Skip to main content

జీవ పరిణామసిద్ధాంతాలు

జీవ పరిణామం అంటే మడత విడవడం లేదా విచ్చుకోవడం లేదా దొర్లడం అని అర్థం. కాల క్రమేణా సరళ నిర్మాణం గల జీవులు క్లిష్ట నిర్మాణాలు గల జీవులుగా మారడాన్నే జీవ పరిణామం (Evolution) అంటారు. ‘పరిణామం’ అనే పదాన్ని తొలిసారి హెర్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించాడు. జీవులు నిరంతరం మారుతూనే ఉంటాయి అనే భావన జీవ పరిణామానికి మూలం. కేంద్రక పూర్వ, పరపోషిత బ్యాక్టీరియాల నుంచి కాల క్రమంలో ఏక కణ ప్రోటోజోవన్లు, అతి పెద్ద జంతువైన తిమింగలం, అతి పెద్ద వృక్షమైన సిక్వియా ఎలా ఆవిర్భవించాయి? అనే ప్రశ్నలకు సమాధానాలను జీవ పరిణామం చక్కగా వివరిస్తుంది.
భూమి ఆవిర్భావం
 • భూమి ఆవిర్భావాన్ని వివరించే సిద్ధాంతం కాస్మిక్ పరిణామం.
 • జేమ్స్‌జీన్స్‌ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
 • భూమి వయసు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలు.
 • కాస్మిక్ ధూళి, వాయువులు కలవడం వల్లే సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు ఏర్పడ్డాయని జీన్స్‌వివరించాడు. (సూర్యుడి వయసు సుమారు 5 బిలియన్ సంవత్సరాలు)
 • జీన్స్‌వాదం ప్రకారం భూమి మొదట వాయు రూపంలో ఉండి, కాల క్రమేణా ఉష్ణోగ్రత తగ్గడం వల్లద్రవ రూపంలోకి, చివరకు ఘన రూపంలోకి మారింది.
 • కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ (ఖండ చలన) సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జర్మనీ జియాలజిస్ట్ ఆల్‌ఫ్రెడ్ వెజ్‌నర్.
 • ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మొదట ఒకే పెద్ద ముక్కగా ఉండి, అనంతరం చిన్న ముక్కలై ఖండాలుగా ఏర్పడింది.
జీవం ఆవిర్భావం
 • భూమి ఏర్పడిన 1100 మిలియన్ సంవత్సరాల అనంతరం అంటే సుమారు 3,500 మిలియన్ సంవత్సరాల క్రితం జీవం (సముద్రంలో) ఏర్పడింది.
 • తొలుత ఏర్పడిన జీవి అవాయు పరపోషక బ్యాక్టీరియా.
 • ఈ అవాయు బ్యాక్టీరియాలు కిణ్వన ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసిన శక్తిని వినియోగించుకుంటాయి.
 • అవాయు పరపోషిత బ్యాక్టీరియాల నుంచి స్వయం పోషక బ్యాక్టీరియాలు ఆవిర్భవించాయి. వీటి నుంచి పరిణామ క్రమంలో నీలి ఆకుపచ్చ శైవలాలు, వృక్ష ప్లవకాలు, మొక్కలు ఏర్పడ్డాయి.
 • వాయు సహిత నిజకేంద్రక ఏక కణ పరపోషిత జీవుల నుంచి కాల క్రమంలో జంతు ప్లవకాలు, శిలీంధ్రాలు, జంతువులు ఆవిర్భవించాయి.
భూమి ఏర్పడినప్పుడు ఉన్న వాయువులు
 • హైడ్రోజన్ (H2)
 • మీథేన్ (CH4)
 • అమోనియా (NH3)
 • నీటి ఆవిరి (H2O)
 • వీటితో పాటు బహుశా కార్బన్ డై ఆక్సైడ్ (CO2), హైడ్రోజన్ సల్ఫైడ్ (H2S) కూడా ఉన్నాయని డార్‌నెల్ అనే శాస్త్రవేత్త తెలిపాడు.
భూమి ఏర్పడినప్పుడు లేని వాయువులు
ఆక్సిజన్ (O2), ఓజోన్ (O3).

మెరుపుల వల్ల (5000°c-6000°c) పైన పేర్కొన్న వాయువులు కలిసి.. చక్కెరలు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ప్యూరిన్లు, పిరమిడిన్‌లు, కేంద్రకామ్లాలు ఏర్పడ్డాయి.
ఇవన్నీ విపరీతమైన వర్షాల కారణంగా సముద్రంలోకి చేరాయి.
ఈ ప్రాథమిక పదార్థాలు కలిసి బిందువులు (కో సర్వేట్) గా ఏర్పడ్డాయి.
సముద్ర జలంలో ఏర్పడిన ఈ కో సర్వేట్‌లనే జీవ పూర్వ ద్రవం (ప్రీ బయాటిక్ సూప్) లేదా ఉష్ణ సజల పులుసుగా జె.బి.ఎస్ హల్డేన్ వర్ణించాడు. ప్రతి బిందువు చుట్టూ జీవ పదార్థ పొర ఏర్పడి పరపోషక, అవాయు శ్వాసక్రియ జరిపే సయనో బ్యాక్టీరియా వంటి జీవి ఏర్పడిందని ఒపారిన్, హల్డేన్‌లు వివరించారు.

