Skip to main content

సమూల మార్పుల దిశగా.. ఏపీపీఎస్సీ

గ్రూప్-1, 2, 3.. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల మంది పోటీపడే పరీక్షలు. ఈ పరీక్షల విధానంలో మార్పులు తీసుకొచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అడుగులు వేస్తోంది! ఇప్పటికే పరీక్షలకు స్క్రీనింగ్, మెయిన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇక స్క్రీనింగ్ నుంచి మెయిన్‌కు ఎంపిక చేసే అభ్యర్థుల నిష్పత్తి, ఇతర ఎంపిక విధానాలపై కొత్త ప్రతిపాదనల దిశగా యోచిస్తోంది. ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి ప్రతిపాదిత నిబంధనలపై విశ్లేషణ...
కేటగిరీ వారీగా 1:12 లేదా 1:15 :
గ్రూప్-1, 2, 3 నియామక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్ పరీక్షకు ప్రస్తుతమున్న 1:50 ఎంపిక విధానానికి స్వస్తి పలకాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. కేటగిరీ (సామాజిక వర్గాలు) వారీగా 1:12 లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేయాలని చూస్తోంది. ఉదాహరణకు ఒక నోటిఫికేషన్‌లో నిర్దిష్టంగా ఒక రిజర్వ్‌డ్ కేటగిరీకి 100 పోస్టులు ఉన్నాయనుకుంటే.. 1:12 నిష్పత్తిలో 1200 లేదా 1:15 నిష్పత్తిలో 1500 మందిని ఆ కేటగిరీ నుంచి మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతమున్న 1:50 నిష్పత్తి కారణంగా కొన్ని కేటగిరీల నుంచి అర్హులు లభించడం లేదని, ముఖ్యంగా పీహెచ్, ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు అవకాశం లభించడం లేదనే కారణంతో ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే తదుపరి నోటిఫికేషన్‌లోనే కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపాయి.

స్క్రీనింగ్‌లో టాప్ మార్కులు వస్తే..
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థి ఎవరైనా, స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎక్కువ మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిస్తే.. స్క్రీనింగ్ టెస్ట్‌లో ఓపెన్ మెరిట్ జాబితాలోనే పరిగణనలో తీసుకుంటారు. సదరు కేటగిరీకి 1:12 నిష్పత్తిలో కేటాయించిన పోస్ట్‌ల సంఖ్యలో టాప్ మార్క్ పొందిన అభ్యర్థి స్థానంలో అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో టాప్ మార్క్‌తో ఓపెన్ కేటగిరీలో నిలిచి.. మెయిన్ ఎగ్జామినేషన్‌లో తక్కువ మార్కులు పొందితే.. మెయిన్ మెరిట్ జాబితా రూపకల్పలో సదరు స్క్రీనింగ్ టాపర్ కేటగిరీని పరిగణనలోకి తీసుకుని మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఉదాహరణకు బీసీ కేటగిరీకి చెందిన ఒక అభ్యర్థి స్క్రీనింగ్ టెస్ట్‌లో మొత్తం అభ్యర్థులకంటే అత్యధిక మార్కులు సాధిస్తే స్క్రీనింగ్ మెరిట్ లిస్ట్‌లో టాపర్‌గా అతణ్ణి ఓపెన్ మెరిట్‌లో చూపుతారు. కానీ అదే అభ్యర్థి మెయిన్‌లో తక్కువ మార్కులు సాధిస్తే.. అప్పుడు అతని కేటగిరీ(సామాజిక వర్గాన్ని) ఆధారంగా మెయిన్ మెరిట్ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు.
  • గ్రూప్-2, గ్రూప్-3 వంటి పరీక్షలకు భారీ సంఖ్యలో ఖాళీలతో నోటిఫికేషన్స్ విడుదల చేసినా మెయిన్ ఎగ్జామినేషన్‌ను మాత్రం ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు.

గ్రూప్-2 లేదా 3.. ఏదో ఒకటే :
ఏపీపీఎస్సీ నియామకాల పరంగా ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశం.. డిగ్రీ అర్హతగా నిర్వహించిన గ్రూప్-2, గ్రూప్-3 రెండు పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులు.. ఏదో ఒక సర్వీస్‌ను ఎంపిక చేసుకోవాలనే నిబంధన. గ్రూప్-2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలోనే గ్రూప్-3 వస్తే.. గ్రూప్-2ను వదిలేస్తారా లేదా కొనసాగుతారా అనే ఆప్షన్ లెటర్ తీసుకోనుంది. దీనివల్ల పోస్టుల భర్తీ సమయంలో ఖాళీలు మిగిలిపోని విధంగా వ్యవహరించొచ్చని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా స్పష్టంగా అభ్యర్థి సర్వీస్ ఆప్షన్‌ను తెలుసుకోవడం ద్వారా.. మెరిట్ జాబితాలో నిలిచిన ఇతర అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లవుతుందని పేర్కొంటున్నారు.

