు. పాలు, గుడ్లు, కాడ్ చేప కాలేయం నూనె, జంతువుల కాలేయం, పుట్టగొడుగుల్లో సమృద్ధిగా లభిస్తుంది.

విటమిన్ - ఇ
దీని రసాయన నామం టోకోఫెరాల్. దీన్ని బ్యూటీ విటమిన్ లేదా వంధ్యత్వ నిరోధక విటమిన్ అంటారు. స్త్రీ, పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ఇది అవసరం. కాంతివంతమైన చర్మాన్ని ఇస్తుంది. దీని లోపం అరుదుగా సంభవిస్తుంది. ఇది లోపిస్తే పురుషుల్లో వంధ్యత్వం వస్తుంది, మహిళల్లో గర్భస్రావం జరుగుతుంది.
లభ్యత: ఫలాలు,కూరగాయలు, విత్తనాలు (బాదం, పిస్తా), చేపలు, మాంసం, చేప నూనె, కాలేయంలో లభిస్తుంది.

విటమిన్ - కె
దీని రసాయన నామం ఫిలోక్వినోన్ లేదా మెనాక్వినోన్. దీన్ని రక్తస్రావ నిరోధక విటమిన్ అని కూడా అంటారు. రక్త స్కంధన ప్రక్రియలో అనుబంధ రక్తస్కంధన కారకంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే గాయాలైనప్పుడు రక్తం ఆలస్యంగా గడ్డ కడుతుంది.
లభ్యత: పేగులోని సూక్ష్మజీవులు దీన్ని తయారుచేస్తాయి. కాలిఫ్లవర్, క్యాబేజి, ఆకుకూరలు, కాలేయం, మూత్రపిండాల్లో లభిస్తుంది.

విటమిన్ - సి (ఆస్కార్బిక్ ఆమ్లం)
ఇది స్కర్వి నిరోధక విటమిన్. బలమైన చిగుళ్లకు, నోటి ఆరోగ్యానికి ఇది అవసరం. ఇది లోపిస్తే స్కర్వి వ్యాధి సంభవిస్తుంది.
లక్షణాలు: చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు ఊడిపోవడం, నాలుకపై పుండ్లు ఏర్పడటం ఈ వ్యాధి లక్షణాలు.
లభ్యత: నారింజ, బత్తాయి, నిమ్మ లాంటి సిట్రస్ ఫలాలు, ఉసిరి, మాంసం, కాలేయంలో లభిస్తుంది.

విటమిన్ - బి1
దీని రసాయన నామం థయమిన్. బెరిబెరి నిరోధక విటమిన్ అని అంటారు. శక్తి విడుదల, నాడీవ్యవస్థ, రక్తప్రసరణ అభివృద్ధి వ్యవస్థకు అవసరం. దీనిలోపం ద్వారా బెరిబెరి వ్యాధి వస్తుంది. చిన్నారుల్లో తడి బెరి బెరి (ఛాతీలో నీరు నిండటం), పెద్దల్లో పొడి బెరిబెరి (చర్మం పొడిబారటం) సంభవిస్తుంది. పాలీన్యూరిటిస్ అనే నాడీ క్షీణత వ్యాధి సంభవిస్తుంది.
లభ్యత: పొట్టు తీయని అన్ని రకాల ధాన్యాలు, మాంసంలో లభిస్తుంది.

విటమిన్ - బి2
దీన్నే విటమిన్-జి లేదా ఎల్లో ఎంజైమ్ అని కూడా అంటారు. కొవ్వులు, పిండి పదార్థాల జీవక్రియలో పాల్గొంటుంది. ఈ విటమిన్ లోపిస్తే అరిబోఫ్లెవినోసిస్ అనే వ్యాధి వస్తుంది. నోటి అంచున పగుళ్లు ఏర్పడటం(ఖీలోసిస్/ యాంగ్యులర్ స్టొమాటిస్), నాలుక వాపు (గ్లోసైటిస్) ఈ వ్యాధి లక్షణాలు.
లభ్యత: పాలు, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని లాక్టోఫ్లెవిన్ అని, గుడ్ల పచ్చసొనలోనూ అధికంగా లభించడం వల్ల ఓవోఫ్లెవిన్ అని అంటారు. కాలేయంలోనూ ఉంటుంది కాబట్టి హెపటోఫ్లెవిన్ అని కూడా అంటారు. ఎండు ఫలాలు, కూరగాయలు, మాంసంలో లభిస్తుంది.