జీవ ఆవిర్భావం గురించి శాస్త్రజ్ఞులుపతిపాదించిన భిన్న సిద్ధాంతాలు
ప్రత్యేక సృష్టివాదం:
ఈ భూమిపై ఉన్న జీవులన్నింటినీ దేవుడు సృష్టించాడని ఫాదర్ సారెజ్ తెలిపాడు.

యాదృచ్ఛిక సృష్టివాదం/నిర్జీవ సృష్టివాదం (ఎబయోజనిసిస్): ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు అరిస్టాటిల్, థేల్స్, ప్లాటో. ఈ సిద్ధాంతం ప్రకారం జీవులు యాదృచ్ఛికంగా నిర్జీవ పదార్థాల నుంచి ఏర్పడ్డాయి.
ఉదా: కప్పలు తేమ నేల నుంచి, పురుగులు, కీటకాలు కుళ్లుతున్న మాంసం నుంచి ఏర్పడ్డాయని వారు తెలిపారు. ఈ సిద్ధాంతాన్ని లూయీపాశ్చర్ వ్యతిరేకించాడు.

జీవ సృష్టివాదం (బయో జెనిసిస్ సిద్ధాంతం): ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ‘హంస - మెడ ప్లాస్క్’ ప్రయోగం ద్వారా నిరూపించిన వ్యక్తి లూయీపాశ్చర్. జీవులు తమలాంటి జీవుల నుంచి ఉద్భవిస్తాయని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.

ప్రళయత్వ సిద్ధాంతం/ప్రళయానంతర పునఃసృష్టి వాదం: ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జార్‌‌జ క్యువియర్. ఒక ప్రళయం సంభవించినప్పుడు భూమిపై గల జీవులు నశించి.. ప్రళయానంతరం కొత్త జీవులు ఆవిర్భవిస్తాయి.

కాస్మోజోయిక్/పాన్‌స్పెర్మియా సిద్ధాంతం: దీన్ని రిచ్‌టర్ ప్రతిపాదించగా థామ్సన్, హెల్మ్‌హోల్జ్, వాంటిగమ్‌లు బలపరిచారు. పాన్‌స్పెర్మియా సిద్ధాంతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన శాస్త్రవేత్త అర్హీనియస్. విశ్వమంతా జీవం నిరోధక సిద్ధ బీజాల (కాస్మోజువా/పాన్‌స్పెర్మియా) రూపంలో నిండి ఉందని, ఈ విశ్వంలో ఒక చిన్న మూల నుంచి జీవం ఏర్పడిందని తెలుపుతుంది.

జీవ పరిణామ సిద్ధాంతం/కోసర్వేట్ సిద్ధాంతం: ఎ.ఐ.ఒపారిన్, జె.బి.ఎస్.హల్డేన్‌లు దీన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం అకర్బన పదార్థాల నుంచి భౌతిక శక్తుల చర్యల వల్ల యాదృచ్ఛికంగా జీవం ఆవిర్భవించింది. ఈ విధంగా జీవుల పుట్టుక ఒక యాదృచ్ఛిక, స్వతఃసిద్ధ, రసాయనిక పరిణామం. కోసర్వేట్ సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా వివరించినవారు మిల్లర్, యూరె.

జీవ పరిణామ సిద్ధాంతాలు
శాస్త్రీయ ఆధారాలతో జీవ పరిణామాన్ని వివరించిన ముఖ్యమైన సిద్ధాంతాలు 4. అవి..
1. లామార్కిజమ్
2. డార్వినిజమ్
3. డీవ్రీస్ ఉత్పరివర్తన సిద్ధాంతం
4. నియో డార్వినిజమ్.

లామార్కిజమ్
జీవ పరిణామాన్ని శాస్త్రీయంగా మొదట వివరించిన శాస్త్రవేత్త జీన్ బాప్టిస్ట్ లామార్క్‌ (ఫ్రెంచ్).
లామార్క్‌ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని లామార్కిజమ్ అంటారు. లామార్కిజంలోని ముఖ్య ప్రతిపాదనలు..

