కార్యదర్శికి మార్గదర్శి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
లక్షల మంది నిరుద్యోగుల ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరదించుతూ.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్
సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) 1051 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తులు
ఆహ్వానిస్తోంది. చాలాకాలం తర్వాత నోటిఫికేషన్ వెలువడటంతో దరఖాస్తులు
రికార్డు స్థాయిలో వచ్చే అవకాశముందని అంచనా. అంటే... పోస్టులు తక్కువ...
పోటీ తీవ్రం అన్నమాట! ఇలాంటి తీవ్ర పోటీ పరిస్థితిలో పటిష్ట ప్రణాళికతో శ్రమిస్తేనే
పోస్టు దక్కే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో
ఏపీ పంచాయతీ కార్యదర్శి పరీక్ష విధానం, ప్రిపరేషన్ వ్యూహం...
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: మొదట స్క్రినింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్టు) లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం:
స్క్రినింగ్ టెస్టు (150 మార్కులు)
మెయిన్ ఎగ్జామినేషన్ (300 మార్కులు)
ప్రిపరేషన్ వ్యూహం
ఎంపిక విధానం: మొదట స్క్రినింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్టు) లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం:
స్క్రినింగ్ టెస్టు (150 మార్కులు)
విభాగం | ప్రశ్నలు | సమయం |
ఎ. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 75 | 75 ని. |
బి. గ్రామీణ అభివృద్ధి-సమస్యలు (ఏపీ ప్రత్యేక దృష్టితో) | 75 | 75 ని. |
మెయిన్ ఎగ్జామినేషన్ (300 మార్కులు)
పేపర్ | ప్రశ్నలు | సమయం |
1. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 150 | 150 ని. |
2. గ్రామీణాభివృద్ధి-సమస్యలు (ఏపీ ప్రత్యేక దృష్టితో) | 150 | 150 ని. |
ప్రిపరేషన్ వ్యూహం
- అభ్యర్థులు ముందుగా స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఒకే సిలబస్ ఉందని గుర్తించాలి. స్క్రినింగ్ టెస్టులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ,గ్రామీణాభివృద్ధి-గ్రామీణ ప్రాంత సమస్యలను ఒకే పేపర్‌లో రెండు విభాగాలుగా పేర్కొంటే.. మెయిన్స్‌లో వాటినే రెండు పేపర్లుగా మార్చి ఒక్కో పేపర్‌కు 150 మార్కులు కేటాయించారు. సిలబస్ (స్క్రినింగ్/మెయిన్స్)లో జనరల్‌స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, గ్రామీణాభివృద్ధి-సమస్యలు (ఏపీ ప్రత్యేక దృష్టి) నుంచి 12 చొప్పున ఉప అంశాలను కీలకంగా పేర్కొన్నారు.
- ముఖ్యాంశాలను గుర్తించాలి
- సిలబస్‌లో జాతీయ, అంతర్జాతీ ప్రాధాన్య అంశాలు, కరెంట్ అఫైర్స్ తొలి రెండు అంశాలుగా ఉన్నాయి. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్, ప్రాధాన్యాంశాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రిపరేషన్ పరంగా స్పష్టతకు రాగలుగుతారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ముఖ్య సంఘటనలు ప్రాధాన్యాంశాల కిందకు వస్తాయి. ఇందులో భాగంగా బ్రిక్స్, సార్క్ తదితర సదస్సుల గురించి చదవాలి.
- పరీక్షలో కరెంట్ అఫైర్స్ పాత్ర అత్యంత కీలకం. దీన్ని గుర్తించి 2018, సెప్టెంబర్ నుంచి పరీక్ష ముందు వరకు జరిగిన సమకాలీనాంశాలను చదవాలి. ఈ దిశగా రోజూ వార్తా పత్రికలు చదవడం, ముఖ్యాంశాలను నోట్స్ రాసుకోవడం లాభిస్తుంది. కరెంట్ అఫైర్స్ పరంగా గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్లో పి.వి.సింధు గెలుపు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (భారత్ నిలబెట్టుకుంది), ఇస్రో నిర్వహించిన ఉపగ్రహ ప్రయోగాలు తదితర కీలక అంశాలు ఉన్నాయి.
- జనరల్ సైన్స్‌కు సంబంధించి దైనందిన జీవితంతో ముడి పడిన అంశాలను చదవాలి. దీనికోసం ఎనిమిది నుంచి పదో తరగతి వరకు భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల పాఠ్యపుస్తకాలను చదవాలి. దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ల గురించి తెలుసుకోవాలి.
- పాలిటీ ప్రిపరేషన్‌లో భాగంగా రాజ్యాంగ సంబంధిత అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్న్‌నెన్స్ కార్యక్రమాల (ఏపీ ప్రత్యేక దృష్టి) గురించి చదవాలి. అలాగే పరీక్ష నాటికి తాజా ఎకనామిక్ సర్వే విడుదలవుతుంది. దీంతోపాటు ఎన్నికల సమయం కాబట్ట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ రెండింటిపైనా దృష్టిపెట్టాలి.
- విపత్తు నిర్వహణ
- జనరల్ స్టడీస్‌లో విపత్తు నిర్వహణ కీలకమని చెప్పొచ్చు. ఏపీపై తుపాన్ల ప్రభావం అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని హుద్‌హుద్, లైలా, గజ, తిత్లీ, పెథాయ్ తుపానుల గురించి తెలుసుకోవాలి. అలాగే విపత్తు రకాలు, నిర్వహణ పద్ధతులు, యంత్రాంగం తదితరాల గురించి అధ్యయనం చేయాలి.