విటమిన్ - బి3
దీని రసాయన నామం నియాసిన్. నికోటినిక్ యాసిడ్ లేదా నికోటినమైడ్‌గానూ పిలుస్తారు. ఇది పెల్లగ్రా నిరోధక విటమిన్. ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థ, చర్మం, జీర్ణక్రియకు ఇది అవసరం. ఈ విటమిన్ లోపిస్తే పెల్లగ్రా వ్యాధి సంభవిస్తుంది. చర్మం ఎర్రగా కందడం(డెర్మటైటిస్), నీళ్ల విరేచనాలు(డయేరియా), మతిమరుపు (డెమెన్షియా) ఈ వ్యాధి లక్షణాలు. తీవ్రలోపం తలెత్తితే మరణించే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని 4డి/3డి సిండ్రోమ్ అంటారు.
లభ్యత: మాంసం, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది.

విటమిన్ - బి5
దీన్నే పాంటోథెనిక్ యాసిడ్ అని పిలుస్తారు. కో ఎంజైమ్-ఎ గానూ వ్యవహరిస్తారు. కొలెస్ట్రాల్, న్యూరోట్రాన్‌‌సమీటర్ల ఉత్పాదన, శక్తి విడుదలకు విటమిన్-బి5 అవసరం. దీనిలోపం వల్ల అరికాళ్లలో మంటలు కలిగే బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ వస్తుంది.
లభ్యత: మాంసం, గుడ్లు, బ్రెడ్‌లో లభిస్తుంది.

విటమిన్ - బి6
దీన్నే పైరిడాక్సిన్ లేదా పైర్డాక్సల్ ఫాస్ఫేట్ అంటారు. ప్రొటీన్ల జీవక్రియకు ఇది అవసరం. ఈ విటమిన్ లోపిస్తే చర్మం పొడిబారుతుంది. విపరీతమైన బలహీనత వస్తుంది. మార్నింగ్ డిసీజ్ అనే వ్యాధి సంభవిస్తుంది.
లభ్యత: మాంసం, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ, బాదంలో ఎక్కువ మోతాదులో లభిస్తుంది.

విటమిన్ - బి7
దీన్నే విటమిన్ -హెచ్, బయోటిన్ అని కూడా పిలుస్తారు. శక్తి విడుదల, అమైనో ఆమ్లాలు, గ్లైకోజన్ ఉత్పత్తికి అవసరం. పేగులోని సూక్ష్మజీవులు దీన్ని అందిస్తాయి. ఈ విటమిన్ చాలా అరుదుగా లోపిస్తుంది. ఉడికించని గుడ్డు తెల్లసొనలో ఎవిడిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బయోటిన్ వినియోగాన్ని అడ్డుకుంటుంది.

విటమిన్ - బి9
దీన్నే ఫోలిక్ యాసిడ్ అంటారు. ఎర్రరక్తకణాల పరిపక్వత, హీమోగ్లోబిన్ తయారీకి ఇది అవసరం. పిండం అభివృద్ధి, మానసిక వికాసానికి తోడ్పడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే మెగాలోబ్లాస్టిక్ లేదా మ్యాక్రోస్టిక్ అనీమియా వ్యాధి వస్తుంది. గర్భిణుల్లో ఇది తీవ్రంగా లోపిస్తే పుట్టబోయే పిల్లల్లో స్పైనా బిఫిడా అనే మానసిక వైకల్యం సంభవిస్తుంది
లభ్యత: స్ట్రాబెర్రీ, టమాట, కాలిఫ్లవర్, అరటి, క్యాబేజి, పాలకూర, నారింజల్లో లభిస్తుంది.

విటమిన్ - బి12
దీన్నే సైనోకోబాలమిన్ అంటారు. ఎర్రరక్తకణాల పరిపక్వత, హీమోగ్లోబిన్ తయారీకి అవసరం. ఈ విటమిన్ లోపిస్తే పెర్నిసియస్ అనీమియా సంభవిస్తుంది.
లభ్యత: మాంసాహారం, గుడ్లు, పాల లాంటి జంతు ఉత్పత్తుల్లో మాత్రమే లభిస్తుంది. మొక్కల్లో లభించదు.

విటమిన్ - బి17
దీన్నే యాంటి కేన్సర్ విటమిన్ అని అంటారు. వాస్తవానికి ఇది విటమిన్ కాదు. మొక్కల్లో కేన్సర్ నిరోధక లక్షణాలున్న రసాయనాలన్నింటినీ కలిపి బి17 అంటారు.

Published date : 12 Sep 2015 04:36PM

Photo Stories