1. పరిసర ప్రభావ సూత్రం: పరిసరాల్లో మార్పులు సంభవిస్తే జీవుల్లో మార్పులు వస్తాయి, ఆ మార్పులనే ఆర్జిత గుణాలు అంటారు.
ఉదా: 1.కొబ్బరి చెట్ల్లు - సూర్యరశ్మి 2. గొర్రెలు - ఉన్ని.
సూర్యరశ్మిలో పెరిగే కొబ్బరి చెట్టు నిటారుగా, ఎత్తుగా పెరిగి ఎక్కువ ఆకులను కలిగి ఉంటుంది.
నీడలో పెరిగే చెట్టు వంకరగా, తక్కువ ఎత్తు, తక్కువ ఆకులను కలిగి ఉంటుంది.
శీతల మండలాల్లో నివసించే గొర్రెలు అధిక బొచ్చును కలిగి, చలి నుంచి రక్షణ పొందుతాయి.
ఉష్ణ మండలంలో నివసించే గొర్రెలు తక్కువ బొచ్చును కలిగి ఉంటాయి.

2. ఉపయుక్త, నిరుపయుక్త సూత్రం: జీవి ఏ అవయవాలనైతే బాగా ఉపయోగిస్తుందో అవి అభివృద్ధి చెందుతాయి. ఏ అవయవాలనైతే ఉపయోగించదో అవి క్షీణిస్తాయి.
ఉదా: జిరాఫీ మెడ, పూర్వాంగాలు సాగడం (ఉపయుక్త సూత్రం)
పాముల్లో అంగాలు లోపించడం (నిరుపయుక్త సూత్రం)
ఉపయుక్త - నిరుపయుక్త సూత్రాన్ని అనుసరించి జీవుల్లో వచ్చిన మార్పులను కూడా ఆర్జిత గుణాలు అంటారు.

3. ఆర్జిత గుణాల అనువంశిక సూత్రం: పరిసర ప్రభావం, ఉపయుక్త- నిరుపయుక్త సూత్రం ద్వారా జీవుల్లో వచ్చిన ఆర్జిత గుణాలు (మార్పులు) అనువంశికంగా సంతానానికి చేరతాయి. ఇవి తరతరానికి అభివృద్ధి చెందుతూ, ఆ మార్పులు సంతానానికి చేరడం వల్ల్ల కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన జీవులు పూర్వీకులకు భిన్నంగా ఉంటాయి. ఆ జీవులనే కొత్త జాతి జీవులుగా పరిగణిస్తారు.
ఉదా: జిరాఫీ ఆవిర్భావం: పొట్టి మెడగల లేళ్ల వంటి జీవి నుంచి మెడ పొడవుగా ఉన్న జిరాఫీ ఏర్పడటం.
జల పక్షుల ఆవిర్భావం: జల పక్షులు భౌమ పక్షుల నుంచి ఏర్పడ్డాయి.
రాటిడే (ఎగరలేని పక్షులు) ఆవిర్భావం: ఎగిరే పక్షుల నుంచి కివీ, ఆస్ట్రిచ్, ఈము వంటి రాటిడే పక్షులు ఆవిర్భవించాయి.
లామార్క్‌ రాసిన గ్రంథం - ఫిలాసఫీ జులాజిక్ (1809).
బయాలజీ, ఇన్‌వర్టిబ్రేట్ పదాలను కూడా లామార్క్‌ ప్రతిపాదించాడు.

లామార్క్‌ సిద్ధాంతంపై అభ్యంతరాలు
 • ఒక జీవి (వ్యక్తి) తన జీవిత కాలంలో ఆర్జించిన ఆర్జిత గుణాలు అనువంశికంగా సంతానానికి చేరవు.
 • లామార్క్‌ సిద్ధాంతం తప్పని మొదట చెప్పిన వ్యక్తి అగస్ట్‌వీస్‌మన్
 • అగస్ట్‌వీస్‌మన్ బీజద్రవ్య సిద్ధాంతాన్ని (జర్‌‌మప్లాజమ్ థియరీ) ప్రతిపాదించాడు. బీజద్రవ్యంలో జరిగిన మార్పులే సంతానానికి చేరతాయని, 22 తరాల వరకు చుంచెలుకలపై ప్రయోగం చేసి నిరూపించాడు.
నియో లామార్కిజమ్
 • ఆక్షేపణలున్నప్పటకీ కొంత మంది శాస్త్రవేత్తలు లామార్క్‌ సిద్ధాంతాన్ని నమ్మి, మరిన్ని శాస్త్రీయ ఆధారాలతో వివరించిన సిద్ధాంతాన్నే నియో (నవీన) లామార్కిజమ్ అంటారు. వీరిని నియో లామార్క్‌ వాదులు అంటారు.
 • నియో లామార్క్‌ వాదుల్లో ముఖ్యులు- పాల్ కామరస్, గుయర్.

మాదిరి ప్రశ్నలు

1. జీవ పరిణామ వాదానికి సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని రూపొందించింది?
  1) హెర్బర్ట్ స్పెన్సర్ 
  2) చార్లెస్ డార్విన్
  3) జె.బి.లామార్క్‌  
  4) క్యువియర్

Published date : 07 Mar 2017 02:51PM

Photo Stories