- వీటితో పాటు సుస్థిర అభివృద్ధి, లాజికల్ రీజనింగ్, ఎన్విరాన్‌మెంటల్ ప్రొటక్షన్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలసిస్ కీలక అంశాలుగా ఉంటాయి.
- నిర్ణయాత్మకం.. ఇవే!
- స్కీనింగ్ టెస్టులో పార్ట్ బి, మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్-2లను పరీక్ష పరంగా నిర్ణయాత్మక శక్తులుగా అభివర్ణించొచ్చు. వీటిలో రాణించడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
- పరిణామ క్రమం
- భారత, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామక్రమాలు అత్యంత కీలక అంశాలుగా ఉంటాయి. ఇందులో భాగంగా ప్రాచీన, మధ్య, ఆధునిక కాలాల్లో జరిగిన గ్రామీణాభివృద్ధిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
- రుగ్వేదంలో పేర్కొన్న సభ, సమితి; కౌటిల్యుడు(మౌర్యులు) అర్థశాస్త్రంలో ప్రస్తావించిన ‘గ్రామిక’, అలాగే చోళులు కాలంలో గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి గురించి తెలిపే ఉత్తర మేరూరు శాసనం తదితరాల గురించి తెలుసుకోవాలి.
- మధ్యయుగంలో గ్రామీణ వ్యవస్థ కొంత నిరాదరణకు గురైందని చెప్పవచ్చు. ఈ కాలంలో భారతదేశాన్ని ఢిల్లీ సుల్తానులు, మొగలులు పాలించారు. ఢిల్లీ కేంద్రంగా పాలించిన సుర్ వంశానికి చెందిన షేర్షా సూరి గ్రామీణాభివృద్ధికి కొన్ని కీలక చర్యలు తీసుకున్నాడు. ఔత్సాహికులు ఆయా అంశాలను చదవాల్సి ఉంటుంది.
- ఆధునిక కాలం విషయానికొస్తే.. గవర్నర్ జనరల్ లార్డ్ మేయో(1870) స్థానిక ప్రభుత్వాలను పునరుద్ధరించాడు. తదనంతరం లార్డ్ రిప్పన్(స్థానిక స్వపరిపాలన పితామహుడు) తీసుకొచ్చిన స్థానిక ప్రభుత్వాల చట్టం 1882తోపాటు భారత కౌన్సిల్ చట్టం 1892, రాయల్ కమిషన్ 1907, మింటో మార్లే సంస్కరణలు 1909, భారత ప్రభుత్వ చట్టం 1919, 1935 తదితరాలను అధ్యయనం చేయాలి.
- స్వాతంత్య్రానంతరం.. కమిటీలు
- రాజ్యంగంలోని ఆర్టికల్40(ఆదేశిక సూత్రాలు) స్థానిక ప్రభుత్వాల ఏర్పాటును సూచిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం 1952, అక్టోబర్ 2న సమాజ అభివృద్ధి పథకం(తొలి గ్రామీణాభివృద్ధి పథకం)ను ప్రారంభించింది. దీనికి కొనసాగింపుగా 1953లో జాతీయ విస్తరణ సేవల పథకం(నెస్) తీసుకొచ్చింది. తదనంతర కాలంలో జాతీయ, రాష్ర్ట స్థాయిల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరు పరిశీలన, తగిన సూచనల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలుకమిటీలను నియమించాయి. ఆయా కమిటీల వివరాలు, సిఫార్సులు, వాటి అమలు తీరుపై మూడు నుంచి అయిదు ప్రశ్నలు వస్తున్నాయి.
వ్యత్యాసం ఇదే..! పోటీ పరీక్షల్లో తెలివైన వ్యూహంతో కొంతమంది విజేతలుగా నిలుస్తుంటే.. సరైన వ్యూహం లేక మరికొందరు పోటీలో వెనకబడిపోతున్నారు. సిలబస్ పరంగా గతానికి ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. జనరల్ స్టడీస్‌లో అడిగే ప్రశ్నలు ఇతర ఏపీపీఎస్సీ పరీక్షల స్థాయిలోనే ఉంటాయి. గ్రామీణాభివృద్ధి పథకాలు, వివిధ పథకాలు-అమలు, పథకాల ఏకీకరణ, లబ్ధిదారులు, లక్ష్యాల గురించి అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్‌లో కరెంట్ అఫైర్స్‌ను అన్వయించే విషయంలోనే ప్రధానంగా విజేతలకు, పరాజితులకు మధ్య తేడా కనిపిస్తుంది. కరెంట్ అఫైర్స్‌పై పట్టుతోనే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు గుర్తించగలం. వివిధ పథకాల కింద స్థానిక సంస్థలకు లభిస్తున్న నిధులు, ఆదాయ వ్యయాలు, అకౌంటింగ్ అంశాలు పంచాయతీ కార్యదర్శి పరీక్షలో ప్రత్యేకమైనవి. కాబట్టి ఇతర పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సదరు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. 73, 74 రాజ్యాంగ సవరణలు, మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాలు, మైక్రో ఫైనాన్స్, కమిటీలు-సిఫార్సులు తదితరాలు పరీక్షలో కీలకంగా నిలుస్తాయి. ప్రిపరేషన్ పరంగా ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)లో లభించే సమాచారం అభ్యర్థులకు లాభిస్తుంది. - బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల నిపుణులు. |
Published date : 16 Jan 2019 12:22PM