గ్రూప్-1, గ్రూప్-2 రెండూ రాస్తే..
గ్రూప్-2, గ్రూప్-3 విషయంలో ఏదో ఒక సర్వీస్ మాత్రమే అనే నిబంధన నేపథ్యంలో.. కొందరు సబ్జెక్టు నిపుణులు లేవనెత్తుతున్న సందేహం.. గ్రూప్-1, గ్రూప్-2 విషయంలో కమిషన్ నిర్ణయం ఎలా ఉంటుంది? అనేదే. గ్రూప్-1 రాసే అభ్యర్థులంతా గ్రూప్-2కు కూడా హాజరవుతారు. ఇలాంటప్పుడే ఏదో ఒక పోస్ట్/సర్వీస్ అనే నిబంధన విధిస్తే గ్రూప్-2 నుంచి గ్రూప్-1కు వెళ్లాలనుకునే వారికి ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల సంఖ్యను బేరీజు వేస్తే ఇలాంటి అభ్యర్థులు పదిమంది లోపే ఉంటారని, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని కమిషన్ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి నిబంధన విధిస్తే ముందుగా అత్యున్నత స్థాయి సర్వీసుల పరీక్ష ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుందని.. అప్పుడే కమిషన్ ఉద్దేశం నెరవేరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

గ్రూప్-1 ఎ, బి విధానం :
రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏపీపీఎస్సీ ఏర్పడినప్పటి నుంచి వినిపిస్తున్న వార్త.. గ్రూప్-1 పోస్టులు, గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను కలిపి, గ్రూప్-1 ఏ, 1 బీ పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం. ఇది ప్రభుత్వ ఆమోద ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలైతే కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్‌లోనే ఈ విధానం అమల్లోకి రానుందని కమిషన్ చైర్మన్ తెలిపారు. దీని ప్రకారం చూస్తే ఇకపై గ్రూప్-2ను కేవలం నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులకు మాత్రమే నిర్వహించే అవకాశముంది.

ఉమ్మడి సిలబస్ దిశగా....
దేశంలోని అన్ని సర్వీస్ కమిషన్లు జాతీయస్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు నిర్దేశించిన సిలబస్‌కు సరితూగేలా ఉమ్మడి సిలబస్‌ను రూపొందించాలని.. యూపీఎస్సీ కొన్ని నెలల కిందట ప్రతిపాదించింది. ఉమ్మడి సిలబస్‌లో 70 శాతం మేరకు సివిల్స్ సిలబస్‌ను.. 30 శాతం మేరకు స్థానికంగా ప్రాధాన్యమున్న అంశాలతో కూడిన సిలబస్‌ను రూపొందించే అవకాశం ఉంది. దీనిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటికే యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీలో ఈ నిర్ణయంపై అన్ని సర్వీస్ కమిషన్లు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఔత్సాహిక అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా సివిల్స్, గ్రూప్స్ కామన్ ప్రిపరేషన్ పరంగా సమయం ఆదా అవుతుందని అంటున్నారు.

ఇంటర్వ్యూలు తప్పనిసరి :
గ్రూప్-1, గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానం కచ్చితంగా అమలు కానుంది. కేవలం పుస్తకాలు చదవడం ద్వారా రాత పరీక్షలో మెరిట్ జాబితాలో నిలిచినా.. వ్యక్తిగతంగా, విధి నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలు లేకపోతే భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ విధానం అమలు కానుంది.

నాన్ సీరియస్ అభ్యర్థులను వడపోసేందుకే..
నాన్ సీరియస్ అభ్యర్థులను వడపోసేందుకే కొత్త నిబంధనలు! ఖాళీలు కొనసాగకుండా ఉండేలా చూసేందుకే గ్రూప్-2 లేదా గ్రూప్-3లో ఏదో ఒకటే అనే ఆప్షన్ నిబంధన రూపొందించాం. కొత్త నోటిఫికేషన్ల విషయానికొస్తే.. గరిష్ట వయోపరిమితి పెంపు జీవో వ్యవధి ముగిసేలోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికే దాదాపు అయిదు వేల పోస్ట్‌ల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలున్నాయి. వీటిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది. స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. డీఎస్సీకి సంబంధించి సిలబస్ పాఠశాల విద్యాశాఖ నుంచి జనవరి మొదటి వారంలోగా వచ్చే అవకాశం ఉంది. అది రాగానే నియామక ప్రక్రియ ప్రారంభిస్తాం. డీఎస్సీ నిర్వహణను కమిషన్ సరిగా చేపట్టలేదనే అభిప్రాయాలు సరికాదు. ఇంతకంటే భారీ సంఖ్యలో పోటీ పడిన గ్రూప్-1, 2, 3 ప్రక్రియలను సమర్థంగా పూర్తిచేశాం. కాబట్టి డీఎస్సీ విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడే వరకు వేచి చూడకుండా పరీక్షలో విజయానికి ప్రయత్నిస్తే ఆశించిన ఫలితం సొంతమవుతుంది.
- ప్రొఫెసర్ పి.ఉదయ్ భాస్కర్, చైర్మన్, ఏపీపీఎస్సీ.
Published date : 03 Jan 2018 11:18AM

Photo